Friday, May 17, 2024

లష్కరే ఉగ్రవాదిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల‌న్న అమెరికా, మోకాలడ్డుతున్న చైనా

26/11 ముంబై దాడుల ప్రధాన నిందితుడైన సాజిద్‌ మీర్‌కు చైనా బాసటగా నిలిచింది. అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా బ్లాక్‌లిస్టులో పెట్టాలనే ప్రతిపాదనను బీజింగ్‌ అడ్డుకుంది. ఐరాసలో చేసిన ఈ తీర్మానానికి వ్యతిరేకంగా చైనా వ్యవహరించింది. లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)ఉగ్రవాది సాజిద్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలంటూ అమెరికా ప్రతిపాదన ప్రవేశపెట్టింది. దీనికి భారత్‌ మద్దతిచ్చింది. ఐరాస భద్రతా మండలి 1267 అల్‌ఖైదా ఆంక్షల కమిటీలో సాజిద్‌మీర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాలనే చర్యను చైనా అడ్డుకుంది.

సాజిద్‌ తలపై 5 మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ ఉంది. ఈ ప్రతిపాదన ద్వారా ఆతడి ఆస్తులను స్తంభింపజేయడం, ప్రయాణాలపై ఆంక్షలు, ఆయుధాలపై నిషేధం ఉంటుంది. గతనెలలో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడైన అబ్దుల్‌ రవూఫ్‌ అజార్‌ను బ్లాక్‌లిస్టులో చేర్చాలన్న తీర్మానాన్నీ సాంకేతికంగా చైనా నిలుపుదల చేసింది. ఇక ఆర్థిక ఆంక్షల టాస్క్‌ఫోర్స్‌ గ్రే జాబితా నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్‌, జూన్‌లో సాజిద్‌మీర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించింది. కానీ, ముంబై దాడుల్లో అతని ప్రమేయంపై చర్యలు మాత్రం చేపట్టలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement