Sunday, May 19, 2024

Iceland | 14 గంటలు, 800 భూకంపాలు… ఉబికి వస్తున్న లావా

ఐస్‌లాండ్‌ దేశపు నైరుతి రేక్‌జెన్స్‌ పెనిన్సులాను 14 గంటల్లో వరుసగా 800 భూకంపాలు వణికించిన అనంతరం అక్కడి ప్రభుత్వం అత్యయిక పరిస్థితిని విధించింది. ”గ్రిండావిక్‌కు ఉత్తరంగా సుంద్న్‌జుకాగిగర్‌ వద్ద తీవ్రమైన భూకంపం చోటు చేసుకున్న కారణంగా పౌరుల భద్రత దృష్యా అత్యయిక పరిస్థితిని జాతీయ పోలీస్‌ చీఫ్‌ విధించారు” అని పౌర రక్షణ, అత్యవసర నిర్వహణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇలా వరుస భూకంపాలు రావడం అగ్నిపర్వతంలో పేలుడు చోటు చేసుకొని లావా ఉద్భవించడానికి దారి తీస్తుందని తెలిపింది. మరికొద్ది రోజుల్లో లావా ఉద్భవించే అవకాశం ఉందని ఐస్‌లాండ్‌ వాతావరణ శాఖ(ఐఎంవో) వెల్లడించింది. వరుస భూకంపాలు చోటు చేసుకున్న ప్రాంతానికి నైరుతి దిక్కులో దాదాపు 4,000 మంది ప్రజలతో కూడిన గ్రిండావిక్‌ గ్రామం ఉంది. లావా ఉద్భవించిన పక్షంలో గ్రామం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

స్థానిక కాల మానం ప్రకారం శుక్రవారం సాయంత్రం దాదాపు 5.30 గంటలకు దేశరాజధాని రేక్‌జావిక్‌కు దాదాపు 40 కి.మీ.ల దూరంలో, దేశపు దక్షిణ తీర ప్రాంతంలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. భూకంపాల తాకిడికి ఇళ్ళలో కిటికీలు, సామాన్లు ధ్వంసమైపోయాయి. ఐఎంవో ప్రాథమిక గణాంకాల ప్రకారం గ్రిండావిక్‌కు ఉత్తరంగా 5.2 తీవ్రతతో అతి పెద్ద భూకంపం సంభవించింది.

- Advertisement -

భూ ప్రకంపనల ధాటికి గ్రిండావిక్‌కు నైరుతి దిక్కున దెబ్బ తిన్న ఒక రహదారిపై రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అక్టోబర్‌ మాసం నుంచి ఇప్పటి వరకు 24,000 భూప్రకంపనలు సంభవించాయని, శుక్రవారం అర్థరాత్రి నుంచి మొదలై మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 800 భూకంపాలు వరుసగా చోటు చేసుకున్నాయని ఐఎంవో వెల్లడించింది.

భూగర్భం నుంచి ఉబికి వస్తున్న లావా

దాదాపు ఐదు కి.మీ.ల లోతున భూగర్భంలో పేరుకుపోయిన లావా పైకి ఉబికి రావడం మొదలైందని, అది కొద్ది రోజుల్లో భూతలంపైకి ఉబికి రావొచ్చునని ఐఎంవో హెచ్చరించింది. అలా ఉబికి వచ్చిన లావా గ్రిండావిక్‌ గ్రామం వైపు కాకుండా ఆగ్నేయం, పశ్చిమ దిక్కువైపునకు ప్రవహిస్తుందని తెలిపింది. అయినప్పటికీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గస్తీ తిరిగే థోర్‌ నౌకను గ్రిండావిక్‌ గ్రామానికి పంపిస్తున్నట్టు పౌర రక్షణ శాఖ తెలిపింది. గ్రిండావిక్‌తో పాటుగా దక్షిణ ఐస్‌లాండ్‌లో మరో మూడు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో భాగంగా అత్యవసర శిబిరాలు, సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

విద్యుదుత్పాక కేంద్రం, బ్లూలాగూన్‌ పర్యాటక కేంద్రం మూసివేత

గ్రిండావిక్‌కు సమీపంలో విలాసవంతమైన హోటళ్ళు, స్పాలతో పేరొందిన పర్యాటక ప్రాంతం బ్లూ లాగూన్‌ను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం మూసివేశారు. రేక్‌జెన్స్‌ పెనిన్సులాలో 30,000 మందికి విద్యుత్‌, నీటిని సరఫరా చేసే స్వర్ట్‌సెంగి విద్యుత్పాదక కేంద్రాన్ని మూసివేశారు. లావా వెల్లువెత్తిన సమయంలో విద్యుత్పాదక కేంద్రాన్ని, అందులో పనిచేస్తున్న సిబ్బందిని రక్షించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

రెండేళ్ళలో మూడు సార్లు లావా వెల్లువ

రేక్‌జేన్స్‌ పెనిన్సులాలో 2021 సంవత్సరం నుంచి అదే సంవత్సరం మార్చిలో ఒకసారి, 2022 ఆగస్టులో రెండవసారి, 2023 జులైలో మూడవసారి అన్నట్టుగా మూడు సార్లు లావా వెల్లువెత్తింది. లావా ఉబికి వచ్చిన ప్రాంతాలు మౌలిక సదుపాయాలు లేదా జనావాసాలు ఉన్న ప్రాంతాలకు చాలా దూరంలో ఉన్నాయి. ఐరోపాలో అత్యధిక సంఖ్యలో 33 అగ్ని పర్వతాలు ఐస్‌లాండ్‌లో ఉన్నాయి. 2010 ఏప్రిల్‌ నెలలో ఐస్‌లాండ్‌కు దక్షిణంగా ఒక అగ్నిపర్వతం పెద్ద ఎత్తున పేలడంతో ఒక లక్ష విమాన సేవలు రద్దు చేశారు. కోటి మందికి పైగా పర్యాటకులు ఐస్‌లాండ్‌లో చిక్కుకొనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement