Thursday, May 9, 2024

60,208 ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీ.. 32 కాలేజీల్లో 100 శాతం నిండిన సీట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఇంజనీరింగ్‌ మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మొదటి విడతలో 60,208(84.45శాతం) సీట్లను విద్యార్థులకు కేటాయించారు. మంగళవారం మొదటి విడత ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 176 ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో మొత్తం 71,286 ఇంజనీరింగ్‌ సీట్లకు గానూ 60,208 సీట్లను కేటాయించగా 11,078 సీట్లు మిగిలిపోయాయి. 16 ప్రభుత్వ యూనివర్సిటీ 4845 సీట్లకు గానూ 4118 సీట్లు భర్తీకాగా 727 సీట్లు మిగిలాయి. రెండు ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో 1460 సీట్లకు 1138 సీట్లను కేటాయించగా 322 సీట్లు మిగిలాయి. 158 ప్రైవేట్‌ కాలేజీల్లో 64981 సీట్లకు 54952 సీట్లు భర్తీకాగా 10029 సీట్లు మిగిలినట్లు అధికారులు వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 4943 సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. ఒక యూనివర్సిటీ, 31 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండిపోయాయి. ధ్రువపత్రాల పరిశీలనకు 74,334 మంది హాజరయ్యారు.

కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకు డిమాండ్‌…

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఐటీ అనుబంధ కోర్సులకు అభ్యర్థుల నుంచి డిమాండ్‌ ఉండడంతో 98.49 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం 41,506 సీట్లకు గానూ 40,878 సీట్లు భర్తీ కాగా 628 సీట్లు మాత్రమే మిగిలాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ బిజినెస్‌ సిస్టం, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌లో 99.91 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంఫర్మేషన్‌ టెక్నాలజీలో 99.76 శాతం, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌(డాటా సైన్స్‌) కోర్సులో 99.64 శాతం సీట్లు నిండిపోయాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్రికల్‌ బ్రాంచ్‌లో 80.96 శాతం, సివిల్‌ మెకానికల్‌ అలైడ్‌ కోర్సుల్లో మొత్తంగా 36.75 శాతం మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఫుడ్‌ టెక్నాలజీ, డైరియింగ్‌, మైనింగ్‌ ఇంజనీరింగ్‌, టెక్స్టైల్‌ టెక్నాలజీ తదితర కోర్సుల్లో 56.32 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తంగా 71,286 సీట్లల్లో 60208(84.45 శాతం) సీట్లు భర్తీ కాగా 11078 సీట్లు మిగిలాయి. ఈనెల 13 వరకు ఫీజును చెల్లించి, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని అధికారులు సూచించారు. సీటు పొందిన అభ్యర్థులు తమ అలాట్‌మెంట్‌ కార్డును వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement