Friday, May 17, 2024

Today’s Editorial – వ‌డ‌గాల్పులు … వంద‌ల‌లో అస్వ‌స్థులు…

వేసవి కాలంలో ఎండలు సహజం. ఇందులో విశేషం ఏముందని ఎవరైనా అడగవచ్చు. కానీ, వేసవిలో రోహిణి కార్తె వెళ్లిన తర్వాత ఎండలు తగ్గుముఖం పడతాయని చిరకాలంగా అనుభవంలో ఉన్న విషయం. ఈసారి రోహిణి వెళ్లిన తర్వాత కూడా ఎండలు కొండల్ని పిండి చేస్తున్నాయి. మరో ఐదు రోజులు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంటుందని వాతావరణ కేంద్రాలు అందిస్తున్న సమాచారం గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. బయట తిరగకుండా ఇంట్లో కూర్చున్న వారు కూడా ఎండల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటి ఎండల తో రైలు పట్టాలు కరిగి పోతున్నాయి. అందువల్ల రైలు ప్రమాదాలు సంభవిస్తే అది మానవ తప్పిదమని అనలేం. ఈ ఎండలకు ఇంతవరకూ వందమందిపైగా మరణించారు. వీరిలో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లకు చెందిన వారు చెరిసగం ఉంటారు. ఎండలకు నేలకొరుగుతున్న వారిలో వృద్ధులే ఎక్కువ. వీరు కాక, అస్వస్థులై ఆస్పత్రు ల్లో చికిత్స పొందుతున్న వారు ఐదొందల మంది వరకూ ఉంటారు.

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో సమీపంలో నిగోహన్‌ స్టేషన్‌ వద్ద పట్టాలు కరిగిపోగా లోకో పైలట్‌ ఫిర్యాదుపై అధికారులు వెంటనే మరమ్మతులు చేయిం చారు. ఇది మన దృష్టికి వచ్చిన ఘటన. ఇలా మన దృష్టికి రాకుండా ఎన్ని జరుగుతున్నాయో లెక్కలేదు. ఇటీవల కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం తర్వాత రైల్వే సిబ్బందిని ఆ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. రైలు ప్రమాదాల మాట అటుంచి ఎండల వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరగిపోతున్నాయి. రోడ్లపై వాహనాల రాకపోకలు తక్కువగా ఉండవచ్చన్న భావనతో రాకెట్‌ స్పీడ్‌తో లారీలు, ఇతర భారీ వాహనాల ను నడుపుతున్నారు. కార్ల సంగతి సరేసరి. ఈ అతివేగం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఎండల వల్ల కొన్ని ప్రాంతాల్లో చేతికి అందివచ్చిన పంటలు, ముఖ్యంగా, మిర్చి పంట రంగు మారిపోతోందని రైతులు వాపోతు న్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో నీటి కొరత తీరినా, మిగిలిన ప్రాంతాల్లో సాగునీటి, తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది తెలంగాణలో మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల్ని ముందే నింపుకోవ డం వల్ల వేసవి ఇబ్బందులు పెద్దగా కానరావడం లేదని చెబుతున్నారు. అలాగే, హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతం పెరగడంవల్ల వడ గాడ్పుల ప్రభావం తక్కువగానే ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొక్కలు పెంచే ప్రదేశాల్లో వడగాడ్పుల ప్రభావం తక్కువే. అయితే, చెరువులు లేని ప్రాంతాల్లో ఎండ ప్రతాపం వల్ల నీటి కొరత ఎదుర్కోవల్సి వస్తోంది. మెట్ట ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేసవి ప్రతాపం మిక్కుటంగా ఉంది. వేసవి లో రికార్డు స్థాయిలో కరెంట్‌ వాడకం జరుగుతోందని ఆ శాఖ వారు ప్రచారమైతే ఇస్తున్నారు కానీ, చాలా చోట్ల కరెంట్‌ కోతలు యథాతథంగా అమలు జరుగుతు న్నాయి. కొన్ని ప్రాంతాల్లో పగలంతా కరెంట్‌ తీసేస్తున్నా రన్న ఫిర్యాదులు వస్తున్నాయి.

- Advertisement -

ఎండలకు తోడు వడగాడ్పులు ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాయి. ఈ ఏడాది వడగాడ్పులు 2012 నాటి రికార్డులను బద్దలు కొట్టాయని చెబుతున్నారు. ఒక్క బీహార్‌లోనే వడగాడ్పు లకు ఇంతవరకూ 44 మంది మరణించినట్టు చెబుతు న్నారు. బీహార్‌లోని ప్రధాన ప్రాంతాలన్నీ అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. రాజధాని పాట్నా కేపిటల్‌ రీజియన్‌ ప్రాంతంలో ఉండటం వల్ల కాస్తంత మెరుగు గా ఉన్నప్పటికీ, ఆర్వా, భోజ్‌పూర్‌, బక్సర్‌, రహతస్‌, తదితర ప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంది. గార్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన బెంగళూ రులో కూడా ఎండల ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఎక్కడికక్కడ చెట్లను నరికివేయడం వల్ల ఈ దుస్థితి ఏర్పడుతోందని పర్యావరణ హితైషులు వాపోతున్నారు. పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో పరిస్థితి కీ, ఇప్పటి పరిస్థితికీ తేడా అదేనని అంటున్నారు.

వేసవి కారణంగా కూరగాయల ధరలు చుక్కలంటడంతో మధ్యతరగతి వర్గాలు, సామాన్యులు ఎన్నో ఇబ్బందుల కు గురి అవుతున్నారు. పండ్లు అన్నవే ఎక్కడా కనిపించ డంలేదు. అకాల వర్షాల కు మామిడి చెట్లు కూలి పోవడం, కాయలు రాలిపోవ డంతో మామిడి పండ్ల మాట వినిపించడం లేదు. వచ్చే ఐదు రోజుల్లో ఒడిషా, జార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రా ల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. డీహైడ్రేషన్‌ వంటి వ్యాధులు రాకుండా వైద్య బృందాలు ఎక్కడికక్కడ పరీక్షలు జరుపుతూ మందులను పంపిణీ చేస్తున్నాయి. అయితే, ఈ కార్యక్రమాలన్నీ నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు మంచినీరు, మందుల సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. వేసవి ప్రభావం పెళ్లిళ్లపైన, ప్రయాణాలపైన పడుతోంది. ఎంత కావల్సినవారైన శుభకార్యాలకు ఫోన్లలోనే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement