Friday, June 14, 2024

నేటి సంపాదకీయం – రాహుల్‌ అపరిపక్వత

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి రాజకీయాల్లోనే కాక, దేశ చరిత్ర విషయంలో పరిపక్వత లేదని మరోసారి తనకు తానే రుజువు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు కురిపించే క్రమంలో లోక్‌సభలో చేసిన ప్రసంగం ఆయనలోని అపరిపక్వతకే అద్దం పట్టింది. చారిత్రక విషయాల గురించి మాట్లేడటప్పుడు సమగ్రంగా అధ్యయనం చేయకపోతే ఇలాంటి చేదు అనుభవాలు తప్పవని ఆయన ఇప్పటికైనా తెలుసుకోవాలని సీనియర్‌ నాయకుడు, అన్న మాటల్లో నిజం ఎంతో ఉంది. ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్లనే పొరుగుదేశాలు మనకు వ్యతిరేకంగా ఒకటయ్యాయంటూ రాహుల్‌ చేసిన విమర్శలో నిజం లేదని నట్వర్‌ సింగ్‌ ఒక్క ముక్కలో తేల్చిపారేశారు. రాహుల్‌ ముత్తాత అయిన తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ కాశ్మీర్‌ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుకుని వెళ్ళిన సంగతి రాహుల్‌కి తెలియకపోవడం దురదృష్టకరమని నట్వర్‌ సింగ్‌ ఒక ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. అంతేకాక, చైనా, పాకిస్తాన్‌లు ఇప్పుడు కొత్తగా కుమ్మక్కు కాలేదనీ, ఈ రెండుదేశాల మధ్య 1960వ దశకం నుంచి మైత్రి కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత్‌ ఏకాకి అయిందన్న రాహుల్‌ ఆరోపణలో సత్యం లేదని ఆయన కొట్టివేశారు.

మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానం ఏ మాత్రం విఫలం కాలేదనీ, రాహుల్‌ ఆరోపణలను తిప్పికొడుతూ, విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఇచ్చిన సమాధానంలో రాహుల్‌ అపరిపక్వతను బయటపెట్టారని అన్నారు. నిజానికి 1963లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే షాక్సాగమ్‌ లోయను పాకిస్తాన్‌ చైనాకు అక్రమంగా కట్టబెట్టిందని విదేశాంగ మంత్రి జైశంకర్‌ రాహుల్‌ ఆరోపణను ఖండిస్తూ స్పష్టం చేశారు. భారత్‌ తన సరిహద్దులను కాపాడుకునే విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునే యత్నాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆక్సాయ్‌ చిన్‌ విషయంలో రాహుల్‌ చేసిన ప్రస్తావన చరిత్రపై ఆయన అపరిపక్వతకు నిదర్శనమనీ, చైనా దురాక్రమణ సమయంలో పండిట్‌ నెహ్రూ ఉదారంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పటికీ ఉన్నాయని అన్నారు. నట్వర్‌ సింగ్‌ యూపీఏ తొలివిడత హయాంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. ఆయనకు విదేశాంగ విషయాలు కరతలామలకం. 1962లో చైనా దురాక్రమణ సమయంలో మన సేనలు బలహీనంగా ఉన్నాయనీ, ఇప్పుడు బాగా బలోపేతం అయ్యాయనీ, పొరుగుదేశాలు దుస్సాహసానికి ఒడిగడితే భారత్‌ సేన సమర్ధవంతంగా తిప్పికొట్టగలదని గాల్వాన్‌ లోయలో జరిగిన సంఘటనలోనూ, అంతకుముందు జరిగిన డోక్లామ్‌ సంఘటనలోనూ రుజువైందని ఆయన అన్నారు.

రాహుల్‌ ప్రధానమంత్రిపై విమర్శలు చేసే క్రమంలో చారిత్రక అంశాలను తప్పుగా ప్రస్తావించి దేశ ప్రజలను పెడతోవ పట్టిస్తున్నారంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు.భారత దేశం పొరుగుదేశాలతో కాదుకదా, మరే దేశంతోనూ యుద్ధాన్ని కోరుకోవడం లేదనీ, అదే సందర్భంలో తన ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలోఎటువంటి రాజీ పడబోదని విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. మహా మార్గంలో భాగమైన ఆర్థిక నడవ (ఎకనామిక్‌ కారిడార్‌)ని ఆక్రమిత కాశ్మీర్‌ మీదుగా నిర్మించడం పట్ల మన దేశం నిరసన తెలియజేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా శాశ్వత కట్టడాలను చేపట్టడం పట్ల కూడామన దేశం నిరసన తెలియజేసింది. అలాగే, ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద సంస్థల స్థావరాలపై సర్జికల్‌ స్ట్రయిక్‌ను మోడీ ప్రభుత్వం జరిపించింది. అలాగే, సరిహద్దులనుంచి జిహాదీల అక్రమ ప్రవేశాలు కూడా గతంలో కన్నా బాగా తగ్గాయి. కాశ్మీర్‌ విషయంలో రాహుల్‌ చేసిన ఆరోపణ కూడా ఆయన అపరిపక్వతను బయట పెట్టింది. కాశ్మీర్‌ విభజన వల్ల ముఖ్యంగా లడఖ్‌ని వేరు చేయడం వల్ల పాకిస్తాన్‌ కన్నా చైనా ఎక్కువ ఉక్రోషాన్ని బయటపెట్టింది. లడఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం వల్ల చైనా ఎత్తులు చిత్తయ్యాయి. రాహుల్‌ చారిత్రక విషయాల్లో గతంలో కూడా ఇలా మాట్లాడి విమర్శలకు లోనయ్యారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement