Friday, May 3, 2024

సంపూర్ణ శాంతికి సాధనా మార్గం

అపూర్యమాణ మచలప్రతిష్టం
సముద్రమాప: యం ప్రవిశంతి యద్వత్‌
తద్వత్కామా యం ప్రవశ్యంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామ కామీ
(భగవద్గీత ఆధ్యాయం 2, శ్లోకం 70)

కలి ప్రభావం చేత మానవులకు కోరికల ప్రవాహ ఉధృతి ఎక్కువగా వుంటుందని, దానిని తీర్చుకోవడం కోసం మానవులు అహర్నిశలు పరుగులు పెడుతూ, ఆ కోరి కల సాధనలో అంతులేని దు:ఖం, అశాంతి పోగు చేసుకుంటారని కలిపురుషుని వర్ణిస్తూ శుక్ర మహర్షి పరీక్షిత్తుకు చెబుతాడు. అది అక్షరాలా నిజమవడం మనందరికీ అనుభ వైద్యేకం. కోరిక స్వరూపం చిత్రమైనది. తీరనంతవరకు మనసుల్ని ఛిద్రం చేస్తూ ఆరాటం పెంచుతుంది. దాని సాధనలో మానవులు ఎంతో తపనకు, యాతనకు గురవుతారు. తీరా ఆ కోరిక తీరాక మనస్సు కాస్సేపు కూడా సంతృప్తి చెందలేదు. వెంటనే ఆ కోరిక మరొక స్వరూపం సంతరించుకొని తిరిగి మనసులలో ఆరాటం ప్రారంభిస్తుంది. ఈ తపనకు ముగిం పు మార్గాన్ని శ్రీకృష్ణుడు పై శ్లోకంలో తెలియజేస్తున్నాడు. విస్తారమైన సముద్రం ఎప్పుడూ జలంతో నిండి వుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అధిక మొత్తంలో వివిధ నదుల నుండి నీరు తనలో ప్రవేశిస్తున్నా సముద్రం తన నిశ్చల స్థితి నుండి చలించదు. తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలలో కూడా చెలియలి కట్ట దాటదు. కొం చెం సేపు వాతావరణ ప్రభావం చేత ఉధతి పెరిగినా తిరిగి తన నిశ్చల స్థితికే చేరుకుంటుంది. అట్లే భగవంతుని యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు గల భక్తుడు తనలో ఎన్ని కోరికలు ప్రవేశించినా తన భగవత్‌ ధ్యానం అనే కర్మలో సదా నిమగ్నమై వుండడం వలన ఇంద్రియ కోరికలు, భోగముల వలన ఏమాత్రం కలత పొందక నిశ్చలంగా వుంటాడు. తాను త్రికరణ శుద్ధిగా నమ్మిన భగవంతుడు తన అన్ని అవసరాలు తీరుస్తాడు కాబట్టి ఇక అతనికి వేరే కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం లేదన్న భావనలో దృఢంగా వుంటాడు. భగవంతుని ప్రేమయుత సేవలో, ధ్యానం, అర్చనాది క్రతువులలో తృప్తి పొందుతూ సముద్రం వలే స్థిరుడై వుండడం అభ్యాసం చేత సాధించి సంపూర్ణ , శాశ్వతానందాన్ని ఎల్లప్పుడూ పొందుతుంటారు. అతనికి ఎప్పుడూ శాంతి ఆభరణంగా మెరుస్తూ వుంటుంది.మరొకవైపు జీవిత పర్యంతం కోరికల సాధనలో నిమగ్నమై వుండేవారికి ఎప్పుడు రగులుతున్న అగ్ని వలే వుండే కామాగ్నిని (కోరికల పరంపర)చల్లార్చుకోవడంతోనే సరిపోతుంది. మనస్సు ఎప్పుడూ విచలితమై వుంటుంది. ఇక వారికి శాంతి అనుభవం ఎక్కడ? తీరని కోరికల వలన అశాంతి, తద్వారా దు: ఖం, దాని నుండి అనారోగ్యం సంక్రమిస్తాయి. అందుకే నేటియుగం ఒక రోగాల పుట్టగా మారి పోయింది. భగవంతుని నిత్య ఆరాధనలో మునిగినవారికి సదా ఆనందమే ఉంటుంది.ఒక దశలో కోరికలు అతడిని దరి చేరడానికే భయపడతాయి. చివరకు నామమాత్ర భౌతిక బంధాల నుండి ముక్తిని కూడా ఇటువంటి భక్తులు కోరరు. కాబట్టి సంపూర్ణ శాంతి, తద్వారా పూర్ణమైన, శాశ్వతమైన ఆనందం లభించాలంటే కోరికలు త్యజించడం అభ్యాసం చేయాలి. జరిగేది, జరు గుతున్నది, జరగబోయేది మన మంచి కొరకే భగవంతుని సంకల్పం ద్వారా లభిస్తొందని, తన ను నడిపించే ఆ జగన్నాటక సూత్రధారే తన జీవితమనే నావకు చుక్కాని అని భగవంతుని సంపూర్ణ విశ్వాసం తో నమ్మి ప్రసాద భావంతో జీవించడం అభ్యాసం చేయాలి. ఆ అభ్యాస సాధ నలో తొలుత కోరికల ప్రవాహం ఉధృతి ఎక్కువగా వున్నప్పుడు అత్యవసర కోరికలను తీర్చు కుంటుండడం చేస్తూ కోరికల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేయాలి. ఈ సాధన తీవ్రతరం అయినప్పుడు కోరికల ప్రవాహం మనల్ని చుట్టుముట్టడం తగ్గుతుంది. సంశయ స్వభావాన్ని తగ్గించుకుంటూ భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం పెంచుకోవడం సాధనలో చాలా కీలకం.

  • సీహెచ్‌. ప్రతాప్‌ 9136827102
Advertisement

తాజా వార్తలు

Advertisement