Monday, May 20, 2024

నిర్వేదాన్ని జయిస్తేనే సత్ఫలితాలు

తత్త్వజ్ఞాన దు:ఖం వలన కలిగే హీనత్వ బుద్ధినే నిర్వేదం అంటారు. అనగా జ్ఞానము కలిగి కూడా ఆచరణలో విఫలమయినప్పుడు ఈ మానసిక పరిస్థితి దాపురిస్తుంది. ఈ విషయమును లోతుగా ఆలోచిస్తే అటు వంటి వారికి జ్ఞాన పరిపక్వత కలుగలేదనే భావించవచ్చు. లేదా మూర్ఖుడైనా కావచ్చు. ఆ మూర్ఖ స్వభావము అరిష డ్వర్గ ప్రభావం వలన కలిగినదైనా కావచ్చు. ఏది ఏమైనా నిర్వేదం మనిషిని కృంగదీస్తుంది.
ఏదైనా కార్యము విఫలమయినచో లౌకిక మానవుడు నిర్వేదానికి గురవుతాడు. అయితే కార్యశూరుడు నిర్వేదాన్ని జయిస్తాడు. దానికి కారణం ప్రయత్నం. చిన్న విషయం పరి శీలిస్తే మనకు బాగా అవగతమవుతుంది. విద్యార్థులు గణితమును అభ్యసనం చేసేటప్పుడు సమస్యలను పరిష్కరిం చలేక చివరికి నిర్వేదానికి గురవుతారు. తాను ఎందుకు పనికిరానని భావిస్తారు. చురుకైన వారిని చూసి చలించిపో యి మరింత నిర్వేదానికి గురవుతారు. ఆ సమయంలో మనసు మాట అటుంచి విచక్షణ కలిగిన బుద్ధిహీనత్వానికి చేరువ అవుతుంది. దీనికి ఒక్కటే విరుగుడు మంత్రం, ప్రయ త్నం. పట్టు వదలని ప్రయత్నం. దానికి ధైర్యాన్ని కలిగించే ప్రేరకుడు అవసరం. వారు ఇష్టదైవం గురువు, తల్లిదండ్రు లు, స్నేహితులు ఎవరైనా కావచ్చు.
నిర్వేదం చాలా ప్రమాదమయినది తనలో ఉన్న అం తర్గత శక్తులను గుర్తించడానికి ఇది ప్రతిబంధకం. దీని వలన నైపుణ్యం కోల్పోయి సంపద, లాభము, శుభము కోల్పోతారు. ఎంతో ప్రతిభావంతులైనవారు కూడా ఈ పరిస్థితికి లోనవడం సామాన్యం. విదురనీతితో విదురుడు చెప్పిన బోధను పరిశీలిస్తే
అనిర్వేద: శ్రీయోమూలం లాభస్య చ శుభస్యచ|
మహాన్‌ భవత్యనిర్విణ్ణ: సుఖం చానంత్యమశ్నుతే||
నిర్వేదానికి గురవకుండా ఉండేవారికి సంపద, సర్వత్ర లాభం, శుభం చేకూరుతాయి. దానికి ప్రయత్నం అవసరం. ప్రయత్నం వీడనివాడు సుఖము, అనంతమయిన సౌభాగ్యం పొందుతాడు. కావున క్లిష్ట సమయంలో ఎవరైతే ప్రయత్నం వీడక ముందుకు ముందుకు సాగుతాడో వారు చరిత్ర కారులవుతారు. భగీరథుడు ప్రయత్నం వలనే గంగను భువికి దించాడు. తన వారికి ముక్తిని ప్రసాదించాడు. శ్రీరా మచంద్రుడు పట్టువదలని ప్రయత్న పథంలో నడిచాడు కాబట్టే కడలిపై వారధిని నిర్మించాడు. హనుమ ప్రయత్నం వలననే సంజీవని సాధించి లక్ష్మణుని, వానర సైన్యాన్ని కాపాడాడు. పాండవులు సహనం వీడక అనేక కష్టాలు పడి అరణ్యవాసం చేసి అనుక్షణం ప్రయత్నాలను వీడక అనేక వరాలు, అస్త్రశస్త్రాలు సాధించారు. అనేక మంది రాక్షసు లను ధైర్యంతో సంహరించి ప్రజలను కాపాడి వారి మద్ధతు ను కూడగట్టుకున్నారు. ముఖ్యంగా ధర్మరాజు తన సోదరు లను తన మాటల ప్రయత్నంలో నిర్వేదానికి గురికానివ్వక ధర్మయుద్ధానికి సన్నద్ధులను చేసాడు. ధర్మపత్ని ద్రౌపదికి కలిగిన నిర్వేద అగ్నిని తన అనునయ సంభాషణా ప్రయత్నంతో శాంతపరచి వ్యూహాన్ని రచించు కున్నాడు. లీలామా నుష అవతార పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మను తన హృదయ సంకల్ప ప్రయత్నంతో నిత్యం అర్చిస్తూనే ఆయన కటాక్షాన్ని నిలుపుకున్నాడు.
ప్రయత్నానికి సహనం తోడయితే విజయం ఖచ్చి తంగా లభిస్తుంది. దానికి తార్కాణాలే శ్రీరామవనవాసం, పాండవుల వనవాసం వారికి అన్ని సమర్థతలూ ఉన్న వారు ఎంతో సహనాన్ని పాటించారు.
తస్మాదసక్త స్సతతం కార్యం కర్మ సమాచార|
ఆసక్తో హ్యచరక్‌ కర్మపరమాప్నోతి పూరుష:||
గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చేసే పని, దాని వల్ల కలిగే ఫలితము మీద విపరీతమైన ఆసక్తి పనికి రాదు. కర్మ ప్రకా రం చేసుకుంటూ వెళ్ళాలి అని శాసించాడు. ఇది ఒకరకంగా సహనంతో కూడిన ప్రయత్న గుణంగానే భావించాలి.
ఉత్థానం సంయమో దాక్ష్యమ్‌ అప్రమాదోధృతి: స్మృతి:|
సమీక్ష్య చ సమారంభ: విద్ధి మూలం భవస్య తు ||
విధురనీతిలో ప్రయత్నం, ఇంద్రియ నిగ్రహం, సమర్థత, పొరపాటు పడకపోవడం, ధైర్యం, స్మృతి, సర్వత్రా పరి శీలించి పనిని ప్రారంభించిన వారికి విజయం, సంపదకు మూలమవుతుందని తెలియచేసాడు.
అరిషడ్వర్గాలను జయించలేక మోహంతో సర్వం కోల్పోయిన ధృతరాష్ట్రుడు చివరి దశలో మహా నిర్వేదానికి గురయ్యాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు, విదు రుని సహాయంతో దాని నుండి బయటపడి వానప్రస్థానికి వెళ్ళాడు. నిర్వేదం నుండి బయట పడాలంటే లేదా అసలు గురవకుండా ఉండాలంటే ఎలా ఉండాలో ధృతరాష్ట్రునికి ముందు గానే సూచించాడు విదురుడు. కానీ వాటిని పాటించక సర్వనాశనానికి కారకుడయ్యాడు. చివరకు ఘోరమైన నిర్వేదాన్ని తానొక్కడే అనుభవించాడు.
యత్సుఖం సేవమానోపి ధర్మార్థాభ్యాం నహీనతే|
కామం తదుపసేవేత నమూఢవ్రతమాచరేత్‌||
ధర్మార్థాలకు హాని కలగని రీతిలో మానవుడు సుఖాన్ని అనుభవించవచ్చు. అంతేకాని జ్ఞానం కలిగి కూడా మూఢునిలా ప్రవర్తించరాదు అని విదురుడు సూచించాడు.
ధూమేనా వ్రియతే వహ్నిర్యథాదర్శో మలేనచ|
యథోల్యేనావఈతో గర్భస్తథాతేనేదమావృతమూ||

గీతాచార్యుని శాసనంలో పొగచేత నిప్పు, ధూళి చేత అద్దం, మావిచేత గర్భములోని శిశువు కప్పబ డినట్లు, కోరికల చేత జ్ఞానం కూడా కప్పడి ఉంటుందని తెలియచేసాడు. అంటే కోరికలు తీరాలంటే ప్రయత్నం తప్పదు. ప్రయత్నానికి సహనం ముఖ్యం. ముఖ్యమ యిన విషయమేమంటే అధర్మయుతమైన గొంతెమ్మ కోరికలు ఎంత ప్రయత్నించినా తీరవు. అప్పుడు సహ నం కోల్పోయి నిర్వేదానికి గురవ్వక తప్పదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement