Thursday, April 25, 2024

శ్రీ కాళహస్తీశ్వర శతకం

95.నీ భక్తుల్ పదివేల భంగుల నినున్సేవింపుచున్ వేడగా
లోభం బేటికి? వారి కోర్కులుకృపాళుత్వంబునందీర్ప రా
దా భవ్యంబు( దలంచి చూడు పరమార్థం బిచ్చి పొమ్మన్న నీ
శ్రీభండారములో( గొఱంతవడునా? శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా!, నీభక్తుల్- నీకు భక్తులైనవారు, పదివేల భంగులన్- పదివేల (అనేకమైన) విధాల, నినున్- నిన్ను, సేవింపుచున్- సేవించుకుంటూ, వేడగా- ప్రార్థించగా, లోభంబు- పీనాసితనం, ఏటికి- ఎందుకు?, కృపాళుత్వంబునన్- దయాగుణము చేత, వారి- వారి యొక్క, కోర్కులు- కోరికలు / వాంఛలు, తీర్పరాదు- ఓ- నెఱవేఱ్చకూడదా?, భవ్యంబు- యోగ్యమైన పని అవుతుందో ఏమో, తలంచి చూడు- ఆలోచించి చూడు, పరమార్థంబు- మోక్షము, ఇచ్చి-ప్రసాదించి, పొమ్ము- అన్నన్- వెళ్ళమని చెపితే, నీ- నీ యొక్క, శ్రీభండారములోన్- మహిమ లనెడి శుభముల కోశంలో, కొఱత- లోటు, పడును- ఆ- వస్తుందా?
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా!నీ భక్తులు పదివేల విధాలుగా నిన్ను సేవించి ప్రార్థిస్తున్నారు. నీ కంతలోభబుద్ధి ఎందుకు? వారి కోరికలను కరుణ కలిగి తీర్చవచ్చు కదా! యోగ్యమైన పని ఏదో ఆలోచించి చూడు. వారికి మోక్ష మిచ్చి పొమ్మంటే నీ సంపదల కోశంలో కొఱత ఏమీ రాదు కదా!
విశేషం: భక్తులకి చేత నైనదిభగవంతుణ్ణి సేవించటం, వేడుకోవటం. వారి కోరికలని తీర్చటానికి కారణం వారి అర్హత కాదు. పరమాత్ముడి దయాగుణమే కారణం. వాళ్లేమి కోరినా పరమాత్మ ఇచ్చేది పరమార్థమే. ఎందుకంటే మానవులకు ఏమికోరుకోవాలో కూడా తెలియదు కదా!

డాక్ట‌ర్ అనంత ల‌క్ష్మి
Advertisement

తాజా వార్తలు

Advertisement