Friday, April 26, 2024

ధర్మం – మర్మం : మన పుణ్యభూమి – పుణ్యతీర్థములు (ఆడియోతో…)

మన పుణ్యభూమి – పుణ్యతీర్థముల గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

బ్రహ్మపురాణంలోని గౌతమీ ఖండంలో వశిష్ఠాది మహర్షులకు పుణ్యతీర్థముల గురించి బ్రహ్మదేవుడు ఈవిధంగా వివరించెను.

వశిష్టాది మహర్షులు బ్రహ్మను అనంతమైన తీర్థములు, తీర్థముల విస్తారము, వాటిలోని పరమ రహస్యాలను తెలియజేయమని, సర్వతీర్థమాహత్య్మమును, ఉత్తమోత్తమ తీర్థముల గూర్చి వివరించమని కోరెను. పూర్వము నారద మహాముని కూడా ఈ విషయంపై కుతూహలంతో తీర్థసేవనము, తీర్థ భేదాల గూర్చి తనను ప్రశ్నించెన ని, తపస్సు, యజ్ఞములు, దానముల కంటే తీర్థసేవనము ఉత్తమమని, ఎన్ని తీర్థబేధములు కలవో, ఆ తీర్థ ఫలము సేవించినచో కలుగు ఫలితమేమిటో, అన్ని వేళలా విశిష్టమైన తీర్థమేదని అడిగెనని తెలుపుతూ బ్రహ్మదేవుడు ఈ విధంగా సమాధానమిచ్చెను.

స్వర్గలోకమున, మర్త్య లోకమున, రసాతలమున, పాతాళమున కల నదులు నాలుగు విధములుగా ఉండును. అవి దైవ తీర్థములు, ఆసుర తీర్థములు, ఆర్ష(ఋషి) తీర్థములు, మానుష తీర్థములు. మానుష తీర్థముల కంటే ఋషి తీర్థములు అధికంగా సర్వకామనలను ప్రసాదించును. ఋషి తీర్థముల కంటే ఆసుర తీర్థములు బహు పుణ్యఫలములను ప్రసాదించును. ఆసుర తీర్థముల కంటే దైవ తీర్థములు సర్వోత్తమములు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మొదలగు దేవతలచే నిర్మించినబడిన తీర్థములు దైవతీర్థములు. త్రిమూర్తులు కలిసి ఒకే తీర్థము నిర్మించినచో ఆ తీర్థము ఉత్తమోత్తమమైన తీర్థము. మూడు లోకములలోని తీర్థములలో మర్త్య లోక తీర్థములు సర్వవిశిష్టములు. మర్త్య లోకమున జంబూ ద్వీపములో ఉన్న తీర్థములు ఉత్తమమైనవి. అలాగే భారత వర్ష తీర్థములు సర్వోత్తమమైనవి. ఈ తీర్థములు వేదములలో ప్రసిద్ధములు.

వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement