Saturday, October 5, 2024

నీవే తప్ప ఇతఃపరంబెరుగ…!

భగవద్గీతలో భక్తులు తనను ఆశ్రయిస్తే వాళ్ళ యోగక్షేమాలు చూసుకుంటానని (యోగ క్షేమ వహామ్యహమ్‌) చెప్పారు. ఆ భక్తి త్రికరణ శుద్ధిగా, ఆర్తితో ఉంటే, జన్మ జన్మలకు ఆ పరమాత్మ రక్షింస్తూంటాడని తెలియచేసేదే గజేంద్ర మోక్షం. ఎన్నిసార్లు విన్నా, భక్తి తత్త్వం ఎంతవరకు అర్థమయ్యింది అనేది ముఖ్యం.
శౌనకాది మహర్షులు సూతమహామునిని దర్శించి ”ముని శ్రేష్ఠా! మాకు పరమాత్మ లీలలు ఎన్ని విన్నా, సంతృప్తి కలగడంలేదు. దయచేసి మీరు మహావిష్ణువు తన భక్తుడైన గజేంద్రుడుని రక్షించి, మోక్షాన్ని కలిగించిన విధానం తెలియచేయండి!” అని కోరగా, వివరించడం మొదలుపెట్టారు సూత మహాముని. గజేంద్రుడు అంతకు ముందు జన్మలో ద్రవిడ దేశాన్ని పరిపాలించే ఇంద్రద్యుమ్నుడు అనే రాజు. విష్టు భక్తుడు. జ్ఞానవంతుడు. అగ స్త్య మహర్షి శాపం వల్ల ఏనుగుగా జన్మించాడు. గజేంద్రుడుని పట్టుకొని పీడించిన మకరం అంతకు ముందు జన్మలో ”హుహు” అనే గంధర్వుడు. దేవల మహర్షి శాపం వల్ల మొసలిగా జన్మించాడు. పాల సముద్రంలో త్రికూటమనే పర్వత ప్రాంతం ఉంది. అది పదివేల ఆమడ ల పొడవు, అంతే వెడల్పుగల ఎత్తైన పర్వతం. బంగారు, వెండి, ఇనుము నిండిన మూడు శిఖరాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో పెద్దపెద్ద చెట్లు, తీగలు, పొదలు, సెలయేర్లు ఉన్నాయి. ఆహ్లాదకరమైన చోటువల్ల గంధర్వులు, సిద్ధులు, దేవతలు విహారానికి వస్తూండేవారు. ఒ కరోజు హు హు అనే గంధర్వ రాజు కొంతమంది స్త్రీలతో నీటితో క్రీడిస్తూ ఆనందిస్తూ, పరవ శమైన స్థితిలో అదేచోట నీటిలో ధ్యానం చేస్తూన్న దేవల మహర్షికి గంధర్వుని కాలు తగిలిం ది. కోపోద్రిక్తుడైన దేవల మహర్షి ”నీటిలో మొసలిగా జీవించు” అని శాపం పెట్టాడు. గంధ ర్వుడు ప్రాధేయపడగా, గజేంద్రుని ద్వారానే నీకు ముక్తి లభిస్తుంది” అని శాప విముక్తి కలిగిం చాడు. ఆ ప్రాంతంలోనే చెట్ల కొమ్మల మధ్య, చిలుకలు, కోయిలలు గుమిగూడి పండ్లను తిం టూ ఉండేవి. ఇవేకాక ఖడ్గమృగాలు, తోడేళ్ళు, సింహాలు, శరభాలు, మదపుటేనుగులు తిరు గుతూ ఉండేవి. మదపుటేనుగులు భయంతో పగటి పూట గుహల్లో దాక్కొని, సాయంత్రం వేళ బయటకు వచ్చి విహరించేవి. అలా ఒకనాడు ఒక ఏనుగుల గుంపు గజేంద్రుడు నాయ కత్వంలో మడుగు వద్ధకు వచ్చి తిరుగుతూ, గుంపులోని, ఏనుగులు వెనక్కి వెళ్ళిపోతుంటే, దాహం వేసి గజేంద్రుడు మడుగులో దిగాడు. నీరు త్రాగే సమయంలో ఒక మూల దాగి ఉ న్న మొసలి చూసి ఒడిసి పట్టుకొన్నాడు. గజేంద్రుడు గుట్టపైకి మొసలిని లాగుతుంటే, మొసలి ఏనుగును నీటిలోకి లాగుతోంది. పెనుగులాట జరుగుతోంది. తమ నాయకుడు గజేంద్రుడు వెనక పడిపోయాడని తలచి, కొన్ని ఏనుగులు తిరిగి మడుగు వద్దకు వచ్చి చూ సాయి. రాత్రి అయిపోయింది. అయినా ఏనుగు మొసలి ఎవరి పట్టు మీద వారు ఉన్నారు. ఆకాశం నుండి గంధర్వులు, యక్షులు, దేవతలు గమనిస్తూనే ఉన్నారు.
ఈ వచ్చిన ఏనుగులు కూడా ఏమీ చేయలేకపోయాయి. ఇలా కొన్ని వందల సంవత్సరా లు పెనుగులాట జరుగుతూనే ఉంది. గజేంద్రుడు సత్తువ కోల్పోయాడు. తనలో తాను ఇలా అనుకొంటోంది ”దీనిని ఓడించడానికి నావద్ద శక్తిలేదు. ఇక ఈ ఆడియాస ఎందుకు? అం టూ దు:ఖిస్తూ ఉండగా పూర్వజన్మ జ్ఞానం కలిగి ఏ దేవుని ప్రార్థించేది? ఎవరిని పిలిచేది? ఎవరు నన్ను కాపాడుతారు? దొడ్డదైన ఈ మొసలిని అడ్డగించే నాథుడు ఎవరు? భగవంతు డా! నాకు భయం కలుగుతోంది.” అంటూ

”ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా
డెవ్వడు, వాని నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌!”

అంటే ఈ లోకం ఎవ్వరివల్ల పుడుతోందో? ఎవనితో కలిసి ఉంటోందో? ఎవని లోపల లయమవుతుందో? ఎవడు పరమాత్ముడో? ఎవడు ఈ విశ్వానికి మూలకారణమో?
ఎవరు అన్ని తానై ఉంటాడో అటువంటి ప్రభువైన భగవంతుని నేను శరణు కోరుతు న్నాను. అంటూ పదేపదే భగవంతుని తలపోస్తూనే మొసలితో పోరాడుతూనే ఉంది. దేవు డు ఆర్తులైన వారి వెంట ఉంటాడంటారు. ఉత్తములైన యోగుల చెంత ఉంటాడంటారు. ఉన్నాడు! ఉన్నాడు! అనే దేముడు అసలు ఉన్నాడో? లేడో? అని బాధపడుతూనే- ”లోకాల ను సృష్టి చేసి ఆ లోకాలన్నింటికి దూరంగా ఉంటూ లోకానికి అంతరాత్మయై, లోకానికి బా గా తెలిసినవాడై, లోకమే తానై, లోకాలన్నీ నడిపిస్తున్న పరమాత్మను ఆరాధిస్తున్నాను. ఈవి ధంగా ఆలోచిస్తూ, తన మనసును పూర్తిగా భగవంతునిపై నిలుపుతూ గజరాజు ఈవిధంగా ప్రార్థించాడు.

”లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులన్‌
ఠావుల్‌ దప్పెను, మూర్ఛ వచ్చె, దనువున్‌ డస్సెన్‌ శ్రమం బయ్యెడిన్‌

నీవే తప్ప ఇత:పరం బెరుగ మన్నింప దగున్‌ దీనునిన్‌
రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మికా!!”
అంటే భగవంతుడా! నాలో కొంచెం కూడా శక్తి లేదు. ధైర్యం తగ్గిపోయింది. ప్రాణాలు కూడా కదులుతున్నాయి. మూర్ఛ వస్తోంది. శరీరం చిక్కిపోతోంది. నీవు తప్ప వేరే దిక్కు లేదు. ఆర్తితో కూడిన నా మొర ఆలకించి ఆదుకోవా? దేవాది దేవా రావయ్యా! కరుణించి కాపాడవయ్యా! అని ఆర్తితో ఆరాధించే సరికి, ఆ సమయంలో వైకుంఠంలో విశ్వమయుడు, సర్వాంతర్యామి, అయిన మహా విష్ణువు తన భక్తుడైన గజరాజును కాపాడటానికి నిశ్చయిం చుకున్నాడు.
గజరాజును కాపాడటానికి లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. శంఖు చక్రాలు తీసుకోలేదు. పరిచారకులను ఎవరిని పిలవలేదు. గరుడ వాహనాన్ని సిద్ధపరుచుకోలేదు. తొందరగా వెళ్ళాలనే తపనతో లక్ష్మీదేవి కొంగు కూడా వదిలిపెట్టలేదు. ఆకాశ మార్గాన బయలుదేరి, ఆ మడుగు వద్దకు వచ్చాడు. ఆయన వెంటే లక్ష్మీ దేవి, శంఖువు, చక్రం, పరిచారకులు అంతా కలిసి వచ్చారు పై నుండి దేవతలు, గంధర్వులు అంతా చూస్తూనే ఉన్నారు. దయామయు డైన మహావిష్ణువు మొసలిని సంహరించడానికి చక్రాన్ని పంపగా, మొసలి తలను నరికింది. దేవల మహర్షి శాపం విమోచనం కలిగి గంధర్వుడు మొసలి నుంచి పూర్వపు రూపాన్ని ధరించి గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. గజేంద్రుడు తన పరివారంతో కలిసిపోయింది. అయినా గజరాజు భక్తితో పరమాత్మను సేవిస్తూంది. విష్ణువు మోక్షాన్ని ప్రసాదించాడు. మూగజీవి అయినా ఏనుగు మోక్షాన్ని ఎలా పొందిందో, జ్ఞానవంతులైన మనం మోక్ష సిద్ధికి పరమాత్మనే శరణు వేడుకొందాం.
ఈ కథ చదివినా, విన్నా వారికి పుణ్యలోకాలు సిద్ధిస్తాయని భాగవతం చెబుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement