Friday, May 17, 2024

మానవ ప్రయత్నం-దైవబలం!

ఏది సాధించాలన్నా మనిషి తన ప్రయత్నంతోనే సాధించాల్సి ఉంటుంది. అందు లో సందేహానికి ఏమీతావు లేదు. అయితే కేవలం మానవ ప్రయత్నంతోనే అన్ని పనులూ నెరవేరుతాయా? అంటే ‘అవునని’ చెప్పడం మాత్రం సాహసమే అవు తుంది. మనిషి ప్రయత్నానికి దైవబలం ఆసరాకాకుండాను, తోడు లేకుండాను కోరుకున్న విధంగా ఫలితం సాధిస్తామని సందేహం లేకుండా చెప్పలేం. ప్రత్యక్షంగా కనిపించకపోవ చ్చును గాని దీక్షతో చేసే సత్కార్యానికి ఎల్లప్పుడూ దైవబలం తోడుగా ఉండడం జరుగు తుంది. గట్టు ప్రభు తాను రచించిన ‘కుచేలోపాఖ్యానం’లో ఈ సంగతినే కొన్ని చక్కని పద్యాలలో చెప్పాడు.

ఆ.వె. మనుజుఁడెల్ల ప్రొద్దు మానకసేయంగ
దైవయత్నమొకటి తారసిల్లుఁ
గాక యూరకున్నఁగలదె భుక్తమునకు
దైవమానుషములుదగ సమములు.
(‘కుచేలోపాఖ్యానము’, ప్రథమాశ్వాసం, 87పద్యం)

మానకుండా మానవ ప్రయత్నం అన్నది కొనసాగిస్తూ వుంటే, ఆ ప్రయత్నానికి దైవం అందించే సహకారం తోడవుతుంది. అట్లాకాకుండా, ఊరుకుంటే ఏమీ జరగదు, ఏదీ పొందడం సాధ్యపడదు. అందువలన, చేపట్టిన కార్యం ఏదైనా సఫలత అనే దశకు చేరడానికి మానవ ప్రయత్నము, దైవం అందించే సహకారము రెండూ అవసరమే, రెం డూ సమానమైనవే!

తే.గీ. పరఁగనట్టింటనుండి నా భాగ్య మనిన
దైవ మెక్కడఁగొనితెచ్చి తనకు నిచ్చుఁ
జేయఁదగిన ప్రయత్నముల్సేయఁ జేయ
నధిపయటమీద వారి భాగ్యంబుకొలఁది.
(‘కుచేలోపాఖ్యానము’, ప్రథమాశ్వాసం, 88పద్యం)

ఆ.వె. దేవుఁడిచ్చుననుచు దినదిన యత్నముల్‌
సేయకున్న నేల సిరులుగల్గుఁ?
బళ్ళెరమున నిడిన పంచభక్ష్యాన్నముల్‌
కుడువకున్న నెట్లు కడుపు నిండు.
(‘కుచేలోపాఖ్యానము’, ప్రథమాశ్వాసం, 89 పద్యం)

- Advertisement -

ఊరకే తన ఇంట్లో కూర్చుని ‘నాకు రావలసిన సంపద ఏది, ఎక్కడ?’ అని ప్రశ్నిస్తే దైవమైనా ఎక్కడనుండి తెచ్చి ముంగిట చేర్చగలడు? మానవ ప్రయత్నంగా చేయదగిన శ్రమ చేయగా, చేయగా వారి వారి భాగ్యానికి తగినట్లుగా దేవుడిస్తాడులే! అనుకుంటూ ఏరోజుకారోజు ఏవిధమైన ప్రయత్నమూ చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఎవరికైనా సంపద ఎలా చేకూరుతుంది? పళ్ళెంలో వడ్డించి వున్న పంచభక్ష్య పరమాణ్ణాలు ఎవరికై నా గాని తింటేనే కదా కడుపులోకి వెళ్ళేది! తినే ప్రయత్నం కూడా చేయకపోతే కడుపెలా నిండుతుంది?

మ. ఇరవౌన క్రముచే మహాసురునిచే నేనుంగు ప్రహ్లాదుఁడుం
బరితాపించుచువేఁడఁగాఁ గద పరబ్రహ్మంబువేంచేసె ని
ట్లురు సంపూర్ణ దరిద్రులన్మనలఁగుయ్యోయన్న రక్షించు శ్రీ

హరి నిష్కాములకేల యిచ్చు బహుళం బైనట్టి యైశ్వర్యముల్‌.

(‘కుచేలోపాఖ్యానము’ ప్రథమాశ్వాసం, 92పద్యం)

మొసలి పట్టులో గజేంద్రుడు, హరణ్యకసిపుని చేతిలో ప్రహ్లాదుడు నానా బాధలు పడుతూ, ఇక భరించలేని స్థితికి చేరుకుని ‘దేవుడా, రక్షంచు!’ అని అసహాయంగా వేడుకు న్నప్పుడే కదా పరమేశ్వరుడైన హరి వారిని ఆదుకోవడానికి అన్నీ వదిలి పరుగున వచ్చా డు. అలాగే పరిపూర్ణ దారిద్య్రం అనుభవిస్తున్న మనలను ‘స్వామీ, కాపాడు’ అని ఆయన ను మనం మనస్పూర్తిగా వేడుకొంటే తప్పక రక్షిస్తాడు. అంతేగాని, ఏమీ అడగకుండా నిశ్శబ్దంగా కూర్చునే నిష్కాములైనట్టి వారికి అన్ని రకాల ఐశ్వర్య సంపదలను శ్రీహరి ఎందుకు ప్రసాదిస్తాడు?

కం. కావున మనుజుఁడుసేయక
దేవుండీయంగలేఁడు తెగి యేమియు నా
నావిధ ధాన్యము లుండిన
వావిరివండకయెరిత్త వంటక మగునే.
(‘కుచేలోపాఖ్యానము’, ప్రథమాశ్వాసం, 91వ పద్యం)

అందువలన, సారాంశంగా తేలేది ఏమిటంటే మనిషి కోరకుండా దేవుడు ఇవ్వడం కూడా సంభవం కాదు. అడగందే అమ్మయినా పెట్టలేదు. ఇంట్లో అన్ని రకాల దినుసు లు పుష్కలంగా ఉన్నప్పటికీ, వండి వార్చకుండా వంట కాదు కదా! భోజనానికి వీల య్యే పదార్ధాలుగా మార్పు చెందవు కదా! కనుక మానవ ప్రయత్నమే మొదటిది. దైవం బలం ఆ ప్రయత్నాన్ని సరైన దారిన నడిపించి సఫలత దశకు చేర్చే ఉత్తమమైన తోడువంటిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement