Sunday, June 2, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 26
26.
మాం చ యో వ్యభిచారేణ
భక్తియోగేన సేవతే |
స గుణాన్‌ సమతీత్యైతాన్‌
బ్రహ్మభూయాయ కల్పతే ||

తాత్పర్యము : అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవ యందు నిమగ్నమగువవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మ భావమును పొందును.

భాష్యము : ఈ శ్లోకము నందు ‘ఏ విధముగా దివ్యస్థితిని పొందవచ్చు?’ అను అర్జునుని మూడవ ప్రశ్నకు సమాధానము ఇవ్వబడినది. ఇంతకు ముందే వివరించినట్లు త్రిగుణముల ప్రభావము చేత ఈ ప్రపంచము కొనసాగుచూ ఉన్నది. కాబట్టి మన చైతన్యమును భగవద్‌ కార్యముల యందు లగ్నము చేయుట ద్వారా త్రిగుణములలో జరుగు కార్యముల వల్ల కలత చెందవలసిన అవసరము ఉండదు. దీనినే భక్తి యోగము అందురు. ఇది కేవలము కృష్ణునికే కాక రాముడు, నారాయణుని పట్ల గాని ఇతర భగవదవతారాల పట్ల గాని ప్రదర్శించవచ్చు. ఈ విధమైన భగవదవతారాలందరూ దివ్య స్థితిలో సచ్చిదానంద విగ్రహులై ఉందురు. వారిని సేవించవలెనన్న జీవుడు కూడా దివ్యస్థితిలో ఉండవలెను. భగవంతుడు బంగారు గని అయితే జీవుడు అందు చిన్నని బంగారు కణము వంటివాడు. వారిరువురికీ ఒకే లక్షణము ఉన్నప్పుడే ప్రేమైక సంబంధము సాధ్యమవుతుంది. కాబట్టి వేదాలలో తెలుపబడినట్లు పరబ్రహ్మముతో సంబంధమునకు జీవుడు కూడా బ్రహ్మములో స్థితుడై ఉండవలెను. అనగా భౌతిక కల్మషము నుండి ముక్తుడై ఉండవలెను. అయితే భగవంతుడూ జీవుడు శాశ్వతముగా వేరు వేరు వ్యక్తులుగానే కొనసాగుతూ సేవా సంబంధాన్ని కలిగి ఉంటారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement