Wednesday, May 1, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 14, శ్లోకం 3
3.
మమ యోనిర్మహద్బ్రహ్మ
తస్మిన్‌ గర్భం దధామ్యహమ్‌ |
సంభవ: సర్వభూతానాం
తతో భవతి భారత ||

తాత్పర్యము : ఓ భరత వంశీయుడా! బ్రహ్మముగా పిలువబడు మహతత్త్వము సమస్త జననమునకు ఆధారమై యున్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే, ఆ బ్రహ్మము నందు బీజప్రదానము కావించుచున్నాను.

భాష్యము : ఈ శ్లోకము సృష్టి రహస్యాన్ని బహిర్గతము చేయుచున్నది. ఈ ప్రపంచమున జరుగు ప్రతీదీ క్షేత్ర, క్షేత్రజ్ఞులైన శరీరము ఆత్మల యొక్క కలయిక ద్వారానే సాధ్యమగుచున్నది. ఈశ్లోకమున ఆ కలయిక భగవంతుని ప్రమేయము వలననే జరుగుచున్నదని స్పష్టము చేయబడినది. మొదట 24 మూల కాలతో కూడుకుని ఉన్న మహత్తత్త్వమును ‘మహద్‌ బ్రహ్మ’ అని కూడా సంభోదిస్తారు. ఇది భౌతిక ప్రకృతి అనబడుతుంది. దీనికంటే ఉన్నతమైన శక్తి, జీవుడు. భగవంతుడు ఆ జీవరాశులను ‘మహద్‌ బ్రహ్మ’ లో ప్రవేశపెట్టును. తద్వారా అనేక విశ్వాలు, జీవరాశులు ఈ భౌతిక ప్రపంచమున ఉద్భవించటము జరుగుచున్నది.

తేలు తన గ్రుడ్లను బియ్యపు రాశులలో పెట్టగా వాటి నుండి తేళ్ళు జన్మించును. చూడటానికి అవి బియ్యము నుండే పుట్టినట్లుగా కనిపించినా తేలు వలన అవి జన్మించినవి. అలాగే భౌతిక ప్రకృతి నుండి జీవులు జన్మించినట్లుగా కనిపించినా, బీజమును ఇచ్చినవాడు భగవంతుడు మాత్రమే.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement