Monday, June 17, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 37

37.
కస్మాచ్చ తే న నమేరన్‌ మహాత్మన్‌
గరీయసే బ్రహ్మణో ప్యాదికర్త్రే |
అనంత దేవేశ జగన్నివాస
త్వమక్షరం సదసత్‌ తత్పరం యత్‌ ||

తాత్పర్యము : ఓ మహాత్మా! బ్రహ్మదేవుని కంటెను ఘనమైనవాడా! నీవే ఆది సృష్టి కర్తవు. అట్టి నీకు వారెందులకు నమస్సులు అర్పింపరు? ఓ అనంతా! దేవదేవా! జగన్నివాసా! నీ వు అక్షయమగు మూలమువు, సర్వకారణుడవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు.

భాష్యము : అర్జునుడు తన ప్రణామాల ద్వారా కృష్ణుడు అందరిచే పూజింప దగినవాడని తెలియజేయుచున్నాడు. కృష్ణుడు పరమాత్మ మరియు సర్వాంతర్యామి. అర్జునుడు ఇలా పలు విధాలుగా శ్రీకృష్ణున్ని కీర్తించెను. మహాత్మ అనగా ఎంతో ఉదారమైనవాడు, గొప్పవాడు. ‘అనంత’ అనగా భగవంతుని శక్తుల పరిధిని మించి ఏది ఉండదు. ‘దేవేశ’ అనగా దేవతలను నియంత్రించువాడు మరియు వారందరికంటే ఉన్నతుడు. ‘జగన్నివాస’ అనగా ఈ జగత్తులోని అందరికీ ఆశ్రయమును ఇచ్చువాడు. ‘అక్షరము’ అనగా ఈ భౌతిక సృష్టిలో ఏదైనా నశింపక మానదు. అయితే భగవంతుడు ఈ భౌతిక సృష్టికి అతీతుడు. అంతేకాక అర్జునుడు అందరు దేవతలు, సిద్ధులు, అన్ని జీవరాశులు భగవంతుడికి ప్రణామాలను చేయాలని, ప్రత్యేకించి బ్రహ్మ కూడా చేయవలసినదని, ఎందువలననగా
కృష్ణుడు వారందరికంటే గొప్పవాడని, భౌతిక సృష్టికి అతీతుడని తెలియజేసెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement