Saturday, October 26, 2024

ధర్మం – మర్మం : బుద్ధి – జన్మ పరంపర (ఆడియోతో…)

శ్రీమద్భాగవతంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

జన్మాంతర సహస్రేషు యా బుద్ధి: భవితానృణామ్‌
తామేవ కురుతే జంతు: ఉపదేశో నిరర్ధక:
స్వాధ్యాయ: చక్షు: ఉత ఏకమస్య యోగ:
ద్వితీయం అభివీక్షణాయ ధ్యాన మనన మయనం
అస్యద్రష్టా నమాంస చక్షు: అభివీక్షతే తమ్‌

వేల వేల జన్మలలో ఉన్న బుద్ధే తరువాత జన్మలో కూడ అనుసరిస్తుంది. అందువల్ల అటువంటి వారికి ఎవరికైనా ఉపదేశం వలన పెద్దగా ప్రయోజనమేమి ఉండదు. ఆ బుద్ధి ఇప్పటిది కాదు వేల వేల జన్మల నుండి అనుసరిస్తూ వస్తున్నది కావున ఎంత చెప్పినా, ఎందరు చెప్పినా అటువంటి వారి బుద్ధి మారదు. అయితే గురువులు, శిష్యులు ఇచ్చే ఉపదేశాలు, ఉపన్యాసాలు, ప్రభోదాలు, ప్రచారాలు ఎందుకనగా వేద శాస్త్ర పురాణ అధ్యయనం ద్వారా ఆ మంత్రములోని దివ్యమైన శక్తి అనేక వేల జన్మల బుద్ధిని, సంస్కారాన్ని క్రమక్రమంగా పరివర్తన చెందిస్తుంది. అందువల్ల వేద శాస్త్ర అధ్యయనము సత్యాన్ని, ధర్మాన్ని తెలియజేసి అనేక జన్మ పరంపరలలో అనుసరిస్తూ వస్తున్న బుద్ధిని మారుస్తుంది. వాస్తవాన్ని చూపే ఒక కన్ను స్వాధ్యాయము (వేదశాస్త్ర అధ్యయనం). ఇక యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారా, ధారణ, అధ్యాహార, ధ్యాన అను అష్టాంగ యోగములు రెండవ కన్ను. ఇలా మానవుడు స్వాధ్యాయ యోగములను రెండు కన్నులతో అనగా ఒక కన్ను ధ్యానము, మరో కన్ను మననము వీటితోటే మానవుడు యదార్థ వస్తువైన భగవంతుడిని చూడగలడు. మనకున్న ఈ మాంస చక్షువులు సత్యాన్ని, ధర్మాన్ని చూడలేవు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement