Tuesday, October 8, 2024

ధర్మం ‍ మర్మం : శ్రీ పంచమి (ఆడియోతో…)

పురాణాలలో శ్రీపంచమి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అంటే ఏమిటి?

మనము చేయాల్సిన, చేయకూడని పనులను, కార్యాలను సంకల్పించుకునేదే మనసు.
ఆ సంకల్పంలో పనులలోని మంచి చెడులు, లాభ నష్టాలను ఆలోచించి నిశ్చయించేది బుద్ధి.
మంచి, చెడ్డలు ఎందుకో లాభ నష్టాలు ఏమిటో, ఉపకారం, అపకారం ఏదో అనే వివేకాన్ని కలిగించేది చిత్తము.
శరీరమునే ఆత్మ అనుకోవడం అహంకారము.

నేను చేస్తున్నాను అని భావించరాదు. నేను అనే దానికి అసలైన అర్ధం ఆత్మ. కానీ ఆత్మ తినదు, వినదు, చూడదు. కానీ తినడం, వినడం, చూడటం వలన ఆత్మకు ఫలితం కలుగుతుంది. శరీరం చేసే ప్రతి పని నాదే అనుకోవడం వలన దాని ఫలితం ఆత్మకు లభిస్తుంది. ఆత్మ ఏదో ఒక శరీరంలో ఉంటుంది. స్వర్గంలోని సుఖం, నరకంలోని యాతన కూడా శరీరానికే. శరీరాన్ని హింసించడం వలన కలిగే బాధ మనసుకే. మనసుకు, ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు. మనసు, ఆత్మ ఒకే శరీరంలో ఉంటూ సహవాస దోషం వలన పాపం, పుణ్యం ఆత్మకు సంక్రమిస్తాయి. ఇది తెలియని వారు శరీరమే ఆత్మ అని భావిస్తే అది అహంకారము. శరీరము, ఆత్మ వేరువేరు అనుకున్న వారు తామేమి చేయడం లేదని, సుఖ దు:ఖాలతో తమకెలాంటి సంబంధం లేదని, ఆత్మ నిత్యానంద స్వరూపం, నిత్య జ్ఞాన స్వరూపమని భావించడం జీవన్ముక్తావస్థ.

జనక మహారాజు యజ్ఞం చేస్తుండగా యుద్ధానికి వచ్చిన శత్రు రాజులు మిథిలా నగరాన్ని తగులబెట్టారు. ఆందోళన చెందిన మంత్రులతో మిథిల తగలబడితే తనకేమీ నశించడం లేదని అన్ని బాధ్యతలు పరమాత్మవేనని అనగా మంత్రులు మీరు ఈ దేశానికి రాజులు, నగరాన్ని, రాజ్యాన్ని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత
మీదేనని సద్ది చెప్పగా జనక మహారాజు ఋత్వికులను సుదర్శన హోమం చేయమని ఆదేశించెను. హోమ గుండంలో నుంచి సైన్యం వచ్చి శత్రురాజులను తరిమికొట్టింది. అహంకారం లేనివాడే ఆత్మ జ్ఞానం ఉన్నవాడు.

- Advertisement -

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement