Sunday, May 19, 2024

కొండంతా భక్తులే..!

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో : కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి కొలువైఉన్న తిరుమల కొండపై భక్తుల రద్దీ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. రెండేళ్ల తరువాత రికార్డు స్థాయిలో గడచిన మూడు రోజులుగా సుమారు 1.50 లక్షకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆదాయం కూడా ఈ మూడు రోజుల్లోనే రూ. 10 కోట్లకుపైగా లభించింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, ఆంక్షలు ఎత్తేయడం, భక్తుల దర్శన టిక్కెట్లు పెంచడం వంటి వాటి నేపథ్యంలో యాత్రీకులు భారీగా తరలి వస్తున్నారు. గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 75,704 మంది స్వామివారిని దర్శించుకోగా, 33,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ.3.67 కోట్లు- హుండీ ఆదాయం వచ్చినట్టు- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అలాగే శుక్రవారం 56,559 మంది స్వామివారిని దర్శించుకోగా 28,751 మంది తలనీలాలు సమ ర్పించారు. మొత్తంగా రూ. 5.41 కోట్లమేర ఆదాయం లభించింది. ఈ రెండు రోజుల తరహాలోనే ఆదివారం కూడా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఆదివారం సెలవుదినం కావడం, నాలుగు రోజుల ముందుగా టీటీడీ దర్శనాల సంఖ్యను పెంచడం వంటి కారణాల నేపథ్యంల తిరుమల కొండ జనసంద్రంగా మారింది.
రెండేళ్ల తరువాత జనసంద్రంగా..
బుధవారం నుండి రూ. 300 ప్రత్యేక దర్శనాల సంఖ్యను 10 వేల నుండి 25 వేలకు పెంచారు. అలాగే సర్వదర్శనాలను 15 వేల నుండి 20 వేలకు పెంచారు. ఈనేపథ్యంలో తిరుమల కొండపై భక్తులు కిటకిటలాడుతున్నారు. రెండు సంవత్సరాల తర్వాత తిరిగి తిరుమలేశుని సన్నిధిలో యాత్రికుల సందడి కనిపిస్తోంది. కరోనా ప్రారంభ మైన 2020 మార్చి నుంచి పరిమిత సంఖ్యలోనే భక్తులు తిరుమలకు వస్తున్నారు. అధికారులు కూడా పరిమిత సంఖ్యలోనే దర్శనం టికెట్లు- జారీ చేస్తున్నారు. అయితే, గత నాలుగు రోజులుగా తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. రోజుకు 75వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా తితిదే ఏర్పాట్లు- చేసింది. రోజుకు 20వేల సర్వదర్శనం టోకెన్లు, 25వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లతో పాటు- వర్చువల్‌ సేవా టికెట్లు-, వీఐపీ ప్రారంభ దర్శన టికెట్ల ద్వారా దాదాపు 75 వేల మందికి పైగా నిన్న స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో గత రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా భక్తుల సందడి నెలకొంది.
రూమ్‌ల కోసం భక్తుల క్యూ
రాష్ట్రంలోపాటు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు భారీగా వస్తుండటంతో తిరుమలలో రూమ్‌ల కొరత ఏర్పడింది. రూమ్‌లు దొరక్క పోవడంతో శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న నాద నీరాజనం షెడ్డు వద్ద భక్తులు సేదతీరుతున్నారు. తిరుమలలో దాదాపు 1500లకు పైగా రూమ్‌ల ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఈకారణంగా రూమ్‌ల కొరత ఏర్పడింది. కరోనా కంటే ముందు ఎలా ఉండేదో.. తిరుమ లలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొంది. తిరుపతిలో ప్రస్తుతం రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.
మార్చి ఒకటో తేదీకి సంబంధించిన టోకెన్లను ఆదివారం జారీ చేశారు. సాధారణ సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాల నుకుని తిరుపతికి చేరుకునే భక్తులు 3 రోజుల పాటు- వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. టికెట్లు- పొందిన భక్తులను దర్శనం సమయానికి 12 గంటల ముందు మాత్రమే తిరుమల కొండ పైకి అనుమతిస్తు న్నారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో టికెట్లను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొండ పైకి అనుమతిస్తున్నారు. టికెట్లు- లేని భక్తులను తిరుపతిలోనే నిలిపివేస్తున్నారు. దీంతో సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా 3 రోజుల పాటు- తిరుపతిలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

సిఫార్సు లేఖలపై ఆంక్షలు
శని, ఆదివారాల్లో సిఫార్సు లేఖలు చెల్లవని రెండు రోజులు ముందుగానే తితిదే స్పష్టంచేసింది. ఇదే అంశాన్ని మీడియా ద్వారా కూడా తెలియపర్చింది. కానీ, కొంత మంది ఇప్పటికే తీసుకున్న సిఫార్సు లేఖల ద్వారా ముందుగా ప్రయాణం నిర్ణయించుకుని తిరుమలకు చేరుకున్నారు. తీరా తిరుమలకు వచ్చాక సిఫార్సు లేఖలు చెల్లవని చెప్పడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. వారంతా రోడ్లపైనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తిరుమల రహదారులన్నీ భక్తలతో కళకళ్లాడాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement