Friday, May 17, 2024

భగవద్ రామానుజ మరియు 108 దివ్యదేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలు


ఉదయం త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో అర్చకస్వాములు, ఋత్వికులు, వేద విద్యార్థులు కలిసి ధాన్యం చేశారు. స్వామివారు అష్టాక్షరీ లఘుజప విధానాన్ని అనుగ్రహించారు. ధాన్యం తర్వాత ఆరాధన, సేవాకాలం, శాత్తుముఱై పూర్తి చేసుకుని, వేద విన్నపాలతో యాగ కార్యక్రమం జరిపించారు. త్రిదండి చినజీయర్ స్వామివారు భక్తులందరికీ స్వయంగా తీర్థాన్ని అనుగ్రహించారు. నిత్యపూర్ణాహుతి కార్యక్రమం తర్వాత బలిహరణ, వేదవిన్నపాలు చేశారు.

ఈరోజు డోలోత్సవం ఘనంగా నిర్వహించారు.
డోలోత్సవం ప్రత్యేకత
పెరుమాళ్ళకి మన హృదయ మందిరమే ఊయలగా ప్రేమతో జోలపాడే ఉత్సవం ఇది. ఇది ప్రతి ఆలయంలో రాత్రి సమయంలో ఏకాంత సేవగా పెరుమాళ్ళకి సమర్పిస్తారు. అయితే ఒక పెరుమాళ్ళని ఒక ఊయలలో దర్శించే అవకాశం మాత్రమే మనకి లభిస్తుంది. ఒకనాడు తనని పరీక్షించవచ్చిన త్రిమూర్తులు ముగ్గురిని పసివాళ్లుగా చేసి ఊయలూపిన ఘనత అనుసూయాదేవికి దక్కింది. మరోసారి సాక్షాత్తూ భగవంతుణ్ణే సంతానంగా పొందిన దశరథుడు తన ముగ్గురు రాణులతో కలిసి నలుగురు బిడ్డలని ఒకేమారు ఊయల ఊపి ఆనంద తరంగితుడై ఉంటాడు. అంతకు మించి మరెవరికీ ఈ అవకాశం దక్కలేదు. కానీ సమతామూర్తి రాకతో మన ఆచార్యులైన త్రిదండి చినజీయర్‌ స్వామి దివ్య సంకల్పంతో ఒకేసారి 18 రూపాలలో ఉన్న పరమాత్ముని ఊయలూపే అద్భుత అవకాశం భక్తులందరికీ కలిగింది. స్వామివారు పెరుమాళ్లకు అలుపు తీరేలా ఊయలలను ఊపుతూ పాడారు. తర్వాత భక్తులందరిచేత ఈ సేవను పెరుమాళ్లకు అందేలా చేశారు. మంగళగీతంతో ఈ కార్యక్రమం సుసంపన్నమైంది.

సాంస్కృతిక కార్యక్రమాలు:
మధ్యాహ్నం 2 గంటల నుంచి నాట్య కళాకారిణి శ్రీమతి క్రాంతి నారాయణన్ బృందం ఆధ్వర్యంలో సీత నృత్యకల్పం భక్తులను ఆకట్టుకుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు సురభి పద్యనాటక ప్రదర్శన అద్భుతంగా జరిగింది.

అనంతరం చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సామూహిక విష్ణు సహస్ర పారాయణం చేశారు.

- Advertisement -

సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు అశ్వవాహన సేవ ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత 18 దివ్యదేశాధీశులకు గరుడ సేవలు నిర్వహించారు.

18 దివ్యదేశాధీశులకు ఈరోజు జరిగిన గరుడసేవల వివరాలు
1.తిరునీర్‌మలై
పెరుమాళ్-నీర్‌ వణ్ణన్‌ పెరుమాళ్‌
అమ్మవారు- అణిమామలర్‌మంగైనాయకి, భూదేవి

2.తిరువిడైవెన్దై
పెరుమాళ్-నిత్య కళ్యాణ పెరుమాళ్‌, జ్ఞానప్పిరాన్‌
అమ్మవారు- కోమలవల్లీ తాయార్‌, అఖిలవల్లి

3.మహాబలిపురం
పెరుమాళ్-స్థలశయన పెరుమాళ్‌
అమ్మవారు- నిలైమంగై నాచ్చియార్‌, భూదేవి

4.తిరువల్లిక్కేణి
పెరుమాళ్-పార్థసారథి
అమ్మవారు- రుక్మిణీదేవి

5.షోలింగర్‌
పెరుమాళ్-యోగనారసింహస్వామి
అమ్మవారు- అమృతఫలవల్లీ తాయార్‌, భూదేవి

6.తిరుమల
పెరుమాళ్-శ్రీనివాసుడు, వేంకటేశ్వర పెరుమాళ్‌
అమ్మవారు- పద్మావతి, భూదేవి

7.అహోబిలం
పెరుమాళ్-నరసింహస్వామి
అమ్మవారు- లక్ష్మీదేవి, భూదేవి

8.అయోధ్య
పెరుమాళ్-శ్రీరాముడు
అమ్మవారు- సీతాదేవి

9.నైమిశారణ్యం
పెరుమాళ్-దేవరాజ పెరుమాళ్‌
అమ్మవారు- పుండరీకవల్లి, భూదేవి

10.ముక్తినాథ్‌
పెరుమాళ్-శ్రీమూర్తి, ముక్తినాథ పెరుమాళ్‌
అమ్మవారు- శ్రీదేవి

11.బదరీనాథ్‌
పెరుమాళ్-బదరీనారాయణుడు
అమ్మవారు- అరవిందవల్లి

12.దేవప్రయాగ
పెరుమాళ్-నీలమేఘ పెరుమాళ్‌, రఘునాథుడు
అమ్మవారు- పుండరీకవల్లి, భూదేవి

13.జోషిమఠ్‌
పెరుమాళ్-పరమపురుష పెరుమాళ్‌
అమ్మవారు- పరిమళవల్లి

14.మథురా
పెరుమాళ్-శ్రీకృష్ణుడు
అమ్మవారు- రుక్మిణి, సత్యభామ

15.ద్వారక
పెరుమాళ్-ద్వారకాధీశ పెరుమాళ్‌
అమ్మవారు- కళ్యాణదేవి, భూదేవి

16.గోకులం
పెరుమాళ్-నవమోహన కృష్ణ పెరుమాళ్‌
అమ్మవారు- రుక్మిణి, సత్యభామ

17.క్షీరసాగరం
పెరుమాళ్-వ్యూహవాసుదేవ పెరుమాళ్‌
అమ్మవారు- క్షీరాబ్ధి పుత్రి మహాలక్ష్మి, భూదేవి

18.పరమపదం
పెరుమాళ్-పరమపదనాథుడు, పరవాసుదేవుడు
అమ్మవారు- శ్రీదేవి, భూదేవి, నీళాదేవులు

18 గరుడ వాహనాలను యాగశాలకు తీసుకొచ్చి పూర్ణాహుతి జరిపించారు. అనంతరం శాత్తుముఱై, తీర్థ, ప్రసాద గోష్ఠి పూర్తయ్యాక గరుడ వాహనాలను తిరిగి ఆలయాలకు చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement