Tuesday, July 23, 2024

ఆత్మ తీర్థం… మహాతీర్థం!

”శ్రీ శైలేశు భజింతునో? అభవు కాంచీ నాథు సేవింతునో?
కాశీ వల్లభు కొల్వ బోదునొ? మహా కాళేశు పూజింతు నో?
నా శీలం బణువైన మేరు వను చున్‌ రక్షింపవే నీ కృపా
శ్రీ శృంగార విలాస హాసములచే శ్రీ కాళహస్తీశ్వరా!”
ఓ ఈశ్వరా! నీ కృప కొరకై అనేక క్షేత్రములలో అనేక రూపములతో, వివిధ పేర్లతో వెలసి యున్న నిన్ను సేవింతును. శ్రీశైల మల్లిఖార్జునుని సేవింతునా? కాంచీపురేశుడైన ఏకాంబరేశ్వ రుని పూజింతునా? కాశీ విశ్వేశ్వరుని అర్చింతునా? ఉజ్జయినిలోని మహాకాళుని భజింతునా? నేను ఏ స్వల్పమైన సేవ చేసిననూ దానిని కొండంతగా భా వించి నన్ను నీ దయాపూర్ణములైన దరహాసములచేత రక్షింపుము తండ్రీ! అంటూ ధూర్జటి మహాకవి వలె ప్రతి భారతీయుడూ తీర్థయాత్రలు చేయాలని, పుణ్యక్షేత్రములను దర్శించాలని, ఆయా చోట్ల వెలసిన భగవంతుని ఆరాధించి తరించాలని తహతహలాడుతుంటాడు. దేవుడు ఎక్కడోలేడని, తన దేహమనే దేవాలయంలో వెలసిన జీవుడే, అంటే తానే, ఆ పరమాత్మయని, ‘సోహం’ (అతడే నేను/ దేవుడే నేను) అనే భావనతో ఆత్మ నిష్ఠుడైన వానికి ఈ తీర్థయాత్రలతో పనిలేదని ఆదిశంకరులు ఎప్పుడో సెలవిచ్చి ఉన్నారు.
”దేహో దేవాలయ: ప్రోక్తో, జీవోదేవ స్సనాతన:
త్యజేదజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజయేత్‌”
పునుగు పిల్లి తన శరీరం నుండి వెలువడే పునుగు నుండి వస్తున్న పరిమళం ఎక్కడి నుం డి వస్తున్నదా అని అడవి అంతా గాలించినట్లు, వెర్రిగా క్షేత్రాలలో దేవుని వెదుకుతాడు మాన వుడు. వేమన చెప్పినట్లు-
”మనసులోని ముక్తి మరియొక చోటను
వెదుకబోవువాడు వెర్రివాడు
గొర్రె చంకబెట్టి గొల్ల వెదకిన యట్లు
విశ్వదాభి రామ! వినుర వేమ”
గొర్రె పిల్లను తన చంకలోనే పెట్టుకొని, దానికోసం వెదికే వెర్రి గొల్లని వలె, మనసులోని శివుని తీర్థయాత్రలలో వెదుక బోవుట అజ్ఞానమే కదా! మన దే#హమే దేవాలయం. ఇందులోనే సకల క్షేత్రాలు కలవని ధర్మోపనిషత్తు ఇలా చెబుతోంది.
”శ్రీ పర్వతం శిర స్థానే, కేదారంతు లలాటకే
వారాణసీ మహాప్రాజ్ఞ భ్రువోర్‌ ఘ్రాణస్య మధ్య మే
కురుక్షేత్రం కుచస్థానే, ప్రయాగం హృత్సరోరుహ
చిదంబరంతు హృన్మ ధ్యే ఆధారే కమలాలయే”
మన దేహములోని శిర: స్థానము శ్రీ పర్వత క్షేత్రమట. నుదురు కేదారమట. భ్రుకుటి వారణాశి. కుచస్థానం కురుక్షేత్రము. హృదయ పద్మము ప్రయాగ. హృదయ మధ్యము చిదం బరం. మూలాధారము కమలాలయము అట. వీటిని ఆత్మ తీర్థములు అంటారు.
”ఆత్మతీర్థం సముత్స జ్య, బ#హస్తీ ర్థాని యో వ్రజేత్‌
కరస్థ రత్నం సంత్య క్త్వా, అన్వేష్యతి విమార్గతే”.
ఈ ఆత్మ తీర్థములను విడిచి, ఎక్కడో ఉన్న బహస్తీర్థములకై వెళ్ళేవారు చేతిలోని విలువై న మహారత్నాన్ని పారవేసి, వ్యర్థంగా ఎక్కడెక్కడో రాళ్ళ గుట్టలను వెదికే వారిలా మూర్ఖులు.
ఇదే భావాన్ని వేమన ఇలా చెప్పాడు-
”వెన్న చేతబట్టి వివరంబు తెలియ క
ఘృతము కోరునట్టి యతని భంగి
తాను దైవమయ్యు దైవంబు తలచు ను
విశ్వదాభి రామ! వినుర వేమ!”
చేతిలో వెన్నముద్ద ఉంచుకొని, దానిని కరిగిస్తే నెయ్యి వస్తుందని తెలుసుకోలేక, నెయ్యి కోసం వేరేచోట యాచించబోవు వెర్రివాని వలె, తానే దైవమని తెలుసుకోలేక దేవుని కోసం పలు తీర్థాలలో వెదకటం అవివేకమని వేమన భావము.
”భావతీర్థం పరం తీర్థం ప్రమాణం సర్వ కర్మసు
బ#హస్తీర్థాత్‌ పరం తీర్థం అంతస్తీర్థం మహామునే!”
ఆత్మ తీర్థం మహాతీర్థం, అన్య తీర్థం నిరర్థకం. భావ తీర్థమే శ్రేష్ఠమైన తీర్థము. అన్ని కర్మల కు అదే ప్రమాణము. బా#హ్య తీర్థములకంటే అంతస్తీర్థములు ఉత్తమములు. ఆత్మ తీర్థమే మహా తీర్థము. ఇతర తీర్థములు నిరర్థకములు. వేమన ఇలా అన్నాడు.
”ఆత్మలోని శివుని అనువుగా శోధించి
నిశ్చలముగ భక్తి నిలిపెనేని
సర్వ ముక్తుడౌను సర్వంబు తానౌను
విశ్వదాభి రామ! వినుర వేమ!” ఆత్మ చింతనతో తనలో ఉన్న దేవుని నిశ్చలమైన మనస్సు తో కనుగొనిన నాడు అన్నింటిలో తనను, తనలో సకలమును వాడు చూడ గలడు.
గీతాచార్యుడు ఇలా ఉపదేశించాడు.
”సర్వ భూతేషు చాత్మానం, సర్వ భూతాని చాత్మని
ఈక్ష్యతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమ దర్శన:” అన్నింటిలోనూ తనను, తనలో అన్నిం టినీ చూడగలిగిన సమదర్శి యోగి అనబడతాడు. ఆ దృష్టి కలగడానికి మనలోని అజ్ఞానమనే నిర్మాల్యాన్ని తొలగించుకోవాలి. అప్పుడే చిత్తశుద్ధి కలుగుతుంది. పరిశుద్ధమైన తావులోనే భగ వంతుడుంటాడు. మనసునిండా కల్మషంతో ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు.
”చిత్తమంతర్గతం దుష్టం తీర్థస్నానై ర్న శుద్ధ్యతి
శతశోపి జలైర్ధౌతం సురా భాండమివా శుచి:”
కల్లు కుండను ఎన్ని వందల కలశములలోని నీళ్ళతో కడిగినా ఎలా శుద్ధం కాదో, కలుషిత మైన మనసుతో ఎన్ని తీర్థాలలో మునిగినా ప్రయోజనం లేదు. దీనిని సమర్థించే కథ ఒకటి జన బా#హుళ్యంలో ప్రచారంలో ఉంది.
తీర్థయాత్రలకని బయలుదేరిన పాండవులకు శ్రీకృష్ణుడు ఒక సొరకాయను ఇచ్చి, దానిని తన బదులుగా తమతో తీసుకు వెళ్ళమని, తాము స్నానం చేసిన ప్రతి పవిత్ర నదిలోనూ ఆ సొరకాయను కూడా ముంచి తెమ్మనీ చెప్పాడట. వారా మాటను శిరసా వ#హంచి, తమతో ఆ సొరకాయకు కూడా నదీ స్నానాలు చేయించి తెచ్చి శ్రీకృష్ణునికి ఇచ్చారట. వారికి ఆనాడు శ్రీకృ ష్ణుడు విందు భోజనమేర్పాటు చేసి, ప్రత్యేకంగా వారికి ఆ సొరకాయను వండించి వడ్డింపజేశా డట. కానీ ఆ కూర చాలా చేదుగా ఉంది. ”ఇదేమిటి బావా, చేదు సొరకాయతో కూర వండారే మిటి?” అని ప్రశ్నించిన భీముని శ్రీకృష్ణుడు ”అన్ని నదీ స్నానాలు చేసినా దానిలోని చేదు పోలే దా ఏమిటి?” అని అమాయకంగా అడిగాడట. మనసులోని కల్మషం పోగొట్టుకోడానికి ఈ బా#హ్య తీర్థములు ఉపకరించవని ఈ కథలోని సందేశం. కనుక ధూర్జటి కవి చెప్పినట్లు-
”కేదా రాది సమస్త తీర్థముల కోర్కెన్‌ చూడ పోనేటికిన్‌
కాదా ముంగిలి వారణాశి? కడుపే కైలాసంబు? నీ
పాద ధ్యానము సంభవించునపుడే భావింపగా, జ్ఞానల
క్ష్మీ దారిద్య్రులు కారె లోకులకటా! శ్రీ కాళహస్తీశ్వరా!”
ఓ ఈశ్వరా! నీ పాద పద్మములందు నా మనసు దృఢ భక్తితో కుదురుకొంటే ఇక కేదా రము వంటి పుణ్యతీర్థాలను సేవించాల్సిన పని లేదు. అప్పుడు ఇంటి ముంగిలియే కాశీగా, కడుపే కైలాసంగా భాసిస్తాయి. జ్ఞానమనే సంపదలేని నిరుపేదలై… ఈ మానవులు దేశ దేశా లూ తిరుగుతూ కాలం వ్యర్థం చేసుకొంటున్నారు కదా!
”ఉన్న తావు వదలి ఊరూర తిరిగి న
కన్నదేమి? తాను విన్నదేమి?
తన్ను లోన చూడ తమమెల్ల వీడును
విశ్వదాభి రామ! వినుర వేమ!”
అంతర్దృష్టి అలవడితే అజ్ఞానము పటాపంచలైపోతుంది అనిన వేమన పలుకు ప్రత్యక్షర సత్యమే కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement