Tuesday, May 7, 2024

Vinfast | దేశంలోకి టెస్లా ప్రత్యర్ధి.. తమిళనాడులో విన్‌ఫాస్ట్‌ ప్లాంట్‌ !

మన దేశ కార్ల మార్కెట్‌లోకి వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్‌ అనే కంపెనీ ప్రవేశిస్తోంది. అనతికాలంలోనే ఈ కంపెనీ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల కంపెనీగా ఎదిగింది. టెస్లాకు బీవౖౖెడీతో పాటు, విన్‌ఫాస్ట్‌ నుంచి కూడా గట్టిపోటీ ఎదురవుతోంది. తక్కువ ధరలోనే విద్యుత్‌ కార్లను మార్కెట్‌లోకి తీసుకు వస్తున్న విన్‌ఫాస్ట్‌ అనేక దేశాల మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. ఈ కంపెనీ అందిస్తున్న మోడల్స్‌ కస్టమర్ల ఆదరణ పొందుతున్నాయి.

2017లో ప్రారంభమైన కార్ల తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్‌ ఆటో, 2021 నుంచి విద్యుత్‌ కార్లను తయారు చేస్తోంది. వియత్నంలో అతి పెద్ద వింగ్‌గ్రూప్‌కు చెందిన సంస్థ విన్‌ఫాస్ట్‌ ఆటో. తమిళనాడులోని తూత్తుకుడిలో విన్‌ఫాస్ట్‌ ప్లాంట్‌ను 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. ప్లాంట్‌ నిర్మాణ పనులు ఫిబ్రవరి 25న ప్రారంభిస్తున్నారు. కంపెనీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్‌ విద్యుత్‌ వాహన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

టెస్లాతో పోల్చితే విన్‌ఫాస్ట్‌ పరిమాణంలో చిన్న సంస్థగానే ఉంది. అయితే అమెరికాలోనే టెస్లాకు గట్టి పోటీ ఇస్తామని ఈ సంస్థ ఇదివరకే ప్రకటించింది. అమెరికాలోని నార్త్‌ కరోలినాలో విన్‌ఫాస్ట్‌ ఫిబ్రవరి 28న ప్లాంట్‌ను ప్రారంభించనుంది. ఈ ప్లాంట్‌ మొదటి దశలో సంవత్సరానికి 1,50,000 యూనిట్లు ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. వియత్నాంలోని హై ఫాంగ్‌లో కంపెనీ ప్లాంట్‌ ఉంది. 2023లో విన్‌ఫాస్‌ ్ట 34,855 విద్యుత్‌ కార్లను ఉత్పత్తి చేసింది.

ఇండియాలో విస్తరణ…

- Advertisement -

తమిళనాడులో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న విన్‌ఫాస్ట్‌ దేశవ్యాప్తంగా పటిష్టమైన డీలర్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్లాంట్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించే వరకు అసెంబ్లింగ్‌ చేసిన కార్లను విక్రయించనుంది. ఇండియా ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ కార్లను సౌత్‌ఈస్ట్‌ ఏషియాకు ఎగుమతి చేయాలని నిర్ణయించింది. టెస్లాతో పోల్చుకుంటే విన్‌ఫాస్ట్‌ కార్ల ధర తక్కువగా ఉంది. భారత్‌ మార్కెట్‌లో కొనుగోలుదారులు ఎక్కువగా ధర ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఇండియాలో అమ్మకాలు భారీగా ఉంటాయని కంపెనీ భావిస్తోంది.

ప్రారంభంలో విన్‌ఫాస్ట్‌ మన దేశ మార్కెట్‌లోకి రెండు, మూడు పాపులర్‌ ఎస్‌యూవీ బ్రాండ్స్‌ను తీసుకు వచ్చే అవకాశం ఉంది. విన్‌ఫాస్ట్‌ ప్రీమియం కార్లను కూడా ఉత్పత్తి చేస్తోంది. కంపెనీకి చెందిన వీఎఫ్‌ ఇ-34, విఎఫ్‌ 3-36, విఎఫ్‌ 6, విఎఫ్‌7 మోడల్స్‌ను తీసుకు రానున్నుట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

అతిపెద్ద ఇండియా మార్కెట్‌…

ప్రస్తుతం మన దేశంలో దేశీయ కంపెనీలైన టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా విద్యుత్‌ కార్లను విక్రయిస్తున్నాయి. చైనాకు చెందిన ఎంజీ మోటార్స్‌ టాటా మోటార్స్‌కు పోటీ ఇస్తోంది. విద్యుత్‌ కార్ల మార్కెట్‌లో ప్రస్తుతం టాటా మోటార్స్‌ 80 శాతం వాటా కలిగి ఉంది. 2030 నాటికి దేశంలో 40 శాతం విద్యుత్‌ కార్లు ఉంటాయని అంచనా. మన దేశంలో మార్కెట్‌ ఏటా 20 శాతం చొప్పున పెరుగుతోంది. మరోవైపు మన దేశ మార్కెట్‌లో లగ్జరీ కార్ల కంపెనీలైన మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ, ఆడీ వంటి కంపెనీలు పెద్ద సంఖ్యలో విద్యుత్‌ కార్ల మోడల్స్‌ను తీసుకు వచ్చేందుకు నిర్ణయించుకున్నాయి.

కొరియాకు చెందిన కియా కూడా ప్రీమియం విద్యుత్‌ కార్లను విక్రయించనుంది. మన దేశంలో కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ 2025 ప్రథమార్ధంలో తన తొలి విద్యుత్‌ కార్లు మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. విదేశీ కార్ల కంపెనీలకు సంబంధించి విన్‌ఫాస్ట్‌ కంపెనీ తన మొదటి ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు మార్కెట్‌లోకి వాహనాలను తీసుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement