Monday, May 6, 2024

తగ్గిన షుగర్‌ ఉత్పత్తి.. ధరలు మరింత పెరిగే అవకాశం

దేశంలో ఫిబ్రవరి 15 నాటికి షుగర్‌ ఉత్పత్తి 2.48 శాతం తగ్గి 22.36 మిలియన్‌ టన్నులుగా ఉంది. 2022-23 సంవత్సరంలో 22.93 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి వచ్చింది. షుగర్‌ మార్కెటింగ్‌ సంవత్సరం అక్టోబర్‌- సెప్టెంబర్‌ వరకు ఉంటుంది. 2023-24 సంవత్సరం మార్కెటింగ్‌ సంవత్సరంలో షుగర్‌ ఉత్పత్తి 33.05 మిలియన్‌ టన్నులు వస్తుందని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) అంచనా వేసింది.

అంతకు ముందు సంవత్సరం ఇది 36.62 మిలియన్‌ టన్నులుగా ఉంది. ప్రస్తుత మార్కెటింగ్‌ సంవత్సరంలో మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడులో ఇప్పటి వరకు షుగర్‌ ఉత్పత్తి గతంతో పోల్చితే తక్కువగానే ఉంది. చెరకు సాగులో రెండో స్థానంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో ఈ మార్కెటింగ్‌ సంవత్సరంలో గతం కంటే ఎక్కువగా 6.77 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి వస్తుందని ఐఎస్‌ఎంఏ అంచనా వేసింది. అంతకు ముందు సీజన్‌లో యూపీలో 6.12 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి వచ్చింది.

దీని ప్రభావంతో దేశంలో షుగర్‌ ధరలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంం ధరల నియంత్రణ కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. చెరకు అత్యధికంగా పండే మహారాష్ట్రలో గత 2022-23 సంవత్సరంలో 8.59 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి రాగా, ఈ సారి 7.94 మిలియన్‌ టన్నులే రానుందని తెలిపింది. షుగర్‌ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉన్న కర్నాటకలోనూ అంతకు ముందు సంవత్సరం 4.6 మిలియన్‌ టన్నులు వస్తే, ఈ సారి 4.32 మిలియన్‌ టన్నులకు తగ్గనుందని ఐఎస్‌ఎంఏ తెలిపింది.

ప్రస్తుత మార్కెటింగ్‌ సంవత్సరంలో గుజరాత్‌లో 6,85,000 టన్నులు, తమిళనాడులో 4,50,000 టన్నుల షుగర్‌ ఉత్పత్తి వచ్చింది. ఫిబ్రవరి 15 నాటికి దేశంలో 505 షుగర్‌ మిల్లులు పని చేస్తున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 502 మిల్లులు పని చేశాయి. మహారాష్ట్ర, కర్నాటకలో 22 షుగర్‌ ఫ్యాక్టరీలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయని ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement