Tuesday, October 8, 2024

పెరిగిన వంటనూనెల దిగుమతులు..

దేశంలో వంటనూనెలకు డిమాండ్‌ పెరుగుతున్నది. వినియోగం భారీగా పెరగడంతో జూన్‌లో దిగుమతులు 39.31 శాతం పెరిగి 13.11 లక్షల టన్నులకు చేరాయి. దేశంలో వంటనూనెల వినియోగం పెరిగిందని సాల్వెంట్‌ ఎక్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) తెలిపింది. 2022 జూన్‌లో 9.41 లక్షల టన్నుల వంటనూనెలల దిగుమతులు జరిగినట్లు తెలిపింది. వెజిటేబుల్‌ ఆయిల్స్‌ దిగుమతులు జూన్‌లో 49 శాతం పెరిగి 13.14 లక్షల టన్నులకు చేరినట్లు తెలిపింది. ఇందులో ఎడిబుల్‌, నాన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ ఉన్నాయని ఎస్‌ఈఏ తెలిపింది. గత సంవత్సరం జూన్‌లో ఇవి 9.91 లక్షల టన్నులుగా ఉన్నాయ.

నాన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ దిగుమతులు 2,900 టన్నులుగా ఉన్నాయి. వీటిని ప్రధానంగా సబ్బులు, ఓలియో కెమికల్‌ ఇండస్ట్రీస్‌ దిగుమతి చేసుకుంటున్నాయి. దేశీయంగా వంటనూనెలల ధరలు తగ్గడంతో డిమాండ్‌ భారీగా పెరిగిందని ఎస్‌ఈఏ తెలిపింది. దేశీయంగా ఈ నూనెల లభ్యత పెరుగుతున్నప్పటికీ, దిగుమతులు కూడా పెరుగుతున్నాయని తెలిపింది.
క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ దిగుమతులు జూన్‌లో 4.66 లక్షల టన్నులుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 3.48 లక్షల టన్నులు క్రూడ్‌ పామ్‌ ఆయిల్‌ దిగుమతి అయ్యింది. ఆర్‌బీడీ పామోలిన్‌ దిగుమతులు 85 వేల టన్నుల నుంచి 2.17 లక్షల టన్నులకు పెరిగింది.

- Advertisement -

పొద్దు తిరుగుడు నూనెల దిగుమతులు మాత్రం తగ్గాయని ఎస్‌ఈఏ తెలిపింది. మే నెలలో సన్‌ ప్లవర్‌ నూనెలు 2.95 లక్షల టన్నులు దిగుమతి అయితే జూన్‌లో ఇది 1.90 లక్షల టన్నులుగా ఉంది. ఇండోనేషియా నుంచి పామ్‌ ఆయిల్‌ దిగుమతులు 4.76 లక్షల టన్నులకు పెరిగాయి. మలేషియా నుంచి దిగుమతులు తగ్గి 1.54 లక్షల టన్నులుగా నమోదైనట్లు తెలిపింది. బ్రెజిల్‌ నుంచి సోయాబిన్‌ ఆయిల్‌ దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. బ్రెజిల్‌ నుంచి 1.65 లక్షల టన్నుల సోయాబిన్‌ ఆయిల్‌ దిగుమతులు జరిగాయి.

2022 నవంబర్‌ నుంచి 2023 జూన్‌ మధ్య కాలంలో బ్రెజిల్‌ నుంచి మన దేశం 9.73 లక్షల టన్నుల సోయాబిన్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇది 7.20 లక్షల టన్నులుగా ఉంది. వంటనూనెల విషయంలో స్వయం సమృద్ధిని సాధించాలని ప్రభుత్వాలు చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం, గిట్టుబాటు ధరకు కనుగోలు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నప్పటకీ, దేశీయంగా నూనె గింజల సాగు పెరగడం లేదు. దీంతో భారీగా దిగుమతులపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement