Saturday, July 27, 2024

10 కోట్ల కస్టమర్లుకు చేరిన 5జీ సర్వీస్‌లు..

దేశంలో 5జీ సేవలను 10 కోట్ల మంది వినియోగదారులు పొందుతున్నారు. దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో ప్రస్తుతం 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రపంచంలో అత్యంత వేగంగా 5జీ సేవలు విస్తరిస్తోన్న దేశంగా భారత్‌ నిలుస్తోందని తెలిపింది. మొబైల్‌ సేవలకు సంబంధించి లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి దేవుసింహ్‌ చౌహాన్‌ తెలిపారు.

నవంబర్‌ 24, 2023 నాటికి దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఇందు కోసం 3,94,289 బేస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా సుమారు 10 కోట్ల మంది 5జీ సేవలు పొందుతున్నారని మంత్రి వివరించారు. జులై-ఆగస్టు 2022లో 5జీ స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలం వేయడం ద్వారా 1.5 లక్షల కోట్లు సమకూరాయి. 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి కంపెనీలు 2 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో టెలికం సర్వీస్‌ ప్రొవైడర్ల స్ఠూల ఆదాయం 3 లక్షల కోట్లు దాటిందని చెప్పారు.

దేశంలో 2022, అక్టోబర్‌ 1 నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ దేశవ్యాప్తంగా ఈ సేవలను విస్తరిస్తున్నాయి. స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసిన మరో సర్వీస్‌ ప్రొవైడర్‌ వోడాఫోన్‌ ఐడియా ఇంకా 5జీ సేవలను భారీ ఎత్తున ప్రారంభించేదు. దేశంలో ప్రస్తుతం 8-10 కోట్ల వరకు 5జీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారరులు ఉన్నట్లు ఎరిక్‌సన్‌ కూడా ఇటీవల అంచనా వేసింది. అమెరికా, బ్రిటన్‌, దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల్లోని వినియోగదారులతో పోలిస్తే భారత వినియోగదార్లు వారానికి 2 గంటలు ఎక్కువగానే 5జీ సేవలను వినియోగించుకున్నట్లు ఎరిక్‌సన్‌ తన నివేదికలో తెలిపింది. 2024 నాటికి దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 15 కోట్లకు చేరుకోవచ్చని ఈ సంవత్సరం నోకియా కూడా అంచనా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement