Sunday, June 16, 2024

రోజుకు 19 కిలో మీటర్లు మందగించిన రహదారి నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అభివృద్ధికి ప్రాతిపదికగా భావించే రహదారుల నిర్మాణం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా దారుణంగా పడిపోయింది. గత సంవత్సరం (2020-21) రికార్డు స్థాయిలో రోజుకు 37 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం జరగ్గా, ఈ సారి 2021-22లో రోజుకు 28.64 కిలోమీటర్లకు తగ్గడం గమనార్హం. అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో జాతీయ రహదారుల నిర్మాణ వేగం 2020-21లో అది రోజుకు 28.64 కిలోమీటర్లకు తగ్గింది. రహదారుల మంత్రిత్వ శాఖ 2022 ఆగస్టు వరకు 2,912 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించింది. ఇక 2020-21 సంవత్సరం ఆగస్టు వరకు 3,356 కిలోమీటర్ల మేరకు జరిగిన నిర్మాణాలతో పోలిస్తే.. ఈ ఏడాది అదే కాలంలో ఇది కేవలం 2,506 కిలోమీటర్లు మాత్రమే జ‌రిగినట్లు గుణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా నివేదికల ప్రకారం రహదారుల నిర్మాణం మందగించడానికి నిధుల లేమి ఒక కారణం కాగా, వనరుల కొరత మరో కారణం అని తెలుస్తోంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహాదారుల నిర్మాణ లక్ష్యం 12,000 కిలో మీటర్లు. ఇక 2019 -20లో 10,237 కిలో మీటర్లు, 2020-21లో 13,321 కిలోమీటర్లు, 2021-22లో 10,438 కిలోమీటర్ల మీర జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది.

కాగా జాతీయ రహదారుల నిర్మాణంలో ప్రత్యేకించి.. స్థల సేకరణతో పాటు నిధుల మంజూరులో జాప్యం సహా మరికొన్ని అంశాలు జాప్యానికి దోహదం చేస్తున్నట్లు కేంద్రం భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం చోటు చేసుకోని పక్షంలో.. ఈ ప్రభావం ఇతరిత్ర పలు అంశాలపై ప్రభావం చూపించే ప్రమాదమున్నట్లు కేంద్రం ఆందోళన చెందుతున్నట్లు సంబంధిత వర్గాల నుంచి వినవస్తుంది. ఈ క్రమంలోనే.. జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించాలని, జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థలతో పాటు ఆయా రంగాల నిపుణులను ఇందులో సభ్యులుగా నియమించాలని యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తం జాతీయ రహాదారుల నిర్మాణంలో వేగం పెంచేందుకు పూర్తిస్థాయి చర్యలు తీసుకునే దిశగా వెళుతోన్న కేంద్రం.. అక్టోబర్‌ మొదటి వారంలో ఓ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాల స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement