Saturday, April 13, 2024

Water War – తెలుగు రాష్ట్రాల మ‌ధ్య య‌ధావిధిగా జ‌ల‌జ‌గ‌డం …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కృష్ణానది యాజమాన్యం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశానికి తెలంగాణ గైర్హాజరైంది. ఇప్పటికే అనేక పర్యాయాలు లేఖల ద్వారా అభ్యంతరాలు, డిమాండ్లు తెలియచేసిన నేపథ్యంలో కొత్తగా సమావేశంలో చర్చించా ల్సిన అంశాలు ఏమున్నాయనే అభిప్రాయం తెలంగాణ నీటి పారుదల శాఖ అధికా రులు వ్యక్తం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న తెలంగాణకు కృష్ణా జలాల్లో ఆంధ్రతో సమానంగా నీటివాటా కావాలని చేసిన ప్రతిపాదనలకు కేఆర్‌ఎంబీ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకపోవడం పట్ల అధికారులు విచారం వ్యక్తం చేశారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల్లో 511 ఏపీ, 299 తెలంగాణ వాటాగా ఉండటం పట్ల అభ్యంతరం తెలియ చేస్తూ ఇప్పటికే కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ రావు లేఖరాశారు. తెలంగాణ పొదుపుగా కాపాడుకున్న 18 టీఎంసీల నీటిని వాటాకు అదనంగా చేర్చాలని మురళీధర్‌ లేఖలో కేఆర్‌ఎంబీని కోరారు. అయితే ప్రస్తుతం జరిగిన సమా వేశానికి మురళీధర్‌ హాజరుకాకున్నా ప్రతిపాదనలు కేఆర్‌ఎంబీ ముందుడటంతో నిర్ణయం తీసుకోవల్సిన బాధ్యత కూడా బోర్డుకు ఉందని అధికారులు చెప్పారు

ఇదిలా ఉండగా సోమవారం జలసౌధలో కృష్ణా నది యాజమాన్యం బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశానికి కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, ఆంధ్ర ఈఎన్సీ నారాయణరెడ్డి హాజరయ్యారు. అలాగే కేఆర్‌ఎంబీ జల నిపుణులు, ఆంధ్ర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్‌ కుడికాలువకు ఐదు టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ కేఆర్‌ఎంబీని కోరగా తెలంగాణ సమావేశానికి రాని నేపథ్యంలో ఈ అంశంపై కృష్ణా నది యాజమాన్యం బోర్డు చైర్మన్‌తో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని రాయిపురే చెప్పారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ రాసిన లేఖలను రాయిపురే ఏపీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న నీటి వాటా 34:66ను ప్రస్తుత నీటి సంవత్సరం నుంచి శాశ్వతంగా సవరించి 50:50 నిష్పత్తిలో వాటా కావాలని కోరిన నేపథ్యంలో మరో సమావేశంలో ఈ అంశంపై ఆంధ్ర, తెలంగాణతో చర్చించనున్నట్లు చెప్పారు.

అయితే ప్రస్తుతం ఏపీ చేసిన ప్రతిపాదనలపై కేఆర్‌ఎంబీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కృష్ణాలో నీరు తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాలకే వినియోగించాలని కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. అయితే ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్‌కు సంబంధించి 30 టీఎంసీలు విడుదల చేయాలని కోరగా సభ్య కార్యదర్శి రాయిపురే మాట్లాడుతూ కేఆర్‌ఎంబీ చైర్మన్‌ శివానందకుమార్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో పలుకీలక అంశాలు చర్చించాల్సి ఉండగా తెలంగాణ ఈఎన్సీ రాకపోవడంతో చర్చ జరగలేదని అధికారులు చెప్పారు. పోతిరెడ్డిపాడుకు 80వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు కొనసాగుతున్న హెడ్‌ రెగ్యూలేటర్‌ పనులు నిలపాలని తెలంగాణ చేసిన డిమాండ్‌ పై ఇప్పటికీ కేఆర్‌ఎంబీ నిర్ణయం తీసుకోకపోవడం పట్ల తెలంగాణ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే వాటాకు మించి 51 టీఎంసీల నీటిని వాడుకున్న ఏపీ నాగార్జున సాగర్‌ నుంచి మరో 30 టీఎంసీలు కోరడాన్ని తెలంగాణ తప్పుబట్టింది. ఎగువ నుంచి ప్రవాహాలు లేకపోవడంతో నాగార్జునసాగర్‌ డెడ్‌ స్టోరేజికి చేరువుగా ఉన్నా ఏపీ అనేక కారణాలు చూపుతూ అదనంగా నీటి విడుదల కోరడం వింతగా ఉందని అధికారులు నిందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement