Tuesday, June 11, 2024

AP: ఓటింగ్ స‌క్సెస్ చేశాం…ఇక కౌంటింగ్ పై దృష్టి పెట్టండిః సీఈవో ముఖేష్ కుమార్ మీనా

చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమిష్టి కృషితో ఈ నెల 13 న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు ఎపి ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. అదే స్పూర్తితో వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన నేడు వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సంబంధిత వివరాలను అంటే ఏ రోజున, ఎన్ని గంటలకు, ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతున్నది అనే వివరాలను రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.

- Advertisement -

అసెంబ్లీ, లోక్ స‌భ కౌంటింగ్ కు వేర్వేరు ఏర్పాట్లు

స్ర్టాంగ్‌ రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్‌ యంత్రాలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి బారికేడ్లతో పాటు సూచికల బోర్డులను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. లెక్కింపు కేంద్రంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాలకు వేరు వేరుగా పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు.

ముందుగా పోస్ట‌ల్ బ్యాలెట్లు లెక్కింపు..

ఈవిఎంలు ఓపెన్ చేయ‌డానికి ముందే పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కింపు జ‌ర‌పాల‌ని అధికారుల‌ను కోరారు.. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లును ఏర్పాటు చేయాలన్నారు. ఆ తదుపరే ఈవీఎంల వారీగా పోల్ అయిన ఓట్లను లెక్కించాలన్నారు. ఓట్ల లెక్కింపుకు సుశిక్షితులైన సిబ్బందిని నియమించుకోవాలని, వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ముందుగానే నిర్వహించాలన్నారు.

సుశిక్షిత సిబ్బందిని నియ‌మించుకోండి..

అదే విధంగా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్స్ ను కౌటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్కోర్‌లో ఎప్పటి కప్పుడు డేటా ఎంట్రీకి సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని, కౌంటింగ్ అధికారులు, సిబ్బంది మొబైల్ ఫోన్స్ డిపాజిట్‌కు ప్రత్యేకంగా కౌంటర్లను కూడా ముందుగానే ఏర్పాటు చేసుకోవాలన్నారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను, అనధికార వ్యక్తులను, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంగణాల్లోకి అనుమతికుంచకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు.

స్ట్రాంగ్ రూమ్ ల వ‌ద్ద మూడంచ‌ల భ‌ద్ర‌త

ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత కొనసాగుతున్నదని, అయితే స్ర్టాంగ్‌ రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్‌ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు. భద్రత పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement