Thursday, May 2, 2024

రేపటి తరాలకోసం రామకోటి తరహాలో గోవింద కోటి – టీ టీ డి బోర్డు తీర్మానం

తిరుమల (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : సనాతన ధర్మ పరిరక్షణ లో భాగంగా 25 ఏళ్ల లోపు యువత కోసం రామకోటి తరహాలో గోవింద కోటి ని ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీ టీ డి ) ధర్మ కర్తల మండలి ఈరోజు తీర్మానం చేసింది. తిరుమల అన్నమయ్య భవనం లో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వం లో తొలి సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం ఆయన ఈ ఓ ధర్మారెడ్డి తో కలిసి సమావేశం లో చేసిన తీర్మానాలను మీడియా కు వివరించారు. ఆ వివరాల ప్రకారం 25 ఏళ్ల లోపు యువతీ యువకులు ఎవరైనా కోటి సార్లు గోవింద నామాన్ని కోటి సార్లు రాసి టీ టీ డి కి సమర్పించవచ్చు. అలా సమర్పించిన వారికి వారి కుటుంబ సభ్యులకు ఒకసారి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని వి ఐ పి బ్రేక్ లో దర్శనం చేసుకునే అవకాశం టీ టీ డి కల్పిస్తుంది. అదే 10 లక్షల వెయ్యిన్ని నూట పదహారు సార్లు రాసే వ్యక్తికీ వి ఐ పి బ్రేక్ దర్శనం చేసుకునే వీలు కల్పిస్తారు. వెంటనే అమలు లో కి వచ్చే ఈ గోవింద కోటి రచన ద్వారా యువత లో భక్తి తత్వం, భగవంతుని పై గురి పెరుగుతుందని భావిస్తున్నామని కరుణాకర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఎల్ కె జి నుంచి పి జి వరకు చదివే విద్యార్థులకోసం అందరికీ అర్ధం అయ్యే విధంగా భగవద్గీత సారాంశం తో 20 పేజీల చిన్న పుస్తకాలను కోటి ముద్రించి ఇవ్వాలని కూడా తీర్మానించినట్టు కరుణాకర్ రెడ్డి తెలిపారు. చిన్న తనం నుంచే భగవద్గీత గొప్పతనం రేపటితరాలకు తెలియచేయడమే దీని లక్ష్యమని చెప్పారు

సనాతన ధర్మం అంటే మతం కాదు… జీవనయానం
“సనాతన ధర్మం అంటే ఒక మతానికి సంబందించిన అంశం కాదు.. సంప్రదాయం సంస్కృతులతో కూడిన జీవనయానం. ” అని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీ టీ డి ) ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తమిళనాడు రాష్త్ర మంత్రి ఉదయనిధి స్థాలిన్ సనాతన ధర్మాన్ని అపహాస్యం చేయడం పై ఈ రోజు తిరుమల లో జరిగిన మీడియా సమావేశం లో స్పందించారు. సనాతన ధర్మం మనిషికి ధర్మాచరణ ఎలా చేయాలో నిర్దేశించే మార్గమేకానీ, ఏదో మతానికి చెందింది కాదన్నారు. సకల మానవాళి సంక్షేమం కోసం సనాతన ధర్మం ప్రతిపాదించిన వర్ణాశ్రమ విధానాన్ని కుల వ్యవస్థ కోణంలో చూడడం పొరబాటు అవుతుందన్నారు. ఆ ధర్మాన్ని విమర్శించే వారు ఆ అంశం పై కనీస అవగాహన లేనివారు కానీ, ఉద్దేశ పూర్వకంగా మాట్లాడేవారు కానీ అయింటారని కరుణాకర్ రెడ్డి అన్నారు.
.

Advertisement

తాజా వార్తలు

Advertisement