Wednesday, May 1, 2024

దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. మూడు వారాల్లో సీన్‌ మొత్తం రివర్స్‌

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో టమాటా ధరలు అత్యంత దారుణంగా పడిపోతున్నాయి. రెండు నెలలుగా భారీగా పెరిగిన ధరల సీన్‌ ఇప్పుడు రివర్స్‌ అయ్యింది. తాజాగా కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో టమాటా ధరలు దిగి వచ్చాయి. ఇక్కడ రైతులు శుక్రవారం సాయంత్రం సుమారు 10 టన్నుల సరకు మార్కెట్‌కు తెచ్చారు. వేలంలో క్వింటాలు టమాటాకు రూ.వెయ్యి కంటే తక్కువ ధరే పలికింది.

అంటే.. కిలోకు రూ.10 కూడా దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అధిక దిగుబడి రావడం వల్ల ధరలు పతనం అవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఇటు మదనపల్లెతో పాటుగా అనంతపురం జిల్లాలోని మార్కెట్‌లో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మార్కెట్‌లలో మాత్రం కిలో టమాటాకు రూ.30 నుండి రూ. 40 వరకు నడుస్తోంది.

జులైలో ఆకాశాన్నంటిన ధరలు

- Advertisement -

జులై నెలలో టమాటాల ధరలు ఆకాశాన్ని తాకాయి. కేజీ రూ.50 నుంచి మొదలై.. రూ.100, ఆ తర్వాత రూ.150 నుంచి ఏకంగా రూ.200 కు పెరిగింది. అయితే జులై నెలాఖరు నుంచి ఆగస్టు మొదటి వారంలో పరిస్థితి మొత్తం మారిపోయింది. ధరలు మెల్లిగా పడిపోతూ వచ్చాయి.. ఇప్పుడు దారుణంగా రూ.10కు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మొన్నటి వరకు లాభాలు కురిపించిన టమాటా ధరలు ఇప్పుడు ఊహించని రీతిలో పడిపోయాయి అంటున్నారు.

రైతుల ఆవేదన

గతంలో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు చూశాం. ఎన్నో సందర్భాల్లో కష్టపడి పండించిన పంటకు గిట్టు బాటు ధర లేక రోడ్డు పక్కన పడేసిపోయిన ఘటనలు ఉన్నాయి. ఒక్కోసారి కేజీ రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు పలికాయి.. పంటను తీసుకొచ్చిన వాహానికి బాడుగకు కూడా డబ్బులు వచ్చేవి కాదు. కానీ జూన్‌, జులై నెలల్లో మాత్రం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో కొందరు రైతులు కోట్లలో ఆదాయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ పాత పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement