Friday, May 3, 2024

ఏపీకి మేలు చేయని బడ్జెట్.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయాలి: వైసీపీ ఎంపీలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో వైసీపీ లోక్‌సభ సభ్యులు మార్గాని భరత్, నందిగామ సురేష్, శ్రీకృష్ణదేవరాయలు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి వ్యతిరేకంగా ఉందన్నారు. రైతులకు అవసరమయ్యే ఎరువులపై సబ్సిడీని, ఫుడ్ సబ్సిడీ, గ్రామీణాభివృద్ధి బడ్జెట్‌ను తగ్గించారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగా కేంద్రం ఏపీకి ఏం చేసిందో ప్రజలు, తామూ చూస్తూనే ఉన్నామన్నారు. బడ్జెట్‌లో నిధులైతే పెంచారు గానీ ముందుకెళ్లే పరిస్థితి మాత్రం కనిపించట్లేదని ఆయన వాపోయారు. యూపీ, బీహార్‌లో భూసేకరణకు 75 శాతం నిధులను ఇస్తున్న కేంద్రం 25 శాతం రాష్ట్రాల నుంచి తీసుకుంటోందని చెప్పుకొచ్చారు. ఏపీలో భూసేకరణకి 50 శాతం కేంద్రం ఇస్తే 50 శాతం రాష్ట్రం నుంచి తీసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. 23 వేల కోట్లు ఆర్ధిక లోటు ఉంటే 4 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని, వెనుకబడిన జిల్లాలకు నిధులివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి దగ్గరగా కేంద్ర బడ్జెట్‌లో అంకెలు ఉండాలని సూచించారు. ఏపీకి రుణ పరిమితి తగ్గిస్తూ టీడీపీ చేసిన తప్పుకి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాల నుంచి వస్తున్న పెట్రోల్, డీజిల్‌పై వస్తున్న సెస్సులు తీసుకుని కంటి తుడుపు చర్యగా లక్ష కోట్ల రుణాలు ఇస్తామంటున్నారని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మాట్లాడటానికి అవకాశం వస్తే చాలు రాష్ట్ర పథకాలు ఆపేయాలని చెప్పడం, నిధులకు అడ్డంకిగా మారడం ప్రతిపక్షానికి అలవాటైందని విమర్శించారు. సంక్షేమ పథకాలకు, రంగాల వారీగా కేంద్ర వాటా కన్నా రాష్ట్ర ప్రభుత్వం అధికంగా ఖర్చు పెడుతోందని ఎంపీ శ్రీకృష్ణ వివరించారు. ఏపీకి రావాల్సిన నిధులపై కేంద్రంతో గట్టిగా పోరాడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా టీడీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. రథం దగ్దం, జిన్నా టవర్ అంశాలపై ఉన్న దృష్టి రాష్ట్రానికి న్యాయం చేసే అంశాలపై టీడీపీకి లేదని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీ తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. తిరుపతిలో ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిన ప్రధాని మోదీకి కేంద్రపాలిత ప్రాంతం అంశం గుర్తు రాలేదా అని శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అనేది మాజీ ప్రధాని ఇచ్చిన హామీ అని, అది నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేశారని, అప్పుడు కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఎంపీ మార్గాని భరత్ అభిప్రాయపడ్డారు. టీడీపీ రాష్ట్ర సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉండి జూమ్‌లో ప్రసంగాలు చేయడం కాదు… ఏపీకి వచ్చి కార్యక్రమాలు చేపట్టాలని భరత్ చంద్రబాబు నాయుడికి సూచించారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంపు, రాష్ట్రానికి రావాల్సిన నిధులను టీడీపీ అడ్డుకుంటోందని ఆరోపించారు.

రఘురామా! ఒళ్లు దగ్గర పెట్టుకో.!!
రఘురామకృష్ణరాజు వయసుకు తగ్గట్టు మాట్లాడాలని ఎంపీ భరత్ సూచించారు. ఆయన వ్యవహార శైలిని పార్లమెంట్‌లో ఎంపీలు చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తాము ఆయన వయసుకు గౌరవమిచ్చి మాట్లాడుతుంటే ఆయన అసభ్య పదజాలంతో తమను దూషిస్తున్నారని, ఇప్పటికైనా రఘురామ కృష్ణరాజు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. ఆయన గురించి ఫిల్మ్ నగర్ మొత్తం తెలుసని భరత్ విమర్శించారు. ఆయన వ్యవహారశైలి మారకపోతే తాను చేతులు కట్టుకుని కూర్చోనని హెచ్చరించారు.

అనంతరం నందిగామ సురేష్ మాట్లాడుతూ… ప్రత్యేక హోదాను దిగజార్చింది చంద్రబాబేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పథకాలను అడ్డుకోవాలని, సినిమా టికెట్లు, మతాల మధ్య కలహాలపై టీడీపీ దృష్టి ఉందని ఆరోపించారు రాష్ట్రం అథోగతి పాలు కావాలని ప్రతిపక్షం కుట్ర చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కావల్సినవి కేంద్రాన్ని కోరాలే గానీ రాష్ట్ర పథకాలను అడ్డుకోవాలని చూడకూడదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ముష్టి యుద్దాలు మానుకోవాలని సురేష్ హితవు పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement