Thursday, April 25, 2024

వివేకా కేసులో కొత్త ట్విస్ట్… సునీల్ యాదవ్ అరెస్ట్

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్యోదంతంలో కీలక అనుమానితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివేకా హత్య కేసులో సునీల్‌ పాత్ర ఉందని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు సోమవారం గోవాలో అదుపులోకి తీసుకొన్నారు. ఆయనను కడపకు తీసుకురానున్నారు. వెంటనే అతన్ని కోర్టులో హాజరుపరుస్తారని సమాచారం.

వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ ముందు నుంచి కీలక అనుమానితుడిగా ఉన్నాడు. అయితే విచారణ పేరుతో సీబీఐ తమను వేధిస్తోందని, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని సునీల్‌ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం పులివెందులలో తమ నివాసానికి తాళం వేసి సునీల్ కుటుంబమంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. సునీల్‌ గోవాలో ఉన్నట్లు తెలియడంతో సీబీఐ బృందం అక్కడకు వెళ్లి సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఏపీ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణకు కొనసాగుతోంది. దాదాపు  60 రోజులుగా సీబీఐ అధికారులు నిరాటంకంగా విచారణ సాగిస్తున్నారు. కడప కేంద్ర కారాగారం కేంద్రంగా విచారణ జరుపుతున్నారు. అందులో భాగంగా పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సునీల్ కుమార్ యాదవ్ ను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. కాగా, 2019 మార్చి 14వ తదీ రాత్రి తన నివాసంలోనే వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement