Tuesday, May 14, 2024

AP | అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా.. తిరుపతి సభలో కాంగ్రెస్​ హామీ

తిరుపతిలలో న్యాయసాధాన సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఏపీకి ప్రత్యేక హోదా డిక్లరేషన్‌ సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స‌భ‌లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తుందని.. రాహుల్‌ గాంధీ పీఎం అయ్యాక తొలి సంతకం దీనిపైనే చేస్తారని షర్మిల వెల్లడించారు.

తిరుపతిలోని ఇదే మైదానంలో ప్రధాని మోదీ అనేక హామీలు ఇచ్చారని షర్మిల అన్నారు. అద్భుతమైన రాజధాని కడతామన్నారు. రాష్ట్రాన్ని హార్డ్‌వేర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. వాటిలో ఒక్క‌టైనా నిల‌బెట్టుకున్నారా ? అని ప్ర‌శ్నించారు శ‌ర్మిల‌. పదేళ్లుగా కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేస్తోందని దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మెట్రో రైలు లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీ మాత్రమేనని షర్మిల వివరించారు.

సభలో పాల్గొన్న కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికలకు ముందు ఏపీకి పదేళ్లు హోదా ఇస్తామని ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోడీ ప్రమాణం చేశారని సచిన్ పైలట్ గుర్తుచేశారు. మోడీ అధికారంలోకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నా ఆయన ఇచ్చిన హామీ అమలు చేయలేదన్నారు. రాష్ట్రాన్ని పాలించిన తెలుగుదేశం, వైసీపీ కూడా ఆ దిశగా మోడీపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇచ్చి చూస్తే… ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నీ అమలు చేసి చూపుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement