Friday, May 17, 2024

ఏపీలో ఘోర ప్ర‌మాదం, రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురు మృతి.. శ్రీ‌శైలం వెళ్లి వ‌స్తూ కాన‌రాని లోకాల‌కు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పల్నాడు జిల్లాలో ఈ ఘ‌ట‌న ఈ ఉద‌యం చోటుచేసుకుంది. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో మొదట న‌లుగురు వ్యక్తులు చ‌నిపోయారు. ఆపై హాస్పిట‌ల్‌కు తరలిస్తుండ‌గా మ‌రో ఇద్ద‌రు చనిపోయినట్లు సమాచారం. శ్రీశైలం వెళ్లి శివయ్య దర్శనం చేసుకుని వస్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

శ్రీశైలం వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శనం చేసుకుని వస్తున్న కుటుంబం, బంధువులు మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటాం అనుకున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం జరిగింది. రెంటచింతల పొలిమేరలోకి రాగానే విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నం ఢీకొట్టింది. దీంతో టాటా ఏస్ వాహనం పల్టీలు కొట్టడంతో నిద్రమత్తులో ఉన్న వారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆదివారం అర్ధరాత్రి వీరి హాహాకారాలు రెంటచింత రహదారిలో ప్రతిధ్వనించినా సహాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేరు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో దాదాపు 35 మంది వరకు ఉన్నట్లు సమాచారం.

పల్నాడు జిల్లా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన దాదాపు 35 మంది దైవ దర్శనం చేసుకుందామని టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి శివయ్యను దర్శించుకున్నారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణమైన వీరు మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుటామనుకున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో 15 మంది వరకు గాయపడ్డారు. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను అంబులెన్స్ లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ సమీర్ భాష తెలిపారు.

మాచర్ల నుంచి రెంటచింతలకు ప్రవేశించే మొదట్లో గోలివాగు కాలువ వద్ద స్నానాలు చేసేందుకు వాహనాలు ఆపుతుంటారు. ఇక్కడ వాహనాలు ఆపితే రాత్రివేళ కనిపించవు. రెంటచింతల బీసీ కాలనీ వాసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ అతివేగంగా నడపడంతో టాటా ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం చెందగా.. గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారని ఎస్సై సమీర్ బాషా తెలిపారు. మొత్తం ఆరుగురు చనిపోగా, అందులో నలుగురు మహిళలున్నారు. మృతులను కోటమ్మ(70), రోశమ్మ(65), రమాదేవి(50), రమణ(50), కోటేశ్వరి(45), లక్ష్మీనారాయణ(35)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement