Wednesday, May 1, 2024

ఏపీకి ఏడు ఈఎస్‌ఐ ఆసుపత్రులు.. రాజ్యసభలో కేంద్రం వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌కు ఏడు నూతన ఈఎస్‌ఐ ఆసుపత్రులను మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ఈఎస్‌ఐ ఆసుపత్రులు, వాటికి రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి సంబంధించిన వివరాలు అందజేయాల్సిందిగా సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కోరారు. దానికి కేంద్ర, ఉపాధి మంత్రిత్వ శాఖా సహాయ మంత్రి రామేశ్వర్ తేలి సమాధానమిస్తూ విశాఖపట్నంలో సుమారు రూ.384.26 కోట్ల ఖర్చుతో ఆసుపత్రి నిర్మాణమవుతోందని, విజయనగరంలో రూ.73.68 కోట్ల కేంద్ర నిధులతో మరో ఆసుపత్రి, కాకినాడలో రూ.102.77 కోట్ల కేంద్ర నిధులతో ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గుంటూరు, పెనుకొండ, విశాఖపట్నంలోని అచ్యుతాపురం, నెల్లూరు శ్రీ సిటీలకు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులను మంజూరు చేశామని, దానికి సంబంధించిన భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. పునర్నిర్మాణంలో మూడు ప్రధాన ఈఎస్‌ఐ ఆసుపత్రులున్నట్టు ఆయన వెల్లడించారు.

రాజమండ్రిలో ఈఎస్ఐ ఆస్పత్రికి రూ.97.97 కోట్లు కేటాయించామని, పునర్నిర్మాణానికి 10.90 కోట్ల నిధులను విడుదల చేసనట్టు వివరించారు. విశాఖపట్నం మల్కిపురంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి పునర్నిర్మాణానికి 79 కోట్లు కేటాయించగా… ఇప్పటివరకూ 19.16 కోట్ల నిధులను విడుదల చేసినట్టు కేంద్ర మంత్రి జవాబులో పేర్కొన్నారు. విజయవాడలో కూడా సీపీడబ్ల్యుడీ శాఖకు ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ బాధ్యతలు అప్పగించినట్టు చెప్పుకొచ్చారు. వైద్య వసతుల లేమితో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7 కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రులు, 3 ఆసుపత్రుల పునర్నిర్మాణ పనులకు కేంద్రం నడుం బిగించడంపై ఎంపీ జీవీఎల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement