Wednesday, May 8, 2024

AP: వైభవంగా ప్రారంభమైన భవానీ దీక్షల స్వీకరణ..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : జై భవాని, జై జై దుర్గా భవాని అనే అమ్మవారి నామస్మరణతో ఇంద్రగిరులు పులకరిస్తున్నాయి. 41 రోజులపాటు పరమ పవిత్రంగా అమ్మవారిని కొలిచేందుకు భక్తులు స్వీకరించే భవానీ దీక్షల స్వీకరణ కార్యక్రమం అత్యంత వైభవంగా గురువారం నుండి ప్రారంభమైంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో అర్చకులు, గురు భవానీల సమక్షంలో మాలాధారణ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు, వైదిక కమిటీ సభ్యులు, పురోహితుల సమక్షంలో ప్రత్యేక పూజల అనంతరం దీక్షా స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు భవాని మండల దీక్షల స్వీకరణ చేయనున్న సందర్భంలో ఇవాళ నుండి ఆదివారం వరకు ఐదు రోజులపాటు భవాని మండల దీక్షను భక్తులు అర్చకులు, గురు భవానీల చేతుల మీదుగా స్వీకరించనున్నారు.

మండల దీక్షలను స్వీకరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి గురుభవానీలు అర్చకుల సమక్షంలో భవాని దీక్షదారణను స్వీకరిస్తున్నారు. డిసెంబర్ 13 నుంచి 17వ తారీకు వరకు అర్థ మండల దీక్ష (21 రోజుల పాటు) స్వీకరణకు అవకాశం ఉండగా, జనవరి 3 నుండి జనవరి 7 వరకు అమ్మవారి ఆలయంలో కనకదుర్గమ్మ సాక్షిగా భవానీలు దీక్ష విరమణ చేయనున్నారు. 1983 నుండి ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన ఈ దీక్షలు నిరాటంకంగా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జరుగుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఈ దీక్షను ఏటా స్వీకరిస్తూ అమ్మవారిని అత్యంత ఇష్టంగా పూజిస్తుంటారు. అలాగే జనవరి 3 తేదీన అమ్మవారికి శత చండీయాగం ప్రారంభమవుతుండగా, జనవరి 7వ తేదీన పూర్ణాహుతితో యాగం కూడా ముగియనుంది. ఈ సమయంలో మండల, అర్థ మండల దీక్ష సేకరించిన భవానీలందరూ దీక్ష విరమణ చేయనున్నారు. ఈరోజు వచ్చే భక్తులతో పాటు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వచ్చే భవానీల కోసం ఆలయ ఈవో కేఎస్ రామారావు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement