Sunday, February 25, 2024

కర్నూల్ మేయర్ గా రామయ్య..!

ఈనెల18న పట్టాభిషేకం

డిప్యూటీ మేయర్ ఎంపికకు క్యాంపుల జోరు

పాలకవర్గం రాకతో నగర సమస్యలకు పరిష్కారం దక్కేనా

కర్నూల్ బ్యూరో, మార్చి 16, ప్రభ న్యూస్.

ఎంతో ప్రాధాన్యత గల నగరాల్లో కర్నూలు ఒకటి. ఒకప్పటి ఏపీ రాజధాని అయిన కర్నూలు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నగరంగా గుర్తింపు పొందింది. 1993 వరకు మున్సిపాలిటీ గా ఉన్న కర్నూలు 1994లో కార్పొరేషన్ ఏర్పడింది. తొలిసారే ఎస్సీ లకు ఈ స్థానం రిజర్వ్ కావడంతో అప్పట్లో మేయర్ గా ఎన్నికైన బంగి అనంతయ్య 1998 వరకు పనిచేశారు. ఆ తర్వాత మహిళా కోటాలో ఫిరోజ్ బేగం. ఓపెన్ కేటగిరి కింద రఘురాం రెడ్డి 2010 వరకు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల కార్పొరేషన్ కు ఎన్నికలు జరగలేదు. కార్పొరేషన్ పరిధిలో కొన్ని పంచాయతీలను విలీనం చేసిన ఆయా పంచాయతీల పంచాయతీలకు సంబంధించి న్యాయస్థానం మెట్లు ఎక్కడం, బీసీ ఓటర్ల గణన లో ఇబ్బందులు ఉండడం తదితర కారణాల వల్ల దశాబ్దకాలంగా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చింది.

కర్నూలు కార్పొరేషన్ తర్వాత మొదట చిన్న నగరంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం మహా నగరంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తొలిసారిగా మేయర్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
దాదాపు 11 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న….అధికార వైసీపీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఎన్నికలు జరిగిన 52 డివిజన్లలో 43 డివిజన్లలో వైసీపీ ఘన విజయం సాధించగా.. ప్రతిపక్ష పార్టీ మాత్రం కేవలం 8 డివిజన్ లకే పరిమితం అయింది.

మేయర్ గా బి వై. రామయ్య

ఎన్నికలు ముగిశాయి.., అధికార పార్టీ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడంతో ప్రస్తుతం అందరి చూపు మేయర్ అభ్యర్థి పైనే పడింది. అసలే 11 ఏళ్ళ అనంతరం జరిగిన ఎన్నికలు కావడం., మేయర్ అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు గతంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారు. ప్రస్తుతం 19 వ డివిజన్ నుంచి ఎన్నికైన కార్పొరేటర్ బి వై.రామయ్య మేయర్గా పీఠం అధిష్టించను న్నారు.పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మేయర్ గా బి వై .రామయ్య కర్నూల్ కి సేవలందించనున్నారు. ఈ నెల 18వ తేదీన మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. 43 స్థానాలు వైసీపీ పార్టీ కైవసం చేసుకోవడంతో లాంఛనంగానే మేయర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే డిప్యూటీ మేయర్ పదవి ఇక్కడ కీలకం కానుంది. డిప్యూటీ మేయర్ గా కొన్ని పేర్లు తెరపైకి వచ్చినా ఇంకా ఖరారు కాలేదు. ఈ క్రమంలో నగరంలో రాజకీయ క్యాంపు జోరందుకుంది.

రామయ్య ముందు పెను సవాళ్లు
కర్నూల్ మేయర్ గా పదవిని అధిష్టించ నున్న రామయ్య ముందు అనేక సమస్యలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది కర్నూలు నగరంలో మంచినీటి సమస్య. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఈ సమస్య ఆయనకు జఠిలం కానుంది. ప్రస్తుతం నగరంలో 5.5 లక్షల జనాభా ఉండగా, నీటి సమస్య కారణంగా నగర శివార్ల కాలనీలకు రెండు రోజులకు ఒకసారి మంచి నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదల నిమిత్తం తుంగభద్ర నది నుంచి నీటిని తీసుకొని రౌండ్ ది క్లాక్ ప్రాతిపదికన సరఫరా చేయడం జరుగుతుంది. అయితే వేసవిలో సుంకేసుల జలాశయంలో నీటిమట్టం తగ్గిపోవడం ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. కేసీ కాలువ లో కనీసం 70 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండేలా చూసుకుంటేనే కర్నూలు నీటి సమస్య గండం గట్టెక్కుతుంది. ప్రస్తుతం కర్నూల్ మహానగరంలో వాణిజ్య కనెక్షన్ల తో కలిపి 65 వేల నీటి కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. నీటి కొరత కారణంగా రోజు వారి అవసరాలకు తగ్గట్లుగా 72.12 ఎం ఎల్ డి నీటిని సరఫరా చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 50 ఎం ఎల్ డి నీటిని సరఫరా చేస్తున్నారు. వీటివల్ల శివారు కాలనీల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. ప్రస్తుతం ఉన్న సమ్మర్ స్టోరేజ్ పక్కనే ఉన్న 260 ఎకరాల్లో అదనపు సమ్మర్ స్టోరేజ్ నిర్మాణంకు చొరవ చూపాలి.

తుంగభద్ర హంద్రీ నది కరకట్టల నిర్మాణం

తుంగభద్ర నది వరదల వల్ల ప్రతియేటా కర్నూలు నగరం ముప్పు పొంచి ఉంది. 2007, 2009లో వచ్చిన వరదల పీడకలలను నేటికీ నగరవాసులు మరువలేరు. ముఖ్యంగా తుంగభద్ర, హంద్రీ నదులకు భద్రత రక్షణ గోడలను నిర్మించాలన్నది ప్రతిపాదన. అయితే గత పదేళ్లలో ఇది కార్యరూపం దాల్చలేదు. 2007లో రక్షణ గోడల నిర్మాణం కోసం అప్పట్లో ప్రతిపాదనలు పంపితే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రూ.240 కోట్లను మంజూరు చేసింది. అయితే ఆ నిధుల వినియోగంలో జాప్యం కావడంతో వెనక్కు వెళ్ళాయి. సమస్య మాత్రం అలాగే మిగిలి ఉంది.

భూగర్భ మురికి నీటి వ్యవస్థ

నగరంలో మరో ప్రధాన సమస్య మురికి నీటి పారుదల వ్యవస్థ. ప్రస్తుతం నగరంలోని కాలువ ద్వారా మురికి నీటిని తుంగభద్ర, హంద్రీ నది లో కలుపుతున్నారు. ఇదే నీటిని శుద్ధి చేసి నగర ప్రజలకు తాగేందుకు సరఫరా చేస్తున్నారు. ఓపెన్ డ్రైన్ వల్ల వర్షాకాలంలో మురికినీరు రోడ్లపైకి వచ్చి వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇక నగర శివారులో అయితే చాలాచోట్ల నేటికి మురుగునీటి వ్యవస్థ లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఈ క్రమంలో మురికి నీటిని మళ్లించేందుకు భూగర్భ నీటి పారుదల వ్యవస్థను తెరపైకి తెచ్చారు. కానీ కార్యరూపంలో రాలేదు.

పారిశుద్ద్యం అధ్వానం

నగరంలో పారిశుద్ధ్య పరిస్థితి దారుణంగా ఉంది. రోజుకు సగటున 250 మెట్రిక్ టన్నుల చెత్త చేరుతుంది. అన్ని వార్డులలో మున్సిపల్ సిబ్బంది పనులు చేపట్టే పరిస్థితి లేదు. కేవలం కొన్ని ప్రధాన కేంద్రాల్లో మాత్రమే శుభ్రం చేస్తారు. ఇందుకు కారణం సిబ్బంది కొరతనే. ప్రస్తుతం నగరంలో 650 మంది శాశ్వత సిబ్బంది పనిచేస్తుండగా, 500 మంది కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు. పారిశుద్ధ్య సమస్య సక్రమంగా పరిష్కరించాలంటే 1000 మంది అదనపు కార్మికులు అవసరం.

నగరంలో రోడ్ల విస్తరణ

ప్రస్తుతం నగరంలో రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నగర జనాభా రెండు లక్షలు ఉన్న సమయంలో రోడ్లు వేశారు. ప్రస్తుతం 5.5 లక్షలకు చేరుకుంది. అప్పట్లో వేసిన రోడ్లే నీటికి ఉండటం వల్ల పాదాలకు నెలవుగా మారాయి. నగరంలో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు సరైన ప్రణాళిక లేవు. రోడ్ల విస్తరణకు ఎప్పుడో ప్రణాళికలు చేసిన ఆచరణలోకి రాలేదు. ప్రస్తుత లెక్కల ప్రకారం నగరంలో 25 వేల ఆటోలతో పాటు 2.5 లక్షల వాహనాలు నగర వీధుల్లో ఇరుకైన రహదారుల్లో క్రమం తప్పకుండా తిరుగుతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సిటీ బస్సు సర్వీసులను ఆర్టీసీ ప్రవేశపెట్టేలా చూడాల్సిన బాధ్యత లేకపోలేదు. అలాగే నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఆనంద్ థియేటర్ సమీపంలో 80 శాతం పూర్తయిన బ్రిడ్జి నిర్మాణం, జొహరాపురం లో 50శాతం పూర్తయిన వంతెన నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది.

గృహ నిర్మాణ కలను నెరవేర్చాలి

కర్నూలు నగరంలో ప్రధాన సమస్య పేద ప్రజలకు గృహ నిర్మాణం. గతంలో పేదలకు లక్ష్మీపురం సమీపంలో జి ప్లస్ త్రీ ఇల్లు నిర్మాణం చేపట్టారు. కానీ ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. అలాగే గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని ఎలా నగరవాసులకు చేత ఇవ్వాల్సి ఉంది. వీటితో పాటు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ఇసుక కొరతను తీర్చాలి ఉంది. తుంగభద్ర నది సమీపంలో ఉన్న ట్రాక్టర్కు 7000, టిప్పర్ కు 40,000 వెచ్చించి ఇసుకను కొనుగోలు చేయాల్సి వస్తుంది. నగర మేయర్ గా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఉంటుంది. వీటితో పాటు కల్లూరు పరిధిలోని కాలనీలను నంద్యాల జిల్లాలో చేర్చకుండా పరిష్కరించాల్సి ఉంది.

మహానగరంగా కర్నూలు అభివృద్ధి చేస్తా… బి వై. రామయ్య

జగనన్న స్ఫూర్తితో కర్నూలును మహానగరంగా తీర్చిదిద్దుతామని కాబోయే మేయర్‌ బివై.రామయ్య తెలిపారు. కీర్తిశేషులు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆశీస్సులు, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పడ్డ కష్టం, ఈ ఎన్నికల్లో ఫలితాల రూపంలో ప్రతిబింబించిందని తెలిపారు. వాలంటీర్‌ వ్యవస్థ మొదలుకొని, 4 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో ఇచ్చిన చరిత్ర జగన్మోహన్‌రెెడ్డిదని పేర్కొన్నారు.

పింఛను, రేషన్‌, అమ్మ ఒడి, ఆసరా, చేయూత ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక క్లిక్‌ చేయగానే అందుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలు విశ్వాసం ఉంచి, కర్నూలు కార్పొరేషన్‌లో వైసిపికి అత్యధిక సీట్లు గెలిపించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో కర్నూలు కార్పొరేషన్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల సహకారంతో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.
నగరంలో తాగునీటి సమస్యను తీర్చేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సమ్మర్‌ స్టోరేజీ కోసం డిపిఆర్‌ను ఇంజినీర్లు రూపొందించారన్నారు. వెంకట రమణకాలనీ దారి వద్ద హైవే అండర్‌ బ్రిడ్జి నిర్మాణంపై ఎంపీ ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇందిరమ్మ పెండింగ్‌ గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేసేందుకు ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. నగరంలో అధిక భాగం రాతినేలలు ఉండడం వల్ల అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం కొంత సమస్యగా మారనుందని అయినప్పటికీ వీటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement