Wednesday, May 1, 2024

మార్చి 9నుంచి పొగాకు కొనుగోళ్ళు ప్రారంభం.. ఏర్పాట్లలో బోర్డు అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ ; ప్రస్తుత సీజన్‌ పొగాకు కొనుగోళ్లను ప్రారంభించేందుకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణాదిలోని రెండు రీజియన్ల పరిధిలో మొత్తం 11వేలం కేంద్రాలు ఉండగా తొలి దశలో ఈనెల 24నుంచి వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆరోజున ఎస్‌బీఎస్‌ రీజియన్‌లోని వెల్లంపల్లి, ఒంగోలు-1, కొండపి కేంద్రాలతో పాటు ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లోని పొదిలిలో కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. రెండో దశలో మార్చి 9న రెండు రీజియన్ల పరిధిలో ఉన్న ఒంగోలు-2, టంగుటూరు, కనిగిరి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు-1, కందుకూరు-2, కలిగిరి, డీసీ పల్లి కేంద్రాల్లో చేపట్టనున్నారు. గత ఏడాది మార్చి 24న వేలం ప్రారంభించగా ఈఏడాది దాదాపు 20 రోజులు ముందుగానే ఈనెల 24 నుంచి చేపడుతున్నారు. గత ఏడాది కన్నా ఈసారి పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగింది. మాండస్‌ తుఫాన్‌తో మరోసారి సాగు చేయాల్సి వచ్చి ఖర్చులు పెరగడమే కాక అధిక శాతం మంది రైతులు నగదుకు ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో కొంత సమయం ముందుగానే కొనుగోళ్లు ప్రారంభిస్తున్నారు.

ఇప్పటికే నెల రోజులుగా వేలం కేంద్రాలతో సంబంధం లేకుండా రైతుల నుంచి వ్యాపారులు పొగాకు కొనుగోళ్లు చేస్తుండం కూడా ఒక కారణంగా సమాచారం. ఇదిలా ఉండగా గత ఏడాది దక్షిణాదిలో 47,512 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగు చేయగా 76.57 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి జరిగింది. బోర్డు అనుమతిచ్చినదాని కన్నా తక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ప్రస్తుత సీజన్‌కు సుమారు 57,747 హెక్టార్లలో సాగుకు, అలాగే 86.82 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. అయితే సుమారు 62వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగు కాగా దాదాపు 99 మిలియన్‌ కిలోల ఉత్పత్తి అయినట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు కర్ణాటక మార్కెట్‌ కూడా మూడొంతులు ముగిసింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్ల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్న బోర్డు తొలుత వేలం ప్రారంభించనుంది. దక్షిణాదిలోని రెండు రీజియన్‌లలోని 11 కేంద్రాల్లో రెండు విడతలుగా వేలం ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement