Wednesday, May 15, 2024

Pulichintala – చింత తీర‌బోతుంది….కొత్త క్ర‌స్ట్ గేట్లతో జలకళ

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: కృష్ణా బేసిన్‌లో కీలకమైన పులిచింతల ప్రాజెక్టు చింత తీరబోతుంది. గత వరదల్లో ప్రాజెక్టు క్రస్ట్‌ గేటు కొట్టుకు పోయింది. దీంతో అప్పటి నుంచి స్టాప్‌లాగ్‌ గేటుతోనే నెట్టుకురావాల్సి వస్తుంది. గత వరదల సమయంలోనూ తాత్కాలిక గేటుతోనే సరిపెట్టుకోవా ల్సి వచ్చింది. ప్రస్తుతం కొత్తి క్రస్ట్‌ గేట్‌ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. మరో నెల రోజుల్లోపు గేటు ఏర్పాటు పనులు పూర్తి కానున్నాయి. దీంతో ప్రస్తుత సీజన్‌లో పులిచింతలకు ఎంత వరద వచ్చినా దిగువకు నీటిని విడుదల చేసేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. 2021 ఆగస్టులో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదలతో పులిచింతల ప్రాజెక్టు 16వ క్రస్ట్‌ గేటు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ సీజన్‌లో జలాలు కూడా కొంతమేర వృధాగా దిగువకు తరలిపోయాయి. అయితే ఇరిగేషన్‌ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక గేటును ఏర్పాటు చేశారు. అయితే జలాశయానికి భారీగా వరదనీరు వచ్చిన సందర్భంలో ప్రాజెక్టుకు వరద ఒత్తిడి లేకుండా ఉండేందుకు ముందుచూపుతో క్రస్ట్‌ గేటు అన్నింటిని ఎత్తివేసి దిగువకు విడుదల చేస్తుంటారు. అయితే 2022లో వరదలు వచ్చినప్పటికీ తాత్కాలిక గేటు మినహా మిగిలిన గేటు ద్వారానే నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ గేట్లు ఎత్తివేసిన ప్రతిసారి ఆ వరద నీరు అంతా పులిచింతల మీదుగా ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతుంది. సుమారు 45.77 టీఎంసీల సామర్థ్యం కలిగిన పులిచింతలకు అంతకుమించి ఎక్కువ నీరు వస్తే దిగువకు విడుదల చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో వరద ప్రవాహం అంచనాలకు మించి వచ్చి చేరుతుంటుంది. అటువంటి ప్రమాద పరిస్థితుల్లో క్రస్ట్‌ గేట్లు అన్ని ఎత్తివేసి వరదను దిగువకు విడుదల చేయాలి. ఈ ప్రక్రియలో ఏమాత్రం జాప్యం జరిగినా ప్రాజెక్టుకే ముప్పు ఉంటుంది. అందుకే జలవనరుల శాఖ నిపుణులు ఎప్పటికప్పుడు క్రస్ట్‌ గేట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. పులిచింతం గేటు విషయంలో కూడా శరవేగంగా ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించి అంచనాలకు కూడా రూపొందించారు

2021లో వరదల్లో కొట్టుకుపోయిన గేటు
2021 ఆగస్టు 5వ తేది పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చింది. శ్రీ శైలం , నాగార్జునసాగర్‌కు ఆ సమయంలో అంచనాలకు మించి వరద నీరు రావడంతో రెండు జలాశయాలకు సంబంధించిన క్రస్ట్‌ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు ( పులిచింతలకు) విడుదల చేశారు. దీంతో అదేరోజు రాత్రి కృష్ణా డెల్టాకు బ్యాలెన్సింగ్‌ జలాశయంగా ఉన్న పులిచింతల 16వ క్రస్ట్‌ గేటు కొట్టుకుపోయింది. వరద ఉధృతికి క్రస్ట్‌ గేట్‌ దిగువకు సుమారు కిలోమీటర్‌ మేర వెళ్లి పడిందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో వచ్చిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో కొత్తి గేటు ఏర్పాటు చేసేందుకు నిపుణుల కమిటీ రంగంలోకి దిగింది. ముందు తాత్కాలిక గేటును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుని ఆ దిశగా స్టాప్‌లాగ్‌ గేటును ఆ సమయంలోనే ఏర్పాటు చేశారు. కొత్త గేటు ఏర్పాటుకు 18.84 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనాలు వేసి ఆ దిశగా ఆమోదం కూడా తెలిపారు. రేడియల్‌ గేటు తయారుచేయడానికి 7.54 కోట్లు , పీయర్ల సామర్థ్యం పెంచేందుకు ఇతర పనుల కోసం 1.73 కోట్లు , గేటు ఆపరేషన్‌ , క్రేన్‌, గేట్లు మరమ్మతులు, ఇతర ఖర్చుల కోసం 9.57 కోట్లు అవసరమవుతాయని జలవనరుల శాఖ ఆ సమయంలోనే అంచనాలు వేసి ఆ దిశగా ప్రతిపాదనలను సిద్ధం చేసింది. పరిపాలనాపరమైన ఆమోదం లభించడంలో కొంత జాప్యం జరగడం, తదితర కారణాలు వెరసి క్రస్ట్‌ గేట్‌ పనులు చేపట్టడంలో కొంత ఆలస్యం చోటు చేసుకుంది.

90 శాతంకు పైగా కొత్త గేటు పనులు పూర్తి
పులిచింతలలో క్రస్ట్‌ గేట్‌ ఏర్పాటు పనులు 90శాతంకు పైగా పూర్తయ్యాయి. మరో 20 నుంచి 30 రోజుల్లోపు మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆ దిశగా వర్షాకాలం లోపు క్రస్ట్‌ గేట్‌ ఏర్పాటు పనులు పూర్తి చేసి వరదలు వచ్చే సమయానికి గేటు అందుబాటులో ఉండేలా పనులను అత్యంత వేగవంతంగా పూర్తి చేయిస్తున్నారు. వరదలు వచ్చిన సందర్భంలో ఒక్కో క్రస్ట్‌ గేట్‌ ద్వారా భారీగా వరద నీరు దిగువకు విడుదల అవుతుంటుంది. 24 క్రస్ట్‌ గేట్‌ల ద్వారా వందలాది టీఎంసీలను ఒక్క సీజన్‌లోనే ప్రకాశం బ్యారేజీకి తరలివెళ్తుంటాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన క్రస్ట్‌ గేట్‌ రెండు సీజన్‌లలో అందుబాటులో లేకపోవడంతో ప్రాజెక్టుపై కొంత ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. అయితే జలవనరుల శాఖ అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని గత అనుభవాలను ఉపయోగించి జలాశయంపై ఎక్కడా ఒత్తిడి తగలకుండా వచ్చిన వరదను మిగిలిన క్రస్ట్‌ గేట్ల ద్వారానే దిగువకు పంపుతూ వచ్చారు. ప్రస్తుతం క్రస్ట్‌ గేట్‌ పనులు పూర్తి కాబోతుండడంతో ఆ చింత కూడా తీరబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement