Tuesday, April 23, 2024

దస్తగిరికి తగిన భద్రత కల్పించండి.. డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ

అమరావతి, ఆంధ్రప్రభ : వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి, కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై స్థానిక పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం మానుకుని తగిన భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ రాజేంద్రనాధ్‌ రెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం డీజీపీకి ఆయన ఒక లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని ఈ కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడంతో ఆయనకు ప్రాణహాని ఉందని తెలిపారు. అయితే అధికార పార్టీ నేతల ఆదేశాలతో స్థానిక పోలీసులు దస్తగిరిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చివరికి సీబీఐ అధికారుల బృందాన్ని కూడా విడిచిపెట్టడం లేదని వర్ల రామయ్య పేర్కొన్నారు.

దర్యాప్తు అధికారిపై సైతం తప్పుడు కేసులు పెట్టారని, ఇంకోవైపు సీబీఐ బృందంపై బాంబులు విసురుతామని బెదిరింపులు వచ్చాయన్నారు. వివేకా హత్య కేసులో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండటంతో వారి ఆదేశాలకు అనుగుణంగా పోలీసుల వ్యవహార శైలి ఉందన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుందని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని దస్తగిరి, సీబీఐ అధికారులకు భద్రత కల్పించడం ముఖ్యమైన అంశమని అన్నారు. దస్తగిరి, సీబీఐ అధికారులు ఏ హామీ జరిగినా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో పోలీసులు రాజ్యాంగం, చట్టబద్ధంగా నడుచుకోవాలని వర్లా రామయ్య హితవు పలికారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement