Wednesday, May 1, 2024

తాగునీటి సమస్య రాకుండే ముందస్తు ప్రణాళిక.. వర్షాభావ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు..

రానున్న వేసవికాలంతో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా సమృద్ధిగా నీటివనరులను నిల్వ చేసేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్‌) ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాలోని కొన్ని వర్షాభావ ప్రాంతాల్లో అవసరాల మేరకు తాగునీటి వనరులు ఉండేలా ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. గత ఏడాది చివరి త్రైమాసికంలో కురిసిన భారీ వర్షాలు, ఉప్పొంగిన వరదల కారణంగా భూగర్భ జలాలు అందుబాటులోకి రావటం, రబీ సీజన్‌ పూర్తవుతున్న దశలోనూ చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తుండటంతో వేసవి కాలంలో నీటి ఎద్దడి తీవ్రత ఉండవకపోచ్చని అంచనా. ఈ మేరకు నీటి ఎద్దడి తలెత్తే గ్రామాల వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి అక్కడ తాగునీటి నిల్వలను ఇప్పటినుంచే పెంపుదల చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రబీ సీజన్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేయటంతో పాటు నీటి వనరులు అధికంగా అవసరమైన వరిత రహా పంటల సాగును చివరిదశలో ప్రారంభించే పనికి పూనుకోవద్దని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాల్సిన అవసరం లేకుండా యుద్ధప్రాతిపదికన స్థానిక నీటివనరులను నిల్వ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రకాశం జిల్లా మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో జనవరి వర్షపాతం సాధారణ స్థాయికి మించి నమోదుకావటం వల్ల భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి.. సాధారణ స్థాయికి మించి రాష్ట్రవ్యాప్తంగా 15 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే రాయలసీమ జిల్లాల్లో 39 శాతం అధికంగా వర్షపాతం నమోదయింది. ప్రత్యేకించి తాగునీటి సమస్యను ప్రతి ఏటా తీవ్రంగా ఎదుర్కొనే కొన్ని గ్రామాల్లో 55 నుంచి 60 శాతానికి పైగా అధికంగా వర్షపాతం నమోదయింది. దీంతో అనేక ప్రాంతాల్లో రిజర్వాయర్లపై ఆధారపడకుండానే రబీ పంటలు సాగవుతూ ఉండటం వల్ల నీటి నిల్వలు పెరుగుతున్నాయి.

నిండుకుండల్లా రిజర్వాయర్లు..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజర్వాయర్లతో పాటు కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో కలిపి 1360.24 టీ-ఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నదీ బేసిన్లతో సంబంధం లేకుండా కేవలం రిజర్వాయర్లలో 634.73 టీ-ఎంసీల నీటి నిల్వలున్నాయి. ప్రత్యేకించి తాగునీటి వనరుల కోసం విని యాగించే మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల్లో 146.53 టీఎంసీల నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల చెరువులు, ఇతర రిజర్వాయర్లలో 65 నుంచి 70 శాతం నీటి నిల్వలున్నాయి. ఇవి కాకుండా 165.27 టీఎంసీల భూగర్భజలాలు వినియోగించుకునేందుకు వీలుగా అందుబాటులోకి వచ్చినట్టు అంచనా. ఈ నేపథ్యంలో వచ్చే నెల మార్చి రెండవ వారంలో క్షేత్రస్థాయి నుంచి సమచారం తెప్పించుకుని మరోసారి అంచనాలు రూపొందించటం ద్వారా తాగునీటి ఎద్దడి లేకుండా అమలు చేయాల్సిన యాక్షన్‌ ప్లాన్‌కు తుది రూపు ఇవ్వనున్నట్టు అధికారులు వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement