Saturday, April 27, 2024

TS – కుటుంబాలు, కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ అభివృద్ధి – పవన్ కల్యాణ్

భీమవరం – ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని జగన్ అనుకుంటే, తిరిగి ఆయన ఇంట్లోనే అది జరిగిందన్నారు పవన్ కల్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజవర్గ జనసేన నాయకులతో ఆయన నేడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

సొంత చెల్లికి ఆస్తి ఇవ్వని వ్యక్తి, మనకెలా ఇస్తాడు? అని పవన్ నిలదీశారు. జగన్.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని.. సమాజంలో సుస్థిరత కోల్పోయేలా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు వల్ల ఓ కులంపై చెడు ముద్ర వేశారని వాపోయారు.భీమవరం వైసీపీ ఎమ్మెల్యేతో నాకు శత్రుత్వం ఏమీ లేదన్నారు పవన్ కల్యాణ్. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ప్రతిపాదన రాష్ట్ర బాగు కోసమే అని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. జాతీయ నాయకుల వద్ద ఎన్నో చీవాట్లు తిని పొత్తు కోసం పోరాడానని పవన్ తెలిపారు. కొన్ని ఇబ్బందులు, త్యాగాలు తప్పవన్న పవన్.. త్యాగం చేసిన వారికి గుర్తింపు పక్కా అని హామీ ఇచ్చారు.

”గత ఎన్నికల్లో భీమవరం నుండి పోటీ చేయమని నాతో చెప్పిన సన్నిహితులు ఇప్పుడు ఇక్కడ లేరు. ఎన్నికల్లో భారీ బెట్టింగ్ లు జరుగుతున్నాయంటే జనసేన పోటీలో ఉండడమే కారణం. జగన్ సిద్ధం అంటే మేము యుద్ధం అంటాము. వైజాగ్ లో, ఏపీ బోర్డర్ లో నన్ను ఆపాలని చూస్తే నా సత్తా చూపిస్తా” అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు..

2009, 2014, 2019 ఎన్నికల పరిస్థితులు గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ”ఓట్లు కొనాలా లేదా అనేది నేను ఎవరికీ చెప్పను. ఓట్లు కొనే పరిస్థితి లేకపోవడమే సంతోషకరం. పదేళ్ల తర్వాత అయినా సరే డబ్బుతో ఓట్లు కొనని రాజకీయం రావాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం” అని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పార్టీ పీఏసీ సభ్యులు .కనకరాజు సూరి పాల్గొన్నారు

- Advertisement -

జనసేన లో చేరిన పలువురు నేతలు

ఉండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ డీసీసీబీ ఛైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు(రత్నం), ఆయన భార్య ఉమాదేవిలు పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాకినాడకు చెందిన మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పార్టీలో చేరారు.. జనసేన పార్టీ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బలంగా పని చేయాలని సూచించారు..

టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామంకి పలకరింపు


జనసేన పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో భీమవరానికి చెందిన క్షత్రియ ప్రముఖులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు గోకరాజు రామం గారి ఇంటికి మర్యాదపూర్వక భేటీ నిమిత్తం వెళ్లారు. రామం , ఆయన కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. భీమవరం పర్యటనలో ఒకే రోజు నలుగురు కీలక నేతలతో పవన్ సమావేశం కావడం గమనార్హం

Advertisement

తాజా వార్తలు

Advertisement