Monday, May 6, 2024

Delhi | సుప్రీంలో బాబు పిటిషన్‌పై ముగిసిన వాదనలు..తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. చంద్రబాబు వయస్సు రీత్యా ఇదే కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్న చంద్రబాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఏపీ సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు ప్రారంభించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబు నాయుడుకు వర్తించదన్న తన వాదనకు బలం చేకూర్చే కొన్ని పాత తీర్పులను ఉదహరించారు. 2015-16లో ఈ కుంభకోణం జరిగిందని, అప్పటికి సెక్షన్ 17(ఏ) ఉనికిలోనే లేదని తెలిపారు.

పైగా 2018 జూన్‌లోనే ఈ కేసు విచారణ మొదలైందని, జీఎస్టీ ఇంటెలిజెన్స్‌తో పాటు ఈడీ, ఇన్‌కం ట్యాక్స్, సెబీ వంటి దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసులో భాగమయ్యాయని, అలాంటప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యగా ఎలా పేర్కొంటారని ప్రశ్నించారు. సెక్షన్ 17(ఏ) నిజాయితీపరులకు రక్షణ కల్పించాలి తప్ప అవినీతి పరులకు కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడుపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లతో పాటు భారత శిక్షా స్మృతి (ఐపీసీ)లోని పలు సెక్షన్ల ప్రకారం కేసు నమోదైందని, ఒకవేళ సెక్షన్ 17(ఏ) ప్రకారం ముందస్తున అనుమతి లేదన్న కారణంతో అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన సెక్షన్లను తొలగించినప్పటికీ ఐపీసీ సెక్షన్లు కొనసాగుతాయని వాదించారు.

- Advertisement -

ఈ సమయంలో ఏసీబీ స్పెషల్ కోర్టులో ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఎలా విచారణ జరుపుతారని ధర్మాసనం ప్రశ్నించగా.. కేవలం ఐపీసీ సెక్షన్లే ఉంటే ప్రత్యేక కోర్టు అవసరం ఉండదని, కానీ అవినీతి నిరోధక చట్టంతో పాటుగా ఇతర చట్టాల సెక్షన్లు ఉన్నందున స్పెషల్ కోర్టుకు విచారణ జరిపే పరిధి ఉంటుందని వెల్లడించారు. రోహత్గి వాదనలు ముగించిన తర్వాత చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిజాయిండర్ వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడు విషయంలో సెక్షన్ 17(ఏ) వర్తిస్తుందని వాదించారు. చివరగా చంద్రబాబు నాయుడు 73 ఏళ్ల వయస్సులో 40 రోజులకు పైగా జైల్లో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సాల్వే ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

ఈ దశలో జోక్యం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు, బెయిల్‌ను వ్యతిరేకిస్తూ స్కిల్ స్కాం కేసులో బెయిల్ పిటిషన్ ట్రయల్ కోర్టులో పెండింగులో ఉందని గుర్తుచేశారు. వెంటనే చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూత్రా జోక్యం చేసుకుంటూ ఆ బెయిల్ పిటిషన్‌లో సెక్షన్ 17(ఏ) ప్రస్తావించలేదని, ఎందుకంటే అది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాము కేవలం మెరిట్స్ ఆధారంగా బెయిల్ కోరామని తెలిపారు. సెక్షన్ 17(ఏ) ప్రకారం రిమాండ్ చేయడం తప్పని తేలితే, ఆ ప్రకారం విడుదల చేయాల్సి ఉంటుందని అన్నారు. చివరగా వాదనలు ముగిసాయని, తీర్పును రిజర్వు చేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. మధ్యంతర బెయిల్‌ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement