Monday, July 22, 2024

NDA Governament – ఆ మూడూ.. గ్యారెంటీ! ఇక‌పై చంద్ర‌బాబు మార్క్‌

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: ఏపీలో నాలుగోసారి ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం బుధవారం గన్నవరంలో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఏపీ రాజకీయాల్లోనే ఈ ప్రమాణ స్వీకారం చరిత్ర సృష్టించనుంది. ఎందుకంటే… ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మూడు కీలక హామీలను ఇచ్చారు. ఈ హామీలకే జనం ఆకర్షితులయ్యారు. ఘన విజయం అందించారు. రూ.2.70 కోట్ల నవరత్నాలను తృణపాయంగా గులకరాళ్లుగా భావించారు. కానీ, ఇంతకంటే గొప్ప ప్రయోజనానికే తలవంచారు. ఇందులో ఎలాంటి డౌటనుమానం అక్కరలేదని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వరాల మూటలో కీలక పైళ్లపైనే అందరి దృష్టి మళ్లింది. ఇంతకీ చంద్రబాబు ఆ మూడు హామీలను నిలబెట్టుకుంటారా? అంటే.. ఔను ఆయన సంతకాలు చేయటం ఖాయమని టీడీపీ నేత‌లు గ‌ర్వంగా చెబుతున్నారు.

మెగా డీఎస్సీ ఫైల్ పైనే తొలి సంతకం

ఇలా సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే .. టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత మూడు కీలక అంశాలపై తన తొలి సంతకాలు చేయబోతున్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పైనే తొలి సంతకం. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావిడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు హడావిడిగా టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించాలని ప్రయత్నించింది. కానీ నిరుద్యోగులు తమకు తగినంత సమయం ఇవ్వకుండా హడావిడిగా నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్ పడింది. 36 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే.. కేవలం 6 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంఖ్య కూడా తక్కువగా ఉండటంతో చంద్రబాబు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ హామీ ఇచ్చారు.

- Advertisement -

భూహక్కు చట్టం రద్దు పై.. రెండో సంతకం

చంద్రబాబు పెట్టబోయే రెండో సంతకం భూహక్కు చట్టం రద్దు. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై జరిగినంత రచ్చ మరో అంశంపై లేదు. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లతో పాటు అర్బన్ ఓటర్లు కూడా ప్రభుత్వం ఈ భూహక్కు చట్టం ద్వారా తమ భూముల్ని లాక్కుంటుందని భయపడ్డారు. దీంతో చంద్రబాబు వారికి తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. తన రెండో సంతకం దీనిపైనే ఉంటుందన్నారు. ఇప్పుడు అన్నట్లుగానే భూహక్కు చట్టం రద్దు చేయనున్నారు.

4000 పెన్షన్ ఫైల్ రెడీ

ఇక మూడో సంతకం పెన్షన్ల పెంపుపై ఉండబోతోంది. జగన్ సర్కార్ హయాంలో పెన్షన్లను ఐదేళ్లలో 2 వేల నుంచి 3 వేలకు పెంచారు. అప్పట్లో చంద్రబాబు అధికారమిస్తే వెంటనే 3 వేల పెన్షన్ ఇస్తానన్నా జనం నమ్మలేదు. కానీ జగన్ అదే మూడు వేలు ఇస్తారని భావిస్తే దానికి ఐదేళ్లు తీసుకున్నారు. దీంతో పెన్షనర్లకు ఊరటగా తాము ఈసారి అధికారంలోకి రాగానే 4 వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అంతే కాదు పెరిగిన పెన్షన్ ను ఏప్రిల్ నుంచే అందిస్తామన్నారు. ఈ లెక్కన ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయి మూడువేలు, జూలైలో నాలుగు వేలతో కలిపి మొత్తం 7 వేలు ఇచ్చే విధంగా మూడో సంతకం పెట్టబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement