Wednesday, February 28, 2024

పోసాని కృష్ణ‌ముర‌ళిపై నారా లోకేష్ న్యాయ‌పోరాటం

మంగళగిరి,ఆగస్ట్ 17 ప్రభ న్యూస్- – న‌టుడు, ద‌ర్శ‌కుడు, ఏపీ ఫిల్మ్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పోసాని కృష్ణముర‌ళి త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌పై నారా లోకేష్ న్యాయ‌పోరాటం ఆరంభించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా త‌నకి అవినీతి బుర‌ద అంటించాల‌ని చూసిన సింగ‌లూరు శాంతి ప్ర‌సాద్‌పైనా కోర్టులో కేసు దాఖ‌లు చేశారు. ఈ రెండు కేసుల్లో వాంగ్మూలం న‌మోదు కోసం శుక్ర‌వారం మంగ‌ళ‌గిరి మేజిస్ట్రేట్ కోర్టుకి టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ హాజ‌రు కానుండ‌డంతో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కి ఒక రోజు విరామం ప్ర‌క‌టించారు.


గ్రేట్ ఆంధ్ర యూట్యూబ్ చాన‌ల్‌కి పోసాని కృష్ణ‌ముర‌ళి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కంతేరులో నారా లోకేష్ 14 ఎక‌రాలు భూములు కొనుగోలు చేశార‌ని ఆరోపించారు. కంతేరులో అర‌సెంటు భూమి కూడా లేని త‌న‌పై ఈ త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన పోసాని క్ష‌మాప‌ణ చెప్పాల‌ని నారా లోకేష్ త‌న లాయ‌ర్ ద్వారా నోటీసులు పంపారు. రెండు సార్లు పంపిన నోటీసులు అందినా, పోసాని కృష్ణ‌ముర‌ళి ఎటువంటి స‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డంతో త‌న ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌కి భంగం కలిగించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్టుని ఆశ్ర‌యించారు లోకేష్‌.


చుండూరు సాయి ప్రైమ్ 9 యూట్యూబ్ చాన‌ల్లో నిర్వ‌హించిన ఒక చ‌ర్చా కార్య‌క్ర‌మంలోనూ సింగ‌లూరు శాంతి ప్ర‌సాద్ అనే వ్య‌క్తి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన లోకేష్‌ ఉద్యోగుల జీతాల‌ నుంచి వ‌సూలు చేయిస్తున్నార‌ని త‌న ఫ్రెండ్ చెప్పార‌ని నిరాధార ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపైనా లాయ‌ర్ ద్వారా నోటీసులు పంపారు. ఎటువంటి వివ‌ర‌ణా, క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోవ‌డంతో శాంతి ప్ర‌సాద్‌పైనా కోర్టుని ఆశ్ర‌యించారు.


ఈ రెండు కేసుల్లోనూ ఫిర్యాదుదారుడైన టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వాంగ్మూలం మంగ‌ళ‌గిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్ర‌వారం న‌మోదు చేయ‌నున్నారు. కోర్టుకి హాజ‌రవుతున్న దృష్ట్యా పాద‌యాత్ర‌కి ఒక్క రోజు విరామం ప్ర‌క‌టించారు.
గుడ్డ కాల్చి మీద వేస్తానంటే ఊరుకునేది లేద‌ని, త‌న‌పై బుర‌ద చ‌ల్లేసి పోతానంటే వ‌దిలేది లేద‌ని నారా లోకేష్ గ‌తంలోనే హెచ్చ‌రించారు. ఏ త‌ప్పూ చేయ‌ని త‌న‌పై ఆధారాలు లేకుండానే అవాస్త‌వ‌ ఆరోప‌ణ‌లు చేసి దాక్కుంటున్నార‌ని, అటువంటి వారంద‌రినీ న్యాయస్థానం ముందు నిల‌బెడ‌తాన‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్టే…తప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ అంద‌రిపైనా సివిల్-క్రిమిన‌ల్ కేసుల‌ను దాఖ‌లు చేశారు.

విధి పగబడితే లోకేషన్న దారిచూపాడు

యువనేత రాకతో రెహానా సంతోషంఆమె పేరు షేక్ రెహానా, తాడేపల్లిలో నివాసముంటోంది. విధి ఆడిన వింతనాటకంలో ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. చంటిబిడ్డతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో స్థానిక నాయకుల ద్వారా తమ కష్టాలను యువనేత లోకేష్ కు విన్నవించుకుంది. పాదయాత్రకు బయలుదేరే నెలముందు ఆమెకు టిఫిన్ బండి సమకూర్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ ఆకస్మికంగా రెహానా టిఫిన్ బండి వద్దకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మీ దయతో ప్రస్తుతం నెలకు 30వేలు సంపాదిస్తూ, కుటుంబాన్ని పోషిస్తున్నానని ఆనందంగా చెబుతూ యువనేతకు అల్పాహారాన్ని అందజేసింది. గతంలో 300 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 800 అయిందని చెప్పింది. తాను నివసించే ఇంటికి పట్టాలేదని తెలిపింది. టిడిపి అధికారంలోకి రాగానే ఇంటిపట్టాతోపాటు ఇల్లు కూడా నిర్మించి ఇస్తామని చెప్పి యువనేత ముందుకు సాగారు.

టీడీపీలోకి కొనసాగుతున్న చేరికల పర్వం

యర్రబాలెం(తాడేపల్లి) : మంగళగిరిలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలంతా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా…గురువారం డాన్ బాస్కో స్కూల్ వద్ద విడిది కేంద్రంలో పలువురు వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నిడమర్రు గ్రామానికి చెందిన పాములపాటి వీరశివారెడ్డి, తాడేపల్లికి చెందిన సూరెడ్డి వెంకటరెడ్డి, కె.నాగేశ్వరావు టీడీపీ కండువా కప్పుకున్నారు. నవులూరుకు చెందిన ఏపూరి సురేష్ నాయుడు, పంచల సువార్త, వేమూరు ప్రణయ్, యర్రబాలెం గ్రామానికి చెందిన దూళ్ల శేషు గోపయ్య వీరితో పాటు మంగళగిరి పట్టణానికి చెందిన 13వార్డు, తాడేపల్లిలోని 2, 5, 7, 23వ వార్డులు, నవులూరు, కృష్ణాయపాలెం,యర్రబాలెంకు చెందిన సుమారు 300పైగా కుటుంబాల వారు చేరారు. వీరందరికీ లోకేష్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement