Wednesday, May 1, 2024

కరోనాతో కోల్పోయిన విద్యా సంవత్సరం అధిగమించేలా చర్యలు – వైస్‌ ఛాన్సలర్లకు గవర్నర్‌ ఆదేశం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కరోనా పరిస్ధితులు కుదుట పడుతున్నందున బోధన, పరీక్షల నిర్వహణపై విశ్వవిద్యాలయాలు దృష్టిసారించాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. కరోనాతో కోల్పోయిన విద్యా సంవత్సరాన్ని భర్తీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. విజయవాడ రాజ్‌ భవన్‌ నుంచి రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్‌ ఛాన్సలర్లతో గవర్నర్‌ విడివిడిగా సమావేశమై ఆయా అంశాలపై దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ వీసీలతో మాట్లాడుతూ నిర్ణీత కాలవ్యవధిలో పెండింగ్‌ లేకుండా అన్ని విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్ధలు పూర్తి స్ధాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా వైస్‌ ఛాన్సలర్లతో తన ఛాంబర్‌ లో సమావేశం అయ్యారు. గవర్నర్‌ ఆలోచనలు, ఆకాంక్షలను గురించి ఈ భేటీ-లో మరింత విపులంగా చర్చించారు.

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో గవర్నర్‌ సూచనల మేరకు రద్దు చేసిన స్నాతకోత్సవాలను వేగంగా పూర్తి చేయాలని గవర్నర్‌ ఆదేశించినట్లు వీసీలకు సిసోడియా తెలిపారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు- చేసుకోవాలని, వచ్చే నెలలో వాటిని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్దం కావాలని స్పష్టం చేసారు. ఇతర విశ్వవిద్యాలయాలు సైతం సకాలంలో స్నాతకోత్సవాలు పూర్తి చేసుకోవాలన్నదే గవర్నర్‌ ఆకాంక్ష అని వివరించారు. ఈ సమావేశంలో కడప యోగి వేమన, గుంటూరు అచార్య ఎన్‌ జి రంగా, శ్రీకాకుళం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, కాకినాడ జెఎన్‌ టియు, అనంతపురం శ్రీ కృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్లు అచార్య సూర్య కళావతి, డాక్టర్‌ విష్ణు వర్ధన్‌ రెడ్డి, అచార్య వెంకట్రావు, అచార్య జివిఆర్‌ ప్రసాద రాజు, అచార్య రామకృష్ణా రెడ్డిలతో పాటు- శ్రీకాకుళం బిఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం పాలకవర్గ సభ్యుడు అచార్య రాజేష్‌, అయా విశ్వ విద్యాలయాల రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement