Sunday, October 6, 2024

AP | రాష్ట్రంలో పేట్రేగుతున్న మద్యం మాఫియా! ఇష్టారాజ్యంగా రేట్లు

అమరావతి, ఆంధ్రప్రభ:మద్యం మాఫియా పెట్రేగుతోంది. ప్రభుత్వ ఆదేశాలకు వక్ర భాష్యం చెపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. సిండికేట్ల ముసుగులో పెద్ద ఎత్తున మందుబాబుల జేబులకు చిల్లు పెడుతూ ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. మద్యం మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన ఆబ్కారీ శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని మినహా బార్లలో పెద్ద ఎత్తున ధరల దోపిడీ జరుగుతోంది. నోటికి వచ్చిన రేటు చెపుతూ వినియోగదారులను దోచుకుంటున్నారు.

ఒకే పట్టణంలో వేర్వేరు బార్లలో రేట్ల వ్యత్యాసం భారీగా ఉంటోంది. అదేమంటే మా సిండికేట్‌ ఇదే రేటుకు అమ్మమని చెప్పిందని..మరొక చోట మాకు ఇచ్చే ఇన్వాయిస్‌ తగ్గలేదని చెపుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బార్‌ పాలసీ అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 840 బార్లకు గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి మూడేళ్ల కాలానికి లైసెన్స్‌లు జారీ చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన వేలంలో పలువురు వ్యక్తులు సిండికేట్‌గా ఏర్పడి ఆయా ప్రాంతాల్లోని లైసెన్స్‌లను దక్కించుకున్నారు.

2025 ఆగస్టు 31 వరకు బార్లకు లైసెన్స్‌ కాల పరిమితిగా నిర్ణయించారు. నగర పంచాయితీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పోరేషన్లలో జనభా ప్రాతిపదికన లైసెన్స్‌ ఫీజులు నిర్ణయించారు. ప్రతి ఏటా లైసెన్స్‌ ఫీజు 10శాతం పెంచే ఒప్పందంపై కొత్త బార్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వరంగ సంస్థ ఏపీబీసీఎల్‌ మద్యం షాపులను నిర్వహిస్తోంది. ప్రైవేటు నిర్వహణలోని బార్ల నుంచి మాత్రం అడిషినల్‌ ఎక్సైజు రిటైల్‌ టాక్స్‌(ఏఈఆర్‌టీ) విధించింది. దీంతో షాపుల్లో దొరికే మద్యంపై బార్లలో అదనపు రుసుము వసూలు చేస్తున్నారు.

- Advertisement -

ఏఈఆర్‌టీ సవరణ..

గతంలో మద్యం బ్రాండ్లపై ఒక్కొక్క కేసు రేటు ఆధారంగా ఏఈఆర్‌టీని వసూలు చేసేవారు. ఏఈఆర్‌టీని రూపాయాల్లో వసూలు చేస్తుండటంతో అమ్మకంలో ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలోనే గత నెలలో ఏఈఆర్‌టీని శాతాల్లోకి మార్చింది. వ్యాట్‌ తదితర పన్నులను కూడా శాతాల్లోకి సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాండ్లతో నిమిత్తం లేకుండా మద్యం కేసులను పరిగణలోకి తీసుకొని ఏఈఆర్‌టీని శాతాల్లోకి సవరించడంతో కొన్ని బ్రాండ్ల మద్యం రేట్లు తగ్గగా..మరికొన్ని బ్రాండ్ల మద్యం రేట్లు స్వల్పంగా పెరిగాయి. మీడియం మద్యం బ్రాండ్లపై క్వార్టర్‌ నిబ్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గినట్లు అధికారులు చెపుతున్నారు. ఒక విధంగా ఏఈఆర్‌టీ సవరింపు మద్యం తాగేవారికి ఊరటగానే చెప్పొచ్చు.

వక్ర భాష్యం..

బార్లలో పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉండేది చీప్‌ లిక్కర్‌ తర్వాత మీడియం బ్రాండ్లే. మీడియం బ్రాండ్ల రేట్లు తగ్గినప్పటికీ బార్ల నిర్వహకులు వినియోగదారుల నుంచి వసూలు చేస్తూనే ఉన్నారు. కొన్ని బార్లలో మాత్రం స్వల్పంగా తగ్గించి అమ్మకాలు చేస్తున్నారు. మరికొన్ని బార్లు మాత్రం తగ్గిన రేట్లతో నిమిత్తం లేకుండా పాత రేట్లనే కొనసాగిస్తున్నారు. అదేమంటే ప్రభుత్వం ఇన్వాయిస్‌ రేటు తగ్గించ లేదని చెపుతున్నారు. స్టార్‌ హోటల్స్‌, అన్ని సౌకర్యాలు ఉండే బార్లలో రేట్లు అధికంగా ఉన్నాయంటే సరేలా అని సరిపుచ్చుకోవచ్చు.

ఏ మాత్రం సౌకర్యాలు లేని సాధారణ బార్లలో సైతం ఇష్టారాజ్యం వసూలు చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ లాంటి పట్టణంలో ఒక్కొక్క ప్రాంతంలో మద్యం రేట్లు ఒక్కొక్కలా ఉన్నాయి. అదేమంటే ప్రభుత్వం తగ్గించకుండానే మద్యం సరఫరా చేస్తున్నట్లు చెపుతున్నారు. ఒకే సిటీలో ఒకే రకమైన లైసెన్స్‌ రుసుము వసూలు చేసినప్పుడు..వేర్వేరు ఇన్వాయిస్‌లు ఎలా ఉంటాయని ఎవరైనా ప్రశ్నిస్తే..అది చెప్పాల్సింది ఎక్సైజు అధికారులు తప్ప మేం కాదంటున్నారు. మరికొందరు బార్ల నిర్వహకులు మాత్రం తెలివిగా సిండికేట్‌ నిర్ణయం అంటూ దాటవేస్తున్నారు.

తనిఖీలు ఎక్కడ..

ఇష్టారాజ్యంగా మద్యం రేట్లు వసూలు చేయకుండా పర్యవేక్షించాల్సిన క్షేత్రస్థాయి ఎక్సైజు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. మద్యం షాపులు ప్రభుత్వానివే కాబట్టి రేట్ల వ్యత్యాసం ఉండే అవకాశం లేదు. మరి బార్లు ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్నప్పడు తనిఖీ చేయకుండా ఎందుకు ఉంటున్నారనేది శేష ప్రశ్నగా మారింది. పైగా ఎవరైనా అడిగితే మేం కాదంటే..మేం కాదంటూ తప్పించుకుంటున్నట్లు పలు విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి అధికారుల వ్యవహారశైలితో ప్రభుత్వం రేట్లు తగ్గించినప్పటికీ వినియోగదారులకు చేరడం లేదు. దీంతో ఆదాయం పొందేది ప్రైవేటు వ్యక్తులు అయితే..అపనింద మాత్రం ప్రభుత్వం మోయాల్సి వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement