Friday, May 17, 2024

వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ జనసేనాది పవన్‌ కల్యాణ్‌..

అమరావతి, (ప్ర‌భ‌న్యూస్): ఎయిడెడ్‌ విద్యాసంస్థల విలీనానికి సంబంధించి తాజాగా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నాలుగు ఆప్షన్లపై జనసేనాది పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఆయన, అప్పుడు అమ్మఒడి ఇప్పుడు అమ్మకానికో బడి అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 2200 ప్రైవేట్‌ స్కూళ్లు, 2 లక్షల మంది విద్యార్థులు, 6700 మంది ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 182 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలు దాదాపు 71 వేల మంది విద్యార్థులు 116 డిగ్రీ కళాశాలలు, 2 లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బందులలోకి నెట్టిందని విమర్శించారు.

విద్యార్థులు భవిష్యత్‌ను పూర్తిగా గాలికి వదిలేసిందని ఈ నిర్ణయంపై విద్యార్థులు బలిపశువుగా మారారని అన్నారు. ఎన్ని ఎయిడెడ్‌ పాఠశాలలో మేనేజ్‌మెంట్‌ కమిటీలు పనిచేస్తున్నాయని పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించారు. అసలు కమిటీలే లేని పక్షంలో ఈ నిర్ణయాలకు విలువ ఉందా? ఇది ఆర్టీఈ సూత్రాలను ఉల్లంఘించినట్లు కాదా అని పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ఎయిడెడ్‌ సంస్థలను విలీనం, స్వాధీనం చేసుకునే అంశంలో ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోందని, విద్యాసంవత్సరం మధ్యలో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఎయిడెడ్‌ పాఠశాలలను, ఉపాధ్యాయులను ఆదుకోవాలన్న సదుద్దేశం ఉంటే దానికి స్వాధీనం చేసుకోవడ మే మార్గమా? ఇంతకన్నా మంచి నిర్ణయాలు, సరైన చర్యలు ఆలోచనలు కరువయ్యాయని మండిపడ్డారు.

మరోవైపు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తా రని ప్రశ్నించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో తెలపాలన్నారు. పాఠశాలలు, కళాశాలలను స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయానికి ముందు ఉపాధ్యాయులను, లెక్చరర్లను నియమించాలన్న ఆలోచన మీకు ఎందుకు రాలేదని పాలకులను పవన్‌ కల్యాణ్‌ నిలదీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement