Friday, May 17, 2024

AP | విశాఖలో ఐపీఎల్ మ్యాచ్‌లు.. 40 వేల సీట్ల కెపాసిటీతో స్టేడియం !

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో : ఆంధ్రలో ఈ ఏడాది మార్చి నెల ఆఖరులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. ఇవ్వాల (శనివారం) విజయవాడలోని ఒక హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఐపీఎల్ టీమ్ సభ్యులు చర్చలు జరుపుతున్నారని అన్నారు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి నాయకత్వంలో ఆంధ్ర నుంచి అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేయడమే లక్ష్యంగా పని వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాము. ఇందుకోసం ఇండియా మాజీ కెప్టెన్ రవి శాస్త్రి, ఇండియా మాజీ ప్లేయర్ శేఖర్ భరత్ తో ఒప్పందం కుదుర్చకున్నట్లు తెలిపారు. ఆంధ్ర క్రికెటర్లు దేశ జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యంగా ప్రతిభ ఉన్న క్రికెటర్లను గుర్తించి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో ప్రత్యేక శిక్షణ ఇస్తామని వీటికోసం ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు.

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ – 1, 2ను దిగ్విజయంగా నిర్వహించాము. తద్వారా ప్రతిభ ఉన్న ఎంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారని అన్నారు. ఏపీఎల్ – 2 మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ లో లైవ్ ఇవ్వడం వల్ల 40 లక్షల మంది వీక్షించారని తెలిపారు. అదేవిధంగా ఉమెన్ ఏపీఎల్ ను దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఆంధ్రలో విజయవంతంగా నిర్వహించామని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ దేశంలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారని తెలిపారు.

అదేవిధంగా ఏసీఏ సిబ్బంది, క్రీడాకారుల కోసం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల పరిధిలో లీగ్ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. దాదాపు 400 మంది క్రీడాకారుల పౌష్ఠికాహారం కోసం ఏడాదికి రూ. 1.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ విధానాన్ని దేశంలోనే మొట్ట మొదటి అమలు చేస్తున్న రాష్ట్రం మనదే అని అన్నారు. వైజాగ్ లో 40 వేల సీట్ల కెపాసిటీతో కొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

నాలుగేళ్లలో క్రికెట్ కోసం సాధించిన అభివృద్ధి, విజయవంతంగా టీ – 20, వన్డే, టెస్టు మ్యాచ్ లు నిర్వహణ తదితర వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె.వి.పురుషోత్తం, ఎన్. గీత, ఏసీఏ సీఈవో డా. ఎం.వి. శివారెడ్డి, గేమ్ డెవలప్మెంట్ జీఎం ఎం.ఎస్.కుమార్, సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఆర్.వి. చంద్రమౌళి చౌదరి, నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement