Tuesday, May 14, 2024

ఓటీఎస్‌పై పెరుగుతున్న ఆసక్తి.. పది లక్షల మంది రిజిస్టర్‌.. రూ. 339 కోట్ల ఆదాయం

అమరావతి, ఆంధ్రప్రభ: గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణాలు పొంది, వడ్డీ కట్టలేక సతమతమవుతున్న లబ్ధిదారుల కోసం ప్రభుతం ప్రవేశపెట్టిన వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) పథకంపై లబ్ధిదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. మొదట్లో లబ్ధిదారులెవరూ ముందుకు రాకపోవడంతో.. పథకం ఉద్దేశంపై గృహనిర్మాణ శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పు ఎంత ఉన్నా.. ఒకే మొత్తం చెల్లించడం ద్వారా రుణవిముక్తులు కావడంతోపాటు, రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ అందిస్తామంటూ లబ్ధిదారుల్లో అవగాహన పెంపొందించారు. అలాగే లబ్ధిదారుల విజ్ఞప్తుల మేరకు పథకం గడువును కూడా పొడిగించడంతో క్రమంగా చెల్లింపులు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు పది లక్షల మంది వరకు నగదు చెల్లించి శాశత హక్కు పట్టా కోసం రిజిస్టర్‌ చేసుకున్నారు. ఓటీఎస్‌పై ప్రతిపక్ష తెలుగుదేశం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతోపాటు, తమ ప్రభుతం అధికారంలోకి వచ్చిన తరాత పూర్తి ఉచితంగా పట్టా రిజిస్టర్‌ చేసి అందించడం జరుగుతుందని ప్రచారం నిర్వహించింది. అయినప్పటికీ లబ్ధిదారులు చెల్లింపులకే మొగ్గు చూపుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రుణ విముక్తి చేయడమే లక్ష్యం..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2000 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల కాలంలో 2.31 లక్షల కుటుంబాలు అప్పుడు అమలు చేసిన పథకం కింద రూ. 70.45 కోట్లు చెల్లిస్తే.. వడ్డీ రూ. 33.22 కోట్లు మాత్రమే మాఫీ అయింది. 2014 నుంచి 2019 వరకు ఓటీఎస్‌పై అధికారుల నుంచి 4 సార్లు ప్రతిపాదనలు పంపినా అమలు చేయలేదు. దీంతో ఈ అంశంపై దృష్టి సారించిన ప్రభుతం సచ్ఛందంగా ఓటీఎస్‌ చెల్లించే పథకాన్ని తీసుకొచ్చింది. తద్వారా లబ్ధిదారులు రుణ విముక్తులు కావడంతోపాటు, సదరు ఆస్తిపై పూర్తి హక్కులు పొందుతారు. ఓటీఎస్‌ కింద గ్రామాల్లో రూ. పది వేలు, మున్సిపాలిటీల్లో రూ. 15 వేలు, కార్పొరేషన్‌లలో రూ. 20 వేలు చెల్లించడం ద్వారా అంతకు మించిన అసలు, వడ్డీలు ఉన్నప్పటికీ మొత్తం మాఫీ అవుతుంది. మరోవైపు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందకుండా సొంతంగా నిర్మించుకున్న వారు కేవలం రూ. పది చెల్లించడం ద్వారా రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ పొందవచ్చు. రాష్ట్రంలో ఈ తరహాలో దాదాపు 50 లక్షల గృహ లబ్ధిదారులున్నారని గుర్తించిన ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించింది.

పెరుగుతున్న స్పందన..

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా జనం నుంచి మంచి స్పందన లభిస్‌తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 9 లక్షల 86 వేల 966 మందికిపైగా లబ్ధిదారులు వన్‌ -టైమ్‌ సెటిల్‌ మెంట్‌(ఓటీ-ఎస్‌) పథకం కింద నగదు చెల్లించి గృహాలను తమ పేరిట రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకు ఖజానాకు రూ. 339 కోట్ల 47 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఓటీ-ఎస్‌ పథకాన్ని వినియోగించుకున్న అత్యధిక మంది లబ్ధిదారులు కలిగిన జిల్లాల జాబితాలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టాప్‌లో ఉండటం గమనార్హం. చిత్తూరు జిల్లాలో ఈ పథకం ద్వారా రూ. 51.08 కోట్లు వచ్చాయి. తర్వాతి స్థానంలో రూ. 41.23 కోట్లతో తూర్పు గోదావరి జిల్లా, నెల్లూరు జిల్లా(రూ. 32.11 కోట్లు), అనంతపురము జిల్లా(రూ. 30.64 కోట్లు), ప్రకాశం జిల్లా(రూ. 28.02 కోట్లు), గుంటూరు, కర్నూలు జిల్లాలు(రూ. 25.76, 25.60 కోట్లు), విశాఖపట్నం జిల్లా(రూ.23.17 కోట్లు) ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో శ్రీకాకుళం జిల్లా(రూ. 20. 38 కోట్లు), కృష్ణా జిల్లా(రూ. 19 కోట్లు), పశ్చిమ గోదావరి జిల్లా(రూ. 16.66 కోట్లు), కడప జిల్లా(రూ. 13.35 కోట్లు) ఉండగా.. కేవలం రూ. 12 కోట్ల వసూళ్లతో విజయనగరం జిల్లా జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తుండటంతో మరింతమంది లబ్ధిదారులు ఓటీఎస్‌ చెల్లించేందుకు ముందుకొస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement