Monday, April 29, 2024

Governor – ఇదే పరిస్థితి కొనసాగితే మరో బీహార్ లా ఆంధ్రప్రదేశ్! … నారా లోకేష్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై తప్పుడుకేసులు
టిడిపి కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా 60వేలకుపైగా కేసులు
జగన్ సర్కారు తప్పుడు కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తాం
గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడతారని నమ్ముతున్నాం
ఓటరులిస్టు అవకతవకలపై రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం

విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల తరపున ఎవరు పోరాడున్నారో, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో… వారిపై దొంగకేసులు పెట్టి వేధిస్తున్న తీరును గవర్నర్ కు తెలియజేశామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకం, కక్షసాధింపు చర్యలపై ఈరోజు లోకేష్ నేతృత్వంలో టిడిపి ప్రతినిధి బృందం విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉంది, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఎపి మరో బీహార్ లా మారబోతోందని గవర్నర్ కు చెప్పాం. జగన్ కు నరనరాన కక్షసాధింపు తప్ప ఏమిలేదని ఆధారాలతో సహా గవర్నర్ కు వివరించాం, ప్రతిపక్షంపై ఎలా కక్ష సాధింపునకు పాల్పడుతున్నారో చెప్పాం, సీనియర్ నాయకులు అచ్చెన్న, కొల్లు రవీంద్ర, ధూళిపాళ నరేంద్రను నెలల తరబడి ఎలా జైలుకు పంపించారో వివరించాం, జెసి ప్రభాకర్ రెడ్డిపై ఎలా వంద కేసులు పెట్టి వేధిస్తున్నారో తెలియజేశాం.

టిడిపి కేడర్ పై 60వేల తప్పుడు కేసులు!
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ సీనియర్ నేతలపై 260 తప్పుడు కేసులు ఎలా పెట్టారో వివరాలతో సహా ఇచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కేడర్, సానుభూతిపరులపై 60వేల కేసులు ఎలా పెట్టారో వివరించాం. నేను యువగళం పాదయాత్ర చేసినపుడు నాపైన, నాయకులపైన, యువగళం వాలంటీర్లు, కార్యకర్తలపైన ఎలా కేసులు పెట్టారో సవివరంగా తెలియజేశాం. పవన్ కళ్యాణ్ ఆనాడు రాష్ట్రానికి రావాలనుకున్నపుడు ఎలా అడ్డుపడ్డారో తెలియజేశాం. రాష్ట్రంలో ప్రజలపై కూడా ముఖ్యమంత్రి ఎలా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారో చెప్పాం. అమర్ నాథ్ గౌడ్ ను ఎలా చంపారో, దళిత యువకుడు శ్యామ్ కుమార్ ను ఎలా అవమానించారో చెప్పాం, పలమనేరులో పదోతరగతి విద్యార్థిని మిస్బాను వైసిపి నేత వేధించి ఎలా ఆత్మహత్య చేసుకునేలా చేశారు, ఇంకోవైపు జ్యుడీషియరీపై కూడా ఎలా దాడులు చేస్తున్నారో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్ పై ఉంది, కాపాడతారని ఆశిస్తున్నాం.

ఎలక్టోరల్ బాండ్లు కూడా అవినీతేనా?
మూడుసార్లు సిఎంగా పనిచేసిన చంద్రబాబుపై ఆధారాల్లేక పోయినా, 17ఎ పర్మిషన్ లేకపోయినా దొంగకేసులు పెట్టి ఎలా సతాయించారో, జ్యుడీషియల్ రిమాండ్ కు ఎలా పంపారో వివరించాం. స్కిల్ కేసులో తొలుత 3వేల కోట్లు అవినీతి అన్నారు, తర్వాత 370 కోట్లు అన్నారు, ఇప్పుడు 27కోట్లు అంటున్నారు. అది కూడా పార్టీ ఎకౌంట్ లో పడ్డాయని చెప్పి ఎలా ఇబ్బంది పెట్టారో చూశాం. సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి సైకో అని అర్థమైంది, ఏ తప్పుచేయని చంద్రబాబుపై చివరకు 27కోట్లు పార్టీ అకౌంట్ కు వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిపై 27కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తారు, అది కూడా ఎలక్టోరల్ బాండ్లు గురించి, ఎవరైనా వింటే నవ్విపోరా? 2014నుంచి వైసిపికి ఎకౌంట్ లోకి 150కోట్లు ఎలా వచ్చాయి, వారికి ఎలాంటి ఖర్చులు లేవా?

తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తాం!
17ఎకి 2018లో సవరణ వచ్చింది, చంద్రబాబుపై కేసు విషయంలో పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా తీసుకోలేదని చెప్పాం, వివరాలన్నీ తెప్పించుకుంటామని చెప్పారు. భయం మా బయోడేటాలో లేదు… పోరాటమే, అడ్డొస్తే తొక్కుకుంటా పోతాం. చంద్రబాబు ఇంటీరియమ్ బెయిల్ పై ఉన్నారు, 10వతేదీనుంచి రెగ్యులర్ బెయిల్ పై విచారణ ఉంది, వచ్చే తీర్పులను బట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వంలో దొంగ కేసులు పెట్టడం అనివార్యం, రాష్టస్థాయి నుంచి గ్రామ కార్యకర్త వరకు కేసులు పెడుతున్నారు, న్యాయపోరాటం చేస్తాం. టిడిపి కార్యకర్తలకు న్యాయసహాయం అందిస్తున్నాం, కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది, కాపాడుకుంటాం. నేను, అచ్చెన్నాయుడు వ్యక్తిగతంగా చూస్తున్నాం.

- Advertisement -

రేపు ఎన్నికల కమిషన్ ను కలుస్తాం!
రాష్ట్రంలో ఓటర్ల జాబితా అవతకతవకలపై రేపు టిడిపి బృందం ఎన్నికల కమిషన్ ను కలుస్తుంది, 6లేఖలు ఇస్తాం, తప్పుల తడక ఓటరు లిస్టుపై ఫిర్యాదు చేస్తాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. దొంగఓట్లపై మేం పోరాడతాం, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, డిల్లీకి కూడా వెళ్లి పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి ఫోటోతో కూడా దొంగఓటు ఉంది, సిఎం 38కేసుల్లో దొంగ, 10సంవత్సరాల కేసుల్లో బెయిల్ పై తిరుగుతున్న దొంగ, సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్, అవినాష్ రెడ్డిని కాపాడటానికి సిబిఐని ఎపికి రానీయకుండా చేశారు. దొంగనుంచి మంచి పరిపాలన ఎలా ఆశిస్తాం? జగన్ పై 38కేసులు ఉన్నాయి, 11సిబిఐ, 7 ఈడి కేసులు ఉన్నాయి. పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నాడు, ఏ తప్పు చేయని చంద్రబాబును 38కేసులున్న వ్యక్తి 53రోజులు జైలులో ఉంచాడు, అందుకే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని అంటున్నాం. 2019నుంచి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యంగం అమలవుతోంది.

నాయకులంతా ప్రజల్లోనే ఉన్నాం!
ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాయకులందరం ప్రజల్లో ఉన్నాం, బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీపై ఇంటింటికీ తిరుగుతున్నాం, ప్రతిపక్షనేతలపై దాడులను కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. టిడిపి-జనసేన అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెబుతున్నాం. జెఎసి మీటింగ్ లో కూడా టిడిపి సూపర్ సిక్స్ పథకాలను జనసేనకు వివరించాం, చాలా బాగుతున్నాయని అన్నారు, పవన్ కొన్ని అదనంగా సూచించారు. వాటిపై జెఎసి మీటింగ్ లో చర్చిస్తున్నాం. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది, రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది, పశ్చిమప్రాంతంలో తాగునీటికి కటకటలాడుతున్నారు, దీనిపై ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నామని లోకేష్ తెలిపారు. గవర్నర్ ను కలిసిన వారిలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement