Friday, June 14, 2024

తూర్పుగోదావరి జిల్లాలో గుప్పుమంటున్న గంజాయి…

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి గుప్పుమంటుంది. చెడు వ్యసనాలకు బానిసై మత్తులో జోగుతూ గంజాయి సేవించడమే కాకుండా ఎదుటివారికి విక్రయించి డబ్బులు సంపాదించి మరింత జల్సాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్న యువత ఇటీవల కాలంలో పోలీసులు దాడుల్లో అరెస్టైన పరిస్థితి కనిపిస్తుంది. గంజాయి జోరుగా చేతులు మారుతుండడంతో నిఘా పెట్టిన జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అటు తూర్పుగోదావరి జిల్లా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోను ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అదే విధంగా కాకినాడ జిల్లా పరిధిలో కూడా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు నిఘా పెంచడంతో గంజాయి కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుల్లో దొరుకుతున్న వారందరూ ఎక్కువగా 25 ఏళ్ల లోపు యువకులే కావడం ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తోంది. ఇటుక బట్టీలలో పనిచేయడానికి వచ్చి గంజాయ విక్రయాల జరుపుతున్న ముగ్గురు వెస్ట్ బెంగాల్ యువకులు పోలీసులకు చిక్కారు. అంబేడ్కర్ జిల్లా కోనసీమ జిల్లా ఆలమూరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జొన్నాడ వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో రావులపాలెం సీఐ ఎన్. రజని కుమార్, ఆలమూరు ఎస్సై శివ ప్రసాద్ లు సిబ్బందితో కలసి దాడులు చేశారు. ఆ గ్రామ శివారులో అక్రమంగా గంజాయి కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు 21 కేజీల గంజాయిని ఆలమూరు తహశీల్దార్ శెట్టి, జొన్నాడ వీఆర్వో వెంకటేశ్వరరావు సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుంచి ఆలమూరు మండలంలో వివిధ బట్టీలలో పనులు చేసుకోవడానికి వచ్చారు. అయితే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయిని ఈ ప్రాంతానికి తీసుకువచ్చి అమ్ముతున్నట్లు పోలీసులు వివరించారు.

జల్సాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసై, గంజాయి తాగుతూ, చుట్టు పక్కల గ్రామాల్లో అమ్ముతున్న ఏడుగురు యువకులను అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. వాళ్లంతా 24 ఏళ్ల లోపు యువకులే కావడం గమనార్హం. ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లిలో గంజాయిని కొనుగోలు చేసుకుని, అమలాపురం పట్టణంలోని సావరం బైపాస్ దగ్గర మారుమూల ప్రదేశంలో గంజాయిని పంచుకుంటుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. త్రిపురారి సాయి సూర్య జగదీష్, దూలం వీరేంద్ర కుమార్, గోకరకొండ కొండబాబు, జుత్తిక పవన్, వాసంశెట్టి ప్రసాద్, బెహర కళ్యాణ్, కముజు నరసింహ ఏడుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 21 కేజీల గంజాయిని, 6 సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు. నిందితులను కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

గంజాయి అక్రమ రవాణా చేస్తూ
చెడు వ్యసనాలకు బానిసై గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు యువకులను ముమ్మిడివరం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 70 వేల విలువ చేసే 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన నర్సీపట్నం చుట్టుపక్కల నుంచి గంజాయి రవాణా అవుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అక్విడెట్ వద్ద గంజాయి రవాణా జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై సురేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అక్కడ గంజాయి ప్యాకెట్లు పంచుకుంటున్న నక్కా మధు, మాకే అబ్బులు, కొండేపూడి సిద్ధార్థ కుమార్, మోకా చంటి, మోకా శ్రీనివాసరావు, పెనుమాల విజయ్ కుమార్ అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముమ్మిడివరం తహసీల్దార్ ఎడ్ల రాంబాబు, వీఆర్వోలు వీఎస్ కిరణ్, వై రాధాకృష్ణ సమక్షంలో గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి నాలుగు మోటర్ సైకిల్స్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా మెజిస్ట్రేట్ రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement